Tollywood : కరోనా చిత్రాలు.. వేల కోట్లు నష్టపోయిన సినీ పరిశ్రమ..

కరోనా.. సినీ పరిశ్రమను అతలాకుతలం చేసి పారేసింది.. కోలుకోలేని దెబ్బ తీసింది.. సినీ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసింది.. ఎప్పుడూ సందడిగా ఉండే థియేటర్లు ఇప్పుడు బోసిపోతున్నాయి..

Tollywood : కరోనా చిత్రాలు.. వేల కోట్లు నష్టపోయిన సినీ పరిశ్రమ..

Tfi

Tollywood: కరోనా.. సినీ పరిశ్రమను అతలాకుతలం చేసి పారేసింది. కోలుకోలేని దెబ్బ తీసింది. సినీ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎప్పుడూ సందడిగా ఉండే థియేటర్లు ఇప్పుడు బోసిపోతున్నాయి. కిక్కిరిసిపోయే కౌంటర్లు కళ తప్పాయి. వెండి తెరలు వెలవెలబోతున్నాయి. సాదాసీదా థియేటర్ల నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు ఎక్కడ చూసినా అచ్చంగా ఇదే సీన్‌ కనిపిస్తోంది. ఇంతకీ కరోనా ఫస్ట్‌ వేవ్‌ నుంచి సెకండ్‌ వేవ్‌ వరకు సినీ పరిశ్రమ ఎంత నష్టపోయింది? సినిమా పరిశ్రమ గురించి చెప్పాలంటే కరోనా ముందు కరోనా తర్వాత అనే చెప్పే పరిస్థితి వచ్చిందా ?

ఇండియన్‌ సినిమాను కుదిపేసిన కరోనా.. ఒక్క ఏడాదిలోనే వేల కోట్ల నష్టాలు.. షూటింగ్‌ పూర్తైనా రిలీజ్‌ చేయలేని పరిస్థితి.. కరోనా దెబ్బకు కళ తప్పిన కృష్ణా నగర్‌.. ఇప్పుడు అన్ని రంగాల పరిస్థితి.. కరోనాకు ముందు, కరోనా తర్వాత.. అన్నట్లుగా మారింది. దీనికి సినీరంగం మినహాయింపేమీ కాదు. మూడు రిలీజులు ఆరు షూటింగ్‌లతో ఎప్పుడూ కళకళలాడే చిత్రసీమ ఒక్కసారిగా బోసిపోయింది. కరోనా దెబ్బకు సినీ పరిశ్రమ దారుణంగా నష్టపోయింది. ‌ఎక్కడ షూటింగ్‌లు అక్కడే నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. స్టూడియోలకు తాళాలు పడ్డాయి. ఫిల్మ్‌ సిటీలు నిర్మానుష్యంగా మారిపోయాయి. సినీకార్మికుల జీవితాలు చితికిపోయాయి. ఇలా, టోటల్‌గా సినీ ఇండిస్ట్రీపై లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ పడింది. కరోనా మహమ్మారి సినిమా రంగాన్ని చావుదెబ్బ తీసింది.

రెండున్నర గంటలపాటు ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టాలంటే మాటలు కాదు. దీనికోసం 24 క్రాఫ్ట్స్ పనిచేయాల్సి ఉంటుంది. వందలాదిమంది రాత్రి, పగలు అని తేడా లేకుండా కష్టపడితేనే ఆ సినిమా పూర్తవుతుంది. కొన్ని సినిమా షూటింగ్‌లు నెలల పాటు నడిస్తే.. భారీ బడ్జెట్‌ సినిమాలు ఏళ్లపాటు సాగుతాయి. ఓ సినిమా వెనుక అంత కష్టం దాగుంటుంది. ఒక సినిమా కనీసం 200 మంది కుటుంబాల కడుపు నింపుతుంది. ఏడాదికి పైగా వీరంతా రోడ్డున పడ్డారు. షూటింగ్‌లు నిలిచిపోవడంతో అందరి బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

మొదటి వేవ్‌ తర్వాత కేసులు అదుపులోకి రావడంతో లాక్‌డౌన్‌ ఎత్తేశారు. దేశవ్యాప్తంగా పరిమిత సిబ్బందితో షూటింగ్‌లు అనుమతులు ఇచ్చారు. అరకొరగా సినిమాలు విడుదలైనా థియేటర్‌కు వచ్చి సినిమా చూసేందుకు ఎక్కువ మంది ప్రేక్షకులు ధైర్యం చేయలేకపోయారు. మరికొన్ని సినిమాలు హాఫ్‌ షూటింగ్‌ కంప్లీట్‌ కాకముందే సెకండ్‌ వేవ్‌ మొదలైంది. మళ్లీ లాక్‌డౌన్‌ పడింది. దీంతో ఎక్కడి షూటింగ్‌లు అక్కడే నిలిచిపోయాయి. యథావిథిగా సినీ కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ నుంచి కోలుకోవడంతో లాక్‌డౌన్‌ ఎత్తేసి షూటింగ్‌లకు అనుమతి ఇస్తున్నారు. దీంతో మళ్లీ రెడీ, స్టార్ట్‌ కెమెరా, యాక్షన్‌.. అంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పనిలేక ఇంట్లో కూర్చున్న సినీ కార్మికులకు ఇది శుభవార్తే. కానీ ఈ సంతోషం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి.

కరోనా సమయంలో సినీ ప్రేక్షకులకు కొత్త ఫ్లాట్‌ ఫాం పరిచయమైంది. అదే ఓటీటీ.. ఓవర్‌ ది టాప్‌! దీనికి జనం బాగా అలవాటు పడ్డారు. భారీ బడ్జెట్‌ సినిమాలు, అగ్రహీరోల సినిమాలైతే తప్ప థియేటర్‌కు వెళ్లే సాహసం చేయడం లేదు. ఇక చిన్న బడ్జెట్‌ నిర్మాతలైతే ఓటీటీకే జై కొడుతున్నారు. ఈ మధ్య కాలంలో ‘జగమే తంత్రం’, ‘రాధే’, ‘ఏక్‌ మినీ కథ’, ‘బట్టల రామస్వామి’, ‘సినిమాబండి’, ‘థ్యాంక్‌ యూ బ్రదర్‌’ ఇలాంటి సినిమాలన్నీ ఓటీటీనే నమ్ముకున్నాయి. నిజానికి ఒక చిత్ర యూనిట్‌.. ప్రేక్షకులకు థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలనే చూస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి సహకరించడం లేదు.

ఇప్పుడు అన్నీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇవ్వడంతో కరోనా నిబంధనల మధ్య షూటింగ్‌లు మొదలుకానున్నాయి. షూటింగ్‌ల విషయం పక్కన పెడితే
సినిమాలు ఎక్కడ, ఎలా రిలీజ్‌ చేస్తారన్నదే ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన థియేటర్ల యజమానులు తలుపులు తెరిచే పరిస్థితుల్లో లేరు. అటు
జనాలు కూడా థియేటర్‌లో సినిమా చూసే సాహసం చేస్తారా ? అంటే సందేహమే..!

ఎదురు చూపులకు బ్రేక్‌ పడింది. ఛలో ఛలో అంటూ షూటింగ్స్‌ మొదలవుతున్నాయి. ఇదంతా ఓకే.. మరి థియేటర్ల పరిస్థితి ఏంటి ? థియేటర్లను ఓపెన్‌ చేసే పరిస్థితుల్లో యజమానులు ఉన్నారా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. వచ్చే కలెక్షన్లతో కనీసం కరెంట్‌ బిల్లులు కూడా కట్టలేమంటున్నారు. షోకి షోకి మధ్య శానిటైజేషన్‌కే తడిసి మోపెడవుతుందని అంటున్నారు. ఇక గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడంతో థియేటర్‌ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు కరుణిస్తే కానీ థియేటర్‌ తలుపులు తెరిచే పరిస్థితి లేదు అంటున్నారు.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం… ఇది సినీ పరిశ్రమ పరిస్థితి. ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినా.. అటు థియేటర్‌ యజమానులపై మాత్రం దయ చూపడం లేదు. కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడడంతో యజమానులు నిండా మునిగిపోయారు. మునుపెన్నడూ చూడని సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నారు. లాక్‌డౌన్‌కి లాక్‌డౌన్‌కి మధ్య వచ్చే గ్యాప్‌లో థియేటర్లు ఓపెన్‌ చేయలేక.. అలాగని మూసి ఉంచలేక.. నానా కష్టాలు పడుతున్నారు.

కరోనా ఫస్ట్‌ వేవ్‌ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా థియేటర్‌ యజమానులంతా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. అప్పటి వరకు ఉన్న కరెంట్‌ బిల్లులు, ఆక్యుపెన్సీ తగ్గిపోవడం, పార్క్‌ ఫీజులు ఎత్తేయడం, ప్రేక్షకులు పెద్దగా థియేటర్‌ల‌వైపు చూడకపోవడంతో చాలా నష్టపోయారు. ఇప్పుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ చేయాలంటే చాలా సమస్యలే ఉన్నాయి.

ఇప్పటికిప్పుడు థియేటర్లలో సందడి కన్పించాలంటే వరుసగా పెద్ద సినిమాలు విడుదల కావాల్సిందే! లేదంటే చిన్న సినిమాల కోసం ఓటీటీ చాలనుకుంటున్నారు ప్రేక్షకులు.
‘రాధే శ్యామ్‌’, ‘పుష్ప’, ‘ఖిలాడీ’, ‘థాంక్యూ’, ‘శ్యామ్‌ సింగ రాయ్‌’, ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘ఆచార్య’ లాంటి సినిమాలు విడుదలైతేనే మళ్లీ థియేటర్లకు పూర్వ వైభవం వచ్చే అవకాశముంది.

ఫస్ట్‌ వేవ్‌ కారణంగా 9 నెలల పాటు సినిమా హాళ్లు మూతపడ్డాయి. మళ్లీ సెకండ్‌ వేవ్‌లో మరో రెండు నెలలు థియేటర్లకు తాళాలు పడ్డాయి. ఈ ఎఫెక్ట్‌తో పెండింగ్‌ కరెంట్‌ బిల్లులు కొండలా కన్పిస్తున్నాయి. దీనికి తోడు పార్కింగ్‌ ఫీజు రద్దు చేయడం, జీఎస్టీ ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరోవైపు ఎగ్జిబిటర్స్‌కి సర్వీస్‌ ప్రొవైడైర్స్‌తో సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. నిర్మాతలకు – ఎగ్జిబిటర్స్‌కు మధ్య పర్సంటేజ్‌ విధానంలో వివాదాలు.. ఇలా సమస్యలన్నీ ఊపిరిసలపనివ్వడం లేదు..

ఫస్ట్‌ వేవ్‌ తర్వాత థియేటర్‌ యజమానులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని వరాలు ప్రకటించింది. లాక్‌డౌన్‌తో మూతబడిన సినిమా హాళ్ల విద్యుత్‌ బిల్లులను రద్దు చేయడంతో పాటు టిక్కెట్‌ రేట్లు పెంచుకునేందుకు వీలు కల్పించడం, అదనపు షోలకు అనుమతి ఇవ్వడం లాంటి వరాలను ప్రకటించింది.కానీ వాటి అమలు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ తర్వాత సెకండ్‌ వేవ్‌ రావడంతో మరో రెండు నెలలు థియేటర్‌లు మూతపడ్డాయి. ఇప్పుడు మళ్లీ సినిమా హాళ్లు తెరుచుకునేందుకు అనుమతులు కూడా వచ్చాయి. కానీ అప్పుడెప్పుడో ఇచ్చిన హామీకి సంబంధించి, ఏ ఒక్కటీ నెరవేరలేదు..

లాక్‌డౌన్‌ ఎత్తేసినా సినిమా హాళ్లు తెరుచుకునే పరిస్థితి లేదంటున్నారు థియేటర్లు యజమానులు. ఏపీలో కూడా హాళ్లు తెరుచుకుంటేనే పెద్ద సినిమాలు రిలీజ్‌ అవుతాయని చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చి హామీలు ఇంత వరకు అమలు కాలేదని.. రెండు రోజుల్లో సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలుస్తామని
థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరనున్నారు.

అటు ఆంధ్రాలోనూ థియేటర్‌ యజమానులను సమస్యలు వెంటాడుతున్నాయి. అక్కడ ప్రభుత్వం మూడు నెలలు కరెంట్‌ బిల్లులు రద్దు చేసింది. మరికొన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. వాటిని నెరవేర్చాలని ఆంధ్రా ఎగ్జిబిటర్స్‌ కోరుతున్నారు. తెలంగాణలో పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తేసినా ఆంధ్రాలో మాత్రం ఈనెలాఖరు వరకు లాక్‌డౌన్‌ నడవనుంది. అంటే, వచ్చే నెలలోనే అక్కడ షూటింగ్‌లు ప్రారంభమయ్యే అవకాశముంది. పూర్తి ఆక్యుపెన్సీతో పర్మిషన్‌ ఇస్తే తప్ప సినిమాలు రిలీజ్‌ చేయడం కష్టమనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో బొమ్మ పడాలంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా చేయూతనివ్వాల్సిందే !