Harish Rao On Medical College : నిన్న రిజర్వేషన్లు, నేడు మెడికల్ కాలేజీలు.. పార్లమెంటు సాక్షిగా అబద్దాలు-హరీష్ రావు

కేంద్ర ప్ర‌భుత్వం ప‌దే ప‌దే ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. పార్ల‌మెంట్ సాక్షిగా గోబెల్స్ ప్ర‌చారానికి దిగిందన్నారు.

Harish Rao On Medical College : నిన్న రిజర్వేషన్లు, నేడు మెడికల్ కాలేజీలు.. పార్లమెంటు సాక్షిగా అబద్దాలు-హరీష్ రావు

Harish Rao On Medical College

Harish Rao On Medical College : మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. తెలంగాణ‌లో మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్ర ప్ర‌భుత్వం ప‌దే ప‌దే ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. పార్ల‌మెంట్ సాక్షిగా గోబెల్స్ ప్ర‌చారానికి దిగిందన్నారు.

మొన్న గిరిజ‌న రిజ‌ర్వేష‌న్ల పెంపు ప్ర‌తిపాద‌న‌లు తెలంగాణ నుంచి రాలేద‌ని చెప్పిన కేంద్రం.. ఈరోజు మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుపైనా లోక్ స‌భ వేదిక‌గా దుష్ప్ర‌చారం చేస్తోందని సీరియస్ అయ్యారు. తెలంగాణ నుంచి త‌మ‌కు ఎలాంటి ప్ర‌తిపాద‌న‌లు అంద‌లేద‌ని కేంద్ర వైద్యారోగ్య‌శాఖ స‌హాయ మంత్రి భార‌తీ ప‌వార్ పార్ల‌మెంటులో చెప్ప‌డం బాధాక‌రం అన్నారు హరీష్ రావు.

మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌లుమార్లు కేంద్ర ప్ర‌భుత్వానికి విన్న‌వించిందని ఆయన తెలిపారు. అయినా, కేంద్ర మంత్రులు పార్ల‌మెంట్ సాక్షిగా ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతూ తెలంగాణ‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతూనే ఉన్నారని వాపోయారు. కేంద్రం స‌హ‌క‌రించక‌పోయినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం అడుగులు వేస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు.

”మెడికల్ కాలేజీల అంశంలో బీజేపీ కేంద్రమంత్రులు పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు రాలేదని మొన్న అసత్యాలు చెప్పగా, మెడికల్ కాలేజీల కోసం ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని నేడు మరోసారి అబద్ధాలు చెప్పారు. ఇది చాలా దారుణం, బాధాకరం” అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.

2015లో అప్పటి కేంద్ర ఆరోగ్యమంత్రిగా ఉన్న జేపీ నడ్డా… నాటి తెలంగాణ ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డికి రాసిన లేఖను కూడా హరీశ్ రావు పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య కళాశాలలపై పంపిన ప్రతిపాదనలకు ఆ లేఖలో నడ్డా బదులిచ్చారు. ఈ లేఖ ఆధారంగానే హరీశ్ రావు కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు.