నన్ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది : మమతా బెనర్జీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి దుర్గాదేవి మంత్రాన్ని పఠించారు.

నన్ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది : మమతా బెనర్జీ

Bjp Conspiring To Kill Me Says Mamata

BJP conspiring ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి దుర్గాదేవి మంత్రాన్ని పఠించారు. మంగళవారం బాంకుడా జిల్లాలోని ఛాత్నాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమత..సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే.. శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే.. ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ.. దుర్గా శివా క్షమా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే అంటూ చండీ స్తోత్రాన్ని పఠించారు.

ఈ సందర్భంగా కేంద్రహోంమంత్రి అమిత్​ షా పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు మమతాబెనర్జి. టీఎంసీ నేతలను వేధింపులకు గురిచేసేందుకు అమిత్ షా కుట్రలు చేస్తున్నారని మమత ఆరోపించారు. ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హారాల్లో కూడా అమిత్ షా జోక్యం చేసుకుంటున్నార‌ని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. దేశాన్ని కేంద్ర హోం మంత్రి పాలిస్తున్నారా? ఎక్కడ ఎవరిని అరెస్టు చేయాలో, ఎవరిని కొట్టించాలో అమిత్​ షా ఎలా నిర్ణయిస్తారు అని మమత ప్రశ్నించారు. ఏ కేసును ఎవరు దర్యాప్తు చేయాలో కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు.

ఎన్నికల కమిషన్ ని కచ్చితంగా అమిత్ షా నడపడం లేదని భావిస్తున్నానని మమత అన్నారు. వారి పనుల్లో మంత్రి జోక్యం తగదని హితవు పలికారు. టీఎంసీ నేతలను వేధింపులకు గురిచేసేందుకు అమిత్ షా కుట్రలు చేస్తున్నారని మమత ఆరోపించారు. తమకు పారదర్శకంగా ఉండే ఎన్నికలు కావాలని కోరారు.

ఎలక్షన్ కమిషన్.. నందిగ్రామ్ ఎటాక్ నేపథ్యంలో తన సెక్యూరిటీ డైరక్టర్ వివేక్ సహాయ్ ను తొలగించడంపై మమత స్పందిస్తూ.. బీజేపీ తనను చంపేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆరు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తుంటే..మంత్రులు వారితో చర్చలు జరపకుండా బెంగాల్ కి వచ్చి హోటల్స్ లో ఉంటూ తనను చంపేందుకు,టీఎంసీని అంతం చేసేందుకు మరియు ఈసీ సహకారంతో టీఎంసీపై కేసులు ఎలా పెట్టాలి అని కుట్రలు పన్నుతున్నారని మమత ఆరోపించారు. ఔట్ సైడర్(బయటివ్యక్తులు)గూండాల చేతిల్లో బెంగాల్ ఉండదని మమత అన్నారు. బ్యాంకులు,రైల్వేస్ ని అమ్మేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మమత తెలిపారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముకి భద్రత లేకుండా పోబోతుందని మమత తెలిపారు.

కాగా,బీజేపీ హిందుత్వ రాజ‌కీయాలు చేస్తోంద‌ని, తాను కూడా హిందువునే అని..హిందుత్వంలో తనతో ఎవరూ పోటీ పడలేరని.. చండీ మంత్రాన్ని చ‌దివాకే ఇంట్లోంచి బ‌య‌ట‌కు అడుగుపెడుతాన‌ ఇటీవల ఓ సభలో మమత చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఆ త‌ర్వాత నందీగ్రామ్‌లో నామినేష‌న్ వేశారు. ఆ సాయంత్ర‌మే జరిగిన తోపులాటలో మమత గాయపడింది. కోల్‌క‌తా ఆస్ప‌త్రిలో రెండు రోజులు చికిత్స పొందిన దీదీ..ఆదివారం నుంచి వీల్ చైర్ లో కూర్చొనే ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొంటున్నారు.