Selfie River : ప్రాణం మీదకి తెచ్చిన సెల్ఫీ మోజు, రాత్రంతా నదిలోనే..

యువతకు సెల్ఫీ పిచ్చి పట్టింది. సెల్ఫీలు దిగడం సోషల్ మీడియాలో షేర్ చేయడం వాటికొచ్చే లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవడం. సెల్ఫీల పిచ్చిలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలకు ప్రయత్నించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో కొంద‌రు త‌మ ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇన్ని అనర్థాలు జరుగుతున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు.

Selfie River : ప్రాణం మీదకి తెచ్చిన సెల్ఫీ మోజు, రాత్రంతా నదిలోనే..

Selfie River

Selfie River : యువతకు సెల్ఫీ పిచ్చి పట్టింది. సెల్ఫీలు దిగడం సోషల్ మీడియాలో షేర్ చేయడం వాటికొచ్చే లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవడం. సెల్ఫీల పిచ్చిలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలకు ప్రయత్నించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో కొంద‌రు త‌మ ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇన్ని అనర్థాలు జరుగుతున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు.

తాజాగా చెన్నైలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. పెరియామెట్ వాసి కార్తిక్(30) సెల్ఫీ కోసం పిచ్చి పని చేశాడు. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కార్తిక్ రాత్రి 10గంటల సమయంలో న‌ది ద‌గ్గ‌రికి వెళ్లాడు. అక్క‌డున్న బ్రిడ్జి మీదికి ఎక్కి.. సెల్ఫీ తీసుకోబోయాడు. సెల్ఫీ తీస్తుండ‌గా.. అతడి ఫోన్ చేతుల్లో నుంచి జారింది. దీంతో దాన్ని అందుకోవ‌డం కోసం జంప్ చేశాడు. అంతే.. బ్రిడ్జి పైనుంచి న‌దిలో ప‌డిపోయాడు. అతడి అదృష్టం బాగున్నట్టు ఉంది. పిల్ల‌ర్‌ను ప‌ట్టుకున్నాడు. కాపాడాలంటూ కేకలు వేశాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే రాత్రి పూట కావ‌డం.. అక్క‌డ ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో కార్తిక్ ఆర్త‌నాదాల‌ను ప‌ట్టించుకున్న నాథుడే లేడు. పైగా సాయం కోసం ఎవరికైనా ఫోన్ చేద్దామంటే.. కార్తిక్ దగ్గర ఫోన్ లేకపోయింది.

ఇక చేసేది లేక‌.. రాత్రి మొత్తం ఆ పిల్ల‌ర్‌నే ప‌ట్టుకొని బిక్కుబిక్కుమంటూ గ‌డిపాడు. అలా 8 గంటలు గడిచాయి. ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యంలో వాకింగ్ కు వ‌చ్చిన వాళ్లు కార్తిక్ ను గ‌మ‌నించి విస్తుపోయారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తాడు సాయంతో కార్తిక్ ని పైకి లాగారు. అలా, సెల్ఫీ పిచ్చితో కార్తిక్ తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తృటిలో చావు నుంచి తప్పించుకున్నాడు.

కాగా, అంత ఎత్తు నుంచి పడినా చిన్న గాయం కూడా కాకపోవడం కార్తిక్ అదృష్టం అనే చెప్పాలి. కార్తిక్ ను చెక్ చేసిన పోలీసులు.. అతడు మద్యం తాగి లేడని చెప్పారు. ఆ తర్వాత అతడిని ఇంటికి పంపేశారు. కాగా, నేపియర్ బ్రిడ్జి రాత్రి వేళ ఎంతో సుందరంగా కనిపిస్తుంది. కలర్ ఫుల్ లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో చాలామంది అక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. కార్తిక్ కూడా అలానే వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

సెల్ఫీలు తీసుకోవడం తప్పు కాదు. కానీ, ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దు. ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదు. బతికుంటే.. సెల్ఫీలు ఎప్పుడైనా, ఎన్నైనా తీసుకోవచ్చని గుర్తుంచుకోవాలి.