ప్రభుత్వంతో విభేదించడం దేశద్రోహం కాదు : సుప్రీం

ప్రభుత్వంతో విభేదించడం దేశద్రోహం కాదు : సుప్రీం

Farooq Abdullah జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దశాబ్దాలుగా జ‌మ్ముక‌శ్మీర్‌ కు ప్రత్యేకహోదా కల్పించబడిన ఆర్టిక‌ల్ 370ను ర‌ద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభ‌జించ‌డంపై ఫరూక్ అబ్దుల్లా చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలకు గాను ఆయనపై దేశద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయాలంటూ వేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది.

ఆర్టికల్ 370ని తిరిగి సాధించుకునేందుకు అవసరమైతే చైనా, పాకిస్తాన్ దేశాల సహాయం తీసుకుంటామంటూ ఫారూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారని, అయితే ఈ వ్యాఖ్యలు దేశ వ్యతిరేకమైన వ్యాఖ్యలని, దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని రజత్ శర్మ, నేహ్ శ్రీవాస్తవలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ఫారుఖ్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని, దేశద్రోహం కింద కేసులు నమోదు చేయాలని, ఐపీసీలోని సెక్షన్ 124-ఏ కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే, బుధవారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ప్ర‌భుత్వ అభిప్రాయంతో విభేదించే వ్యాఖ్య‌లు చేయ‌డం దేశ‌ద్రోహంగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ మేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం స్ప‌ష్టం చేసింది. జమ్ముక‌శ్మీర్‌కు ఉన్న ప్ర‌త్యేక హోదాను భారత ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డంపై ఫ‌రూక్‌..పాకిస్తాన్, చైనా మ‌ద్ద‌తు కోరిన‌ట్లు పిటిష‌న‌ర్ ఆధారాలు స‌మ‌ర్పించ‌లేక‌పోయార‌ని సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాకుండా, ఈ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు..పిటిష‌న్ దాఖ‌లు చేసిన వారికి రూ. 50 వేల జ‌రిమానా విధించింది.