GANGA Pushkaralu 2023 : విష్ణుమూర్తి పాదపద్మాల నుంచి పుట్టిన గంగానది .. పురాణాల్లో గంగమ్మ ఘట్టాలు, పవిత్ర గంగాజలం ఘన చరిత్ర

హిమాలయాల్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న గంగానది లక్షల హెక్లార్ల పంటలకు ప్రాణాధారంగా ఉంది గంగానది.గంగా ప్రవాహంతో భరతజాతి సంస్కృతి సంప్రదాయాలు ముడిపడివున్నాయి. హిందువుల పవిత్ర పూజల నుంచి పితృకార్యాల వరకు గంగను స్మరించకుండా ఉండలేరు.

GANGA Pushkaralu 2023 : విష్ణుమూర్తి పాదపద్మాల నుంచి పుట్టిన గంగానది .. పురాణాల్లో గంగమ్మ ఘట్టాలు, పవిత్ర గంగాజలం ఘన చరిత్ర

GANGA Pushkaralu 2023

Ganga Pushkaralu 2023 : ఎంతో మహత్తు కలిగిన గంగనదిని హిందువులు దైవ స్వరూపంగా భావిస్తారు. ఎన్నో పేర్లతో ఆరాధిస్తారు.ఇంద్రలోకంలో మందాకినీగా.. పాతాళలోకంలో భోగవతిగా.. భూలోకంలో అలకనందగా పిలుస్తుంటారు.అటువంటి పమమ పవిత్రమై గంగా ప్రవాహంతో భరతజాతి సంస్కృతి సంప్రదాయాలు ముడిపడివున్నాయి. హిందువుల పవిత్ర పూజల నుంచి పితృకార్యాల వరకు గంగను స్మరించకుండా ఉండలేరు. ఆ ప్రవాహం పుణ్యమాని సాగరులు ముక్తులయ్యారు. భూమి మురిసిపోయింది. దేవతలు పులకించారు. మనుషులు పరవశించారు. జలచరాలు జయజయధ్వానాలు చేశాయి. పచ్చని పంటలు ప్రాణంపోసుకున్నాయి. భూమి స్వర్గమైంది. ఆ వైభోగం ముందు స్వర్గమే చిన్నబోయిందట.

పుష్కరాలనే కాదు గంగమ్మకు భారతీయతకు విడదీయరాని బంధం. హిమాలయాల్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న గంగానది లక్షల హెక్లార్ల పంటలకు ప్రాణాధారం. రైతులు, మత్స్యకారులు.. ఇలా ఒకరేమిటి గంగమ్మ ఒడిలో కాలం వెళ్లదీసేవారు ఎందరో.. గంగమ్మతో హిందువులకు ఎంతో సెంటిమెంట్‌. పూజలు, శుభకార్యాలు, పితృకార్యాలు, పిండ ప్రదానాలు ఇలా ఏదైనా గంగా జలం ఉండాల్సిందే. భారతీయుల జీవితాలు గంగతోనే ముడిపడ్డాయి. బిడ్డ పుట్టగానే గొంతులో ఓ చుక్క గంగతీర్థం పోయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. బిడ్డకు చేయించే తొలి స్నానం గంగాజలంతోనే… ‘గంగేచ, యమునేచైవ గోదావరీ సరస్వతీ…’ అంటూ గంగమ్మను గంగాళంలోకి ఆహ్వానిస్తారు. ఆ పిలుపు వినిపించగానే, సర్వనదుల ప్రతినిధిగా… బిరబిరా తరలివస్తుంది గంగ.గంగా పరివాహక ప్రాంత ప్రజలు సంకల్పం చెప్పుకున్నప్పుడు… తాము గంగకు ఏ దిక్కున ఉన్నారో పరమాత్మకు విన్నవించుకోవాలి. లేదంటే, ఆ కోరిక దేవతకు చేరదు. భారతీయులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా మునిగి తీరాలనుకునే జలక్షేత్రాల్లో గంగానది ఒకటి. ఆ స్పర్శతో సకలపాపాలూ హరించుకుపోతాయన్న నమ్మకం.

గంగ పుట్టుక వెనుక ఓ పురాణ కథ చెబుతారు. వామనుడు మూడడుగుల నేల అడిగాడు. బలి సవినయంగా సమర్పించుకున్నాడు. ఒక అడుగు భూమిని ఆక్రమించింది. రెండో అడుగు… ఇంతై ఇంతింతై బ్రహ్మలోకం వరకు విస్తరించింది. సాక్షాత్తు విష్ణుమూర్తి పాదం… గడపదాకా రావడమంటే, ఎంత అదృష్టం! భక్తితో కాలు కడిగి, ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు బ్రహ్మ. ఆ తీర్థమే… సురగంగగా అవతరించింది. భగీరథుడి కృషితో భూలోకానికి వచ్చింది. భారతీయుల హృదయగంగై ప్రవహించింది. భూగోళశాస్త్ర పరంగా చూసినా… గంగ ఇప్పటిది కాదు. వేదకాలం నాటికే ప్రవహించింది.

GANGA Pushkaralu : పరమ పవిత్ర గంగా పుష్కరాలు .. పుష్కర ప్రాశస్త్యం గురించి బ్రహ్మా మహేశ్వరులు చెప్పిన రహస్యం ఇదే

రామావతారంలో తాను గంగానది ఒడ్డునే పుడతానని విష్ణువు దివిజ గంగకు మాటిచ్చాడు. సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు గుహుడు దాటింది గంగానదినే. ఇక భారతమైతే గంగ ప్రవేశంతోనే గొప్ప మలుపు తిరుగుతుంది. శంతన మహారాజు అద్భుత సౌందర్యరాశి అయిన గంగ మీద మనసుపడతాడు. వరాలిచ్చి మనువాడతాడు. ఆ జంటకు పుట్టిన బిడ్డే భీష్మపితామహుడు. మహాభారతంలో… అంపశయ్య మీది నుంచే భీష్ముడు గంగా మహత్తును వివరిస్తాడు. ఒక్క గంగాస్నానంతో… యజ్ఞయాగాదులు చేసినంత పుణ్యం, పూజలూ వ్రతాలూ చేసినంత ఆధ్యాత్మిక సంపత్తి. గంగ తగిలితే చాలు… అటు ఏడు తరాలూ ఇటు ఏడు తరాలూ పవిత్రమైపోతాయట.

గంగ లేని దేశం… సోమం లేని యజ్ఞమట! చంద్రుడు లేని రాత్రిలాంటిదట. పూలు పూయని చెట్టులాంటిదట. ‘ఇన్ని మాటలకు కానీ, గంగ గొప్పదనం చెబుతూ పోతే, సముద్రంలో నీటి నిల్వలను లెక్కపెట్టినట్టే’ అంటాడు భీష్మపితామహుడు! గంగ మహత్యానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. ఆ నీటికి కఫాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకే తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నవారి గొంతులో చిటికెడు గంగ పోస్తారు. గంగానదిలోని కొన్నిరకాల సూక్ష్మక్రిములకు వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. గంగోత్రి నుంచి ఎన్నో అరుదైన మొక్కల్నీ వనమూలికల్నీ తనలో కలుపుకుని ప్రవహించే గంగానదికి ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అన్నిటికీ మించి, గంగ మీదున్న నమ్మకం, అచంచలమైన భక్తి..ఆ గంగాజలానికి అంతటి మహత్తునిచ్చింది.

GANGA Pushkaralu 2023 : గంగ పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు, కాశీలో 100 హెక్టార్లలో నిర్మించిన ప్రత్యేక టెంట్‌ సిటీ ప్రత్యేకతలు