Bandi Sanjay : కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ముంచుతాడు : బండి సంజయ్
ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టే సీఎం కేసీఆర్ ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల కోసం బీజేపీ మాత్రమే పోరాటం చేసిందన్నారు.

Bandi Sanjay Fire CM KCR
Bandi Sanjay Fire CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శలు చేశారు. ఆర్టీసీ కార్మికులను మోసం చేయటానికి కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశాడని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో ఏ విధంగా విలీనం చేస్తారో కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే.. ఆర్టీసీని ముంచుతాడని విమర్శించారు. వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం పర్యటించకపోవటం దారుణమన్నారు.
ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టే సీఎం కేసీఆర్ ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల కోసం బీజేపీ మాత్రమే పోరాటం చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో చావో రేవో.. తేల్చుకుంటామని చెప్పారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి సైనికుడిలా పని చేస్తానని చెప్పారు.
బీజేపీలో తనకంటే అత్యంత అదృష్టవంతుడు మరొకరు ఉండరని తెలిపారు.
సామాన్య కార్యకర్తకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వటం బీజేపీలో మాత్రమే సాధ్యం అన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రామ రాజ్యం.. మోదీ రాజ్యం తీసుకోస్తామని పేర్కొన్నారు. బీజేపీ నేతల నాయకుల మధ్య వర్గపోరు లేదని స్పష్టం చేశారు. పార్టీలో నేతల మధ్య చిన్ని చిన్న అభిప్రాయబేధాలు సహజం అన్నారు. బీజేపీ అధ్యక్షుడి హోదాలో ప్రజల కోసం రెండు సార్లు జైలుకు వెళ్ళానని చెప్పారు.
పార్టీకి రుణపడి ఉంటానని, సైనికుడి లాగా పనిచేస్తానని తెలిపారు. పదవులతో సంబంధం లేకుండా తనపై అభిమానం చూపిస్తోన్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల కష్టం వల్లనే ప్రజా సంగ్రామయాత్రకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే తమపై బీఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చేయించిందని మండిపడ్డారు. గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.