NITI Aayog Report : జిల్లా హాస్పిటల్స్ లో లక్ష జనాభాకి 24 బెడ్స్..బీహార్ లో 6 మాత్రమే

భారతదేశంలోని జిల్లా హాస్పిటల్స్ లో 1 లక్ష జనాభాకు సగటున 24 బెడ్స్ మాత్రమే ఉన్నాయని నీతి ఆయోగ్ తాజా రిపోర్ట్ తెలిపింది.

NITI Aayog Report : జిల్లా హాస్పిటల్స్ లో లక్ష జనాభాకి 24 బెడ్స్..బీహార్ లో 6 మాత్రమే

Bihar (3)

NITI Aayog Report భారతదేశంలోని జిల్లా హాస్పిటల్స్ లో 1 లక్ష జనాభాకు సగటున 24 బెడ్స్ మాత్రమే ఉన్నాయని నీతి ఆయోగ్ తాజా రిపోర్ట్ తెలిపింది. కాగా,ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్(IPHS)2021 గైడ్ లైన్స్ ప్రకారం..జిల్లా హాస్పిటల్స్ 1 లక్ష జనాభాకి(2001 సెస్సెస్ యొక్క జిల్లా జనాభా సగటు ఆధారంగా) కనీసం 22 బెడ్స్ ను మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.

తాజాగా దేశంలోని జిల్లా ఆస్పత్రుల పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO India)భాగస్వామ్యంతో నీతి ఆయోగ్‌ రూపొందించిన నివేదికను గురువారం నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ విడుదల చేశారు. ఈ రిపోర్ట్ లో..అత్యధికంగా పాండిచ్చేరిలో 1 లక్ష జనాభాకి సగటున 222 బెడ్స్ ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో అండమాన్(200 బెడ్స్),లడఖ్(150 బెడ్స్),అరుణాచల్ ప్రదేశ్(104),డామన్ డయ్యూ(102 బెడ్స్) ఉన్నాయి. ఇక, 1 లక్ష జనాభాకి సగటున 6 బెడ్స్ తో బీహార్ ఈ రిపోర్ట్ లో చిట్టచివరి స్థానంలో నిలిచింది.

10 ముఖ్యమైన ఫర్ఫార్మెన్స్ సూచీలను(KPIs) పరిగణలోకి తీసుకొని 2017–18 సంవత్సరానికి సంబంధించిన హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) డేటాను ప్రధానంగా ఉపయోగించి దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని మొత్తం 707 జిల్లా హాస్పిటల్స్ పనితీరు అంచనా వేసి ఈ రిపోర్ట్ ను తయారుచేసింది నీతి ఆయోగ్. హాస్పిటల్స్ ను… చిన్న ఆసుపత్రులు (200 పడకల కంటే తక్కువ లేదా సమానం), మధ్య తరహా ఆసుపత్రులు (201–300 పడకల మధ్య) మరియు పెద్ద ఆసుపత్రులు (300 కంటే ఎక్కువ పడకలు) అనే మూడు కేటగిరీలుగా వర్గీకరించి ఈ అధ్యయనం చేపట్టారు.

“జిల్లా ఆసుపత్రుల పనితీరులో ఉత్తమ పద్ధతులు” టైటిల్ తో విడుదలైన ఈ రిపోర్ట్ లో…. పడకలు, వైద్య మరియు పారామెడికల్ సిబ్బంది, కోర్ హెల్త్ మరియు డయాగ్నొస్టిక్ టెస్టింగ్ సర్వీసుల నుండి అవుట్‌పుట్‌ల వరకు సూచికలలో 24 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని 75 జిల్లా హాస్పిటల్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి.

మొత్తం 707 ఆసుపత్రులలోని 101 హాస్పిటల్స్.. మొత్తం 14 ఫంక్షనల్ స్పెషాలిటీలను కలిగి ఉండాలనే ప్రమాణాలను నెరవేర్చాయని నివేదిక పేర్కొంది. అన్ని పంక్షనల్ స్పెషాలిటీస్ తో తమిళనాడు అత్యధిక వాటా కలిగి ఉండగా,కర్ణాటక, పశ్చిమ బెంగాల్ మరియు కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

నివేదిక ప్రకారం.. భారతదేశంలోని జిల్లా ఆసుపత్రులు.. 1 లక్ష జనాభాకు 1 నుండి 408 పడకల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రతి లక్ష జనాభాకు 217 జిల్లా ఆసుపత్రులలో కనీసం 22 పడకలు ఉన్నట్లు కనుగొనబడినప్పటికీ.. తక్కువ జనాభా కలిగిన జిల్లాలు మౌలిక సదుపాయాల సంబంధిత ముఖ్యమైన ఫర్ఫార్మెన్స్ సూచీల్లో బాగా పని చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఇక,ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మొదలైన రాష్ట్రాలలో ఎక్కువ జనాభా కలిగిన జిల్లాలు..బెడ్ ఆక్యుపెన్సీ రేట్లు మరియు ఒక సర్జన్‌ చేసే శస్త్రచికిత్సల సంఖ్య వంటి ముఖ్యమైన సూచీల్లో అధిక స్కోర్‌లను పొందాయని నివేదిక పేర్కొంది.

తెలంగాణలో

తెలంగాణలోని జిల్లా ఆస్పత్రుల్లో లక్ష మంది జనాభాకు సగటున 10 పడకల చొప్పున మాత్రమే ఉన్నాయని నీతి ఆయోగ్‌ రిపోర్ట్ తెలిపింది. రాష్ట్రంలో జిల్లా ఆస్పత్రిలో బెడ్‌ ఆక్యుపెన్సీ రేటు సగటున 74.07గా ఉంది. తెలంగాణ నుంచి ఆరు జిల్లా ఆస్పత్రులను పరిగణనలోకి తీసుకొని వివరాలను రూపొందించామని నీతి ఆయోగ్‌ తెలిపింది. సిజేరియన్లలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. జిల్లా ఆస్పత్రిలో సగటున 53.51 శాతం సీ-సెక్షన్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయి.

ముఖ్యంగా పెద్ద ఆస్పత్రుల విభాగంలో 69.93 శాతం సిజేరియన్లతో కరీంనగర్‌ జిల్లా ఆస్పత్రి దేశంలోనే రెండో స్థానంలో, మధ్యస్థాయి ఆస్పత్రుల విభాగంలో 65.42 శాతంతో ఖమ్మం జిల్లా ఆస్పతి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్కో ఆస్పత్రిలో సగటున 14 రకాల కోర్‌ హెల్త్‌కేర్‌ సేవలు, డయాగ్నస్టిక్‌ సేవలు ఉన్నాయి. డయాగ్నస్టిక్‌ సేవల్లో చిన్న ఆస్పత్రుల విభాగంలో దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తూ వికారాబాద్‌ జిల్లా హాస్పిటల్ తొలి స్థానంలో నిలిచింది.

మధ్య స్థాయి ఆస్పత్రుల విభాగంలో ఉత్తమ పనితీరులో ఖమ్మం జిల్లా ఆస్పత్రి రెండో స్థానంలో ఉంది. ఈ రెండు ఆస్పత్రుల్లో డయాగ్నోస్టిక్స్ కు అవసరమైన అన్ని సేవలు ఉన్నాయని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో అవసరమైన సేవలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న టీ-హబ్‌ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపింది. తద్వారా రోగుల ఖర్చులు తగ్గుతున్నాయని పేర్కొంది. కాగా, ఒక్కో జిల్లా ఆస్పత్రిలో ఒక డాక్టర్‌ సగటున 491 సర్జరీలు చేశారు. ఇది దేశంలో రెండో స్థానం. అలాగే, సగటున 27 మంది ఔట్‌ పేషంట్లకు ఒక డాక్టర్‌ ఉన్నారు.

ఆంధ్ర్రదేశ్ లో

జిల్లా హాస్పిటల్స్ లో బెడ్స్ విషయంలో ఏపీ వెనుకబడింది. జాతీయ సగటు 24 కాగా..ఏపీలో ప్రతి లక్ష జనాభాకు 18 బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జిల్లా హాస్పిటల్స్ ర్యాంకింగ్స్ లో 22వ స్థానంలో ఏపీ నిలిచింది. పనితీరు పరంగా విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ ముందువరుసలో ఉంది. రాష్ట్రంలోని జిల్లా హాస్పిటల్స్ లో సగటున 80.07శాతం పడకలు భర్తీ అవుతున్నాయి. సగటు పడకల భర్తీ విషయంలో దేశంలోనే ఏపీ ఐదవ స్థానంలో ఉంది.

సిబ్బంది సంఖ్యతోపాటు,ఇతర కీలకమైన పనితీరు సూచీల్లో ఇది దేశంలోనే పెద్ద ఆస్పత్రులు కేటగిరీలో మొదటిస్థానంలో నిలిచింది. తెలంగాణ.అనంతపురం,శ్రీకాకుళం రిమ్స్,నెల్లూరు జనరల్ హాస్పిటల్స్ కూడా వివిధ సూచికల్లో మొరుగైన స్థానాల్లో నిలిచాయి.  ఇక,సిజేరియన్ కాన్పులు 42.74 శాతం జరగుతున్నాయి. ఈ విషయంలో తమిళనాడు,తెలంగాణ,డామన్ డయ్యూ,లక్షద్వీప్,పుదుచ్చేరి తర్వాతి స్థానంలో ఏపీ ఉంది. అయితే పెద్ద ఆస్పత్రుల కేటగిరిలో సిజేరియన్ కాన్పులు చేస్తున్న జాబితాలో మచిలీపట్నం జిల్లా హాస్పిటల్ దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది.

ఇక,ఏపీలోని జిల్లా హాస్పిటల్స్ లో ఒక్కో సర్జన్ సగటున 165 ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇది జాతీయ సగటు 194 కంటే తక్కువ. ఒక్కో డాక్టర్ సగటున 16 మంది ఓపీడీ రోగులను పరిశీలిస్తున్నారు. ఇది జాతీయ సగటు 27 కంటే తక్కువ. జిల్లా హాస్పిటల్స్ లో 13 ముఖ్యమైన వైద్య సేవలు,12 అనుబంధ సేవలు అందుతున్నాయి. ప్రకటించిన అన్ని సేవలను అందించే హాస్పిటల్స్ లో కర్ణాటక(28.6శాతం),తెలంగాణ(19శాతం) ఆంధ్రప్రదేశ్(14శాతం)తో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. నీతిఆయోగ్ 14 జిల్లా స్థాయి హాస్పిటల్స్ ను పరిశీలించగా..అందులో కేవలం ఏడింటికి మాత్రమే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్స్(IPHS)ప్రమాణాలున్నాయి.

ALSO READ  కడుపు నింపుకోవటానికి ప్రాణాలు పణంగా పెడుతున్న గిరిజనులు