IPL 2023, GT VS KKR: న‌మ్మ‌శ‌క్యం కాని రింకు సింగ్ బ్యాటింగ్‌.. ఐదు బంతుల‌కు 5 సిక్స‌ర్లు.. కోల్‌క‌తా సంచ‌ల‌న విజ‌యం

రింకు సింగ్ సంచ‌ల‌న బ్యాటింగ్‌తో కోల్‌క‌తాకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. గుజ‌రాత్ నిర్దేశించిన 205 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా 7 వికెట్లు కోల్పోయి ఆఖ‌రి బంతికి ఛేదించింది.

IPL 2023, GT VS KKR: న‌మ్మ‌శ‌క్యం కాని రింకు సింగ్ బ్యాటింగ్‌.. ఐదు బంతుల‌కు 5 సిక్స‌ర్లు.. కోల్‌క‌తా సంచ‌ల‌న విజ‌యం

IPL 2023

IPL 2023, GT VS KKR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ అస‌లు సిస‌లు టీ20 మ‌జా ఏంటో అభిమానుల‌కు చూపించింది.ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా న‌మ్మ‌శ‌క్యం కాని విజ‌యాన్ని అందుకుంది. 205 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గెలుపు దాదాపుగా అసాధ్యం అనుకున్న త‌రుణంలో కోల్‌క‌తా బ్యాట‌ర్ రింకు సింగ్ అద్భుత‌మే చేశాడు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో విజ‌యానికి 29 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. చివ‌రి ఐదు బంతుల‌ను సిక్స‌ర్లుగా మ‌లిచి త‌న జ‌ట్టును ఆనందంలో ముంచెత్తాడు. రింకు సింగ్ కేవ‌లం 21 బంతుల్లో 1ఫోరు, 6 సిక్స‌ర్లు బాది 48 ప‌రుగులతో గుజరాత్‌కు ఈ సీజ‌న్‌లో తొలి ఓట‌మిని రుచిచూపించాడు. రింకు సింగ్‌తో పాటు వెంక‌టేశ్ అయ్య‌ర్ (83; 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), కెప్టెన్ నితీశ్ రాణా(45; 29 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ ర‌షీద్ ఖాన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, అల్జారీ జోసెఫ్ రెండు, మ‌హ్మ‌ద్ ష‌మీ, జోష్ లిటిల్‌లు చెరో వికెట్ తీశారు.

అంత‌క‌ముందు టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 204 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయి సుద‌ర్శ‌న్ (53; 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), విజ‌య్ శంక‌ర్ (63 నాటౌట్‌; 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో అల‌రించ‌గా శుభ్‌మన్ గిల్ (39) రాణించాడు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో సునీల్ న‌రైన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, సుయాశ్ శ‌ర్మ ఓ వికెట్ తీశాడు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 09 Apr 2023 07:22 PM (IST)

    ఐదు బంతుల‌కు ఐదు సిక్స‌ర్లు.. కోల్‌క‌తాను గెలిపించిన రింకు సింగ్‌

    ఆఖ‌రి ఓవ‌ర్‌లో కోల్‌క‌తా విజ‌యానికి 29 ప‌రుగులు అవ‌స‌రం కాగా రింకుసింగ్ అద్భుతం చేశాడు. యశ్ దయాల్ వేసిన ఈ ఓవ‌ర్ తొలి బంతికి ఉమేశ్ యాద‌వ్ సింగిల్ తీయ‌గా వ‌రుస‌గా ఐదు బంతుల‌కు ఐదు సిక్స‌ర్లు బాది రింకు సింగ్ కోల్‌క‌తాకు న‌మ్మ‌క‌శ్యం కాని విజ‌యాన్ని అందించాడు.

  • 09 Apr 2023 07:06 PM (IST)

    ర‌షీద్ ఖాన్ హ్యాట్రిక్ వికెట్లు

    మ్యాచ్ చేజారుతుందేమోన‌న్న అనుమానం నెల‌కొంటున్న‌త‌రుణంలో కెప్టెన్ ర‌షీద్ ఖాన్ మాయ చేశాడు. హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. 17 ఓవ‌ర్ తొలి బంతికి వెస్టిండీస్ విధ్వంస‌క‌ర వీరుడు ఆండ్రీ రస్సెల్(1) కీప‌ర్ భ‌ర‌త్ చేతికి చిక్కాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా సునీల్ న‌రైన్‌(0), శార్దూల్ ఠాకూర్(0) వికెట్లు ప‌డ‌గొట్టిన ర‌షీద్ ఖాన్‌ హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు. ఈ ఓవ‌ర్‌లో కేవ‌లం రెండు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోర్ 157/7

  • 09 Apr 2023 06:55 PM (IST)

    అయ్య‌ర్ ఔట్‌.. ర‌స్సెల్ ఇన్‌

    కోల్‌క‌తా బ్యాట‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌కు అల్జారీ జోసెఫ్ తెర‌దించాడు. నాలుగో బంతిని బౌండ‌రీకి త‌ర‌లించిన అయ్య‌ర్ అదే ఊపులో మ‌రుస‌టి బంతిని భారీ షాట్ ఆడేందుకు య‌త్నించి శుభ్ మ‌న్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు. అయ్య‌ర్ కేవ‌లం 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స‌ర్లు బాది 83 ప‌రుగులు చేశాడు. అయ్య‌ర్ ఔట్ కావ‌డంతో ఆండ్రీ రస్సెల్ క్రీజులోకి వ‌చ్చాడు. 16 ఓవ‌ర్ల‌కు స్కోరు 155/4

  • 09 Apr 2023 06:46 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ దూకుడు

    నితీశ్ రాణా ఔటైన‌ప్ప‌టికీ వెంక‌టేశ్ అయ్య‌ర్ జోరు కొన‌సాగిస్తున్నాడు. జోష్ లిటిల్ బౌలింగ్‌లో మూడు, ఐదోవ బంతుల‌ను బౌండ‌రీకి త‌ర‌లించిన అయ్య‌ర్‌ ఆరో బంతికి ఏకంగా సిక్స‌ర్ బాదాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తంగా 17 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు స్కోరు 149/3. కోల్‌క‌తా గెల‌వ‌డానికి ఇంకా 30 బంతుల్లో 56 ప‌రుగులు కావాలి

  • 09 Apr 2023 06:41 PM (IST)

    వికెట్ తీసిన అల్జారీ జోసెఫ్.. కోల్‌క‌తా 132/3

    ప్ర‌మాద‌క‌రంగా మారిన వెంక‌టేశ్ అయ్య‌ర్‌, నితిశ్ రాణా జోడిని అల్జారీ జోసెఫ్ విడ‌గొట్టాడు. 29 బంతుల్లో 45 ప‌రుగులు చేసిన రాణాను జోసెఫ్ ఔట్ చేశాడు. దీంతో కోల్‌క‌తా మూడో వికెట్ కోల్పోయింది. వెంక‌టేశ్‌, రాణా జోడి మూడో వికెట్‌కు 100 ప‌రుగులు జోడించి మ్యాచ్‌ను ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశారు. 14 ఓవ‌ర్ల‌కు స్కోర్ 132/3. ఇంకా కోల్‌క‌తా విజ‌యానికి 36 బంతుల్లో 73 ప‌రుగులు కావాలి.

  • 09 Apr 2023 06:34 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ అర్ధ‌శ‌త‌కం

    వ‌న్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన వెంక‌టేశ్ అయ్య‌ర్ దూకుడుగా ఆడుతున్నాడు. 12 ఓవ‌ర్ తొలి బంతికి ఫోర్ బాదిన అయ్య‌ర్ కేవ‌లం 26 బంతుల్లోనే అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. ఆ త‌రువాత బంతిని సిక్స్‌గా మ‌లిచాడు. యశ్ దయాల్ వేసిన ఈ ఓవ‌ర్ ఆఖ‌రి బంతికి నితీశ్ రాణా సిక్స‌ర్ కొట్ట‌డంతో మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు స్కోర్ 116/2

  • 09 Apr 2023 06:07 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్.. సిక్స్‌, ఫోర్‌

    యశ్ దయాల్ వేసిన ఏడో ఓవ‌ర్‌లోని రెండ‌వ‌, మూడ‌వ బంతుల‌ను వెంక‌టేశ్ అయ్య‌ర్ వ‌రుస‌గా ఫోర్‌, సిక్స‌ర్‌గా మ‌లిచాడు. మొత్తంగా 13 ప‌రుగులు ఈ ఓవ‌ర్‌లో వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు స్కోర్ 56/2. వెంక‌టేశ్ అయ్య‌ర్‌(29), నితీశ్ రాణా(6) ఆడుతున్నారు.

  • 09 Apr 2023 05:56 PM (IST)

    జ‌గ‌దీశన్ ఔట్‌

    రెండో వికెట్ కోల్పోయింది కోల్‌క‌తా. నాలుగో ఓవ‌ర్‌ను జోష్ లిటిల్ వేశాడు. నాలుగో బంతికి జ‌గ‌దీశన్‌(6) మ‌నోహ‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 4 ఓవ‌ర్ల‌కు స్కోరు 28/2

  • 09 Apr 2023 05:48 PM (IST)

    కోల్‌క‌తాకు షాకిచ్చిన ష‌మీ.. తొలి వికెట్ డౌన్‌

    కోల్‌క‌తాకు షాక్ త‌గిలింది. 20 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న రహ్మానుల్లా గుర్బాజ్ (15; 12 బంతుల్లో 1ఫోర్‌, 1 సిక్స్‌)ను ష‌మీ ఔట్ చేశాడు. అనంత‌రం వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన వెంక‌టేశ్ అయ్య‌ర్ సిక్స‌ర్ బాద‌డంతో మూడో ఓవ‌ర్‌లో మొత్తం 12 ప‌రుగులు వ‌చ్చాయి. స్కోరు 26/1

  • 09 Apr 2023 05:43 PM (IST)

    జగదీశన్ ఫోర్‌, గుర్బాజ్ సిక్స్‌

    జోష్ లిటిల్ వేసిన రెండో ఓవ‌ర్‌లో రెండో బంతిని జగదీశన్ ఫోర్‌గా మ‌ల‌చ‌గా, నాలుగో బంతికి రహ్మానుల్లా గుర్బాజ్ సిక్స్ బాదాడు. ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు స్కోరు 14/0.

  • 09 Apr 2023 05:40 PM (IST)

    ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన కోల్‌క‌తా.. తొలి ఓవ‌ర్‌లో 2 ప‌రుగులే ఇచ్చిన ష‌మీ

    205 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు కోల్‌క‌తా బ్యాట‌ర్లు బ‌రిలోకి దిగారు. తొలి ఓవ‌ర్ వేసిన ష‌మీ కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు.

  • 09 Apr 2023 05:18 PM (IST)

    విజ‌య్ శంక‌ర్ విజృంభ‌ణ‌.. కోల్‌క‌తా ముందు భారీ ల‌క్ష్యం

    ఆఖ‌రి రెండు ఓవ‌ర్ల‌లో విజ‌య్ శంక‌ర్ రెచ్చిపోయాడు. విజ‌య్ శంక‌ర్ ధాటికి 19 ఓవ‌ర్ వేసిన ఫెర్గూస‌న్ 25 ప‌రుగులు స‌మ‌ర్పించుకోగా, 20 ఓవ‌ర్ వేసిన శార్దూల్ ఠాకూర్ 20 ప‌రుగులు ఇచ్చాడు. దీంతో గుజ‌రాత్ స్కోర్ 204 ప‌రుగులుగా న‌మోదైంది. కోల్‌క‌తా ముందు 205 ప‌రుగుల లక్ష్యం నిలిచింది.

  • 09 Apr 2023 05:00 PM (IST)

    సాయి సుద‌ర్శ‌న్ అర్ధ‌శ‌త‌కం

    అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను చ‌క్క‌గా వినియోగించుకుంటున్నాడు యువ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్‌. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ దిశ‌గా బంతిని త‌ర‌లించి సింగిల్ తీసి అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. కేవ‌లం 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 7 ప‌రుగులు వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 151/3.

  • 09 Apr 2023 04:45 PM (IST)

    సుయాశ్ శ‌ర్మ గూగ్లీ.. అభినవ్ క్లీన్ బౌల్డ్‌

    గుజ‌రాత్ మూడో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ వేసిన 13వ ఓవ‌ర్ మూడో బంతికి అభినవ్ మనోహర్(14; 8 బంతుల్లో 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సుయాశ్ గూగ్లీని అంచ‌నా వేయ‌లేక‌పోయాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. స్కోరు 123/3. సాయి సుద‌ర్శ‌న్ (39), విజ‌య్ శంక‌ర్ (1) ఆడుతున్నారు.

  • 09 Apr 2023 04:35 PM (IST)

    అభినవ్ హ్యాట్రిక్ ఫోర్లు

    గిల్ పెవిలియ‌న్‌కు చేర‌డంతో అభినవ్ మనోహర్ క్రీజులోకి వ‌చ్చాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 13వ ఓవ‌ర్ తొలి మూడు బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించాడు అభినవ్. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు వ‌చ్చాయి.

  • 09 Apr 2023 04:29 PM (IST)

    సుద‌ర్శ‌న్ సిక్స‌ర్‌, గిల్ ఔట్‌

    12వ ఓవ‌ర్‌ను సునీల్ నరైన్ వేశాడు. తొలి బంతికి సాయి సుద‌ర్శ‌న్ సిక్స్ కొట్ట‌గా నాలుగో బంతికి గిల్ భారీ షాట్‌కు య‌త్నించి ఉమేశ్ యాద‌వ్ చేతికి చిక్కాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 10 ప‌రుగులు రాగా గుజ‌రాత్ స్కోర్ వంద ప‌రుగులు దాటింది. ప్ర‌స్తుతం 101/2

  • 09 Apr 2023 04:20 PM (IST)

    స‌గం ఓవ‌ర్లు పూర్తి.. దూకుడు పెంచిన గుజ‌రాత్ బ్యాట‌ర్లు.. స్కోరు 88/1

    ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌తో పాటు వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ దూకుడు పెంచారు. సుయాష్ శర్మ వేసిన ప‌దో ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో స‌గం ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ స్కోర్ 88/1. శుభ్‌మ‌న్ గిల్ 36, సుద‌ర్శ‌న్ 22 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 09 Apr 2023 04:05 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే : 54 ప‌రుగులు ఒక వికెట్‌

    గుజ‌రాత్‌కు మంచి ఆరంభం ల‌భించింది. ప‌వ‌ర్ ప్లే (6ఓవ‌ర్లు) పూర్తి అయ్యే స‌రికి వికెట్ న‌ష్ట‌పోయి 54 ప‌రుగులు చేసింది. ఆరో ఓవ‌ర్‌ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేయ‌గా.. గిల్ రెండు బౌండ‌రీలు బాదాడు. మ‌రో ఐదు ప‌రుగులు వైడ్ రూపంలో వ‌చ్చాయి. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు వ‌చ్చాయి. శుభ్‌మ‌న్ గిల్ 20, ఎన్‌.జగదీశన్ 6 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

  • 09 Apr 2023 03:58 PM (IST)

    వృద్ధిమాన్ సాహా ఔట్‌

    కెప్టెన్ నితీశ్ రాణా వ్యూహం ఫ‌లించింది. ప‌వ‌ర్ ప్లేలోనే సునీల్ నరైన్ చేత బౌలింగ్ చేయించి ఫ‌లితం రాబ‌ట్టాడు. ఐదో ఓవ‌ర్ రెండో బంతికి సాహా షాట్ ఆడ‌గా ఎన్‌.జగదీశన్ క్యాచ్ అందుకోవ‌డంతో సాహా పెలివియ‌న్‌కు చేర‌క‌త‌ప్ప‌లేదు. 17 బంతులు ఎదుర్కొన్న సాహా 17 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ వ‌చ్చిరావ‌డంతోనే బౌండ‌రీతో ఖాతా ఓపెన్ చేశాడు. ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. స్కోర్ 38/1

  • 09 Apr 2023 03:52 PM (IST)

    నిల‌క‌డ‌గా ఆడుతున్న ఓపెన‌ర్లు

    గుజ‌రాత్ ఓపెన‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. తొలి ఓవ‌ర్ మిన‌హా మిగిలిన ఓవ‌ర్ల‌లో క‌నీసం ఓ బౌండ‌రీ చొప్పున కొడుతూ స్కోరు వేగాన్ని పెంచుతున్నారు. నాలుగు ఓవ‌ర్లు అయ్యే స‌రికి స్కోరు 31/0. శుభ్ మన్ గిల్ 15, వృద్ధిమాన్ సాహా 10 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

  • 09 Apr 2023 03:44 PM (IST)

    గిల్, సాహా చెరో బౌండరీ

    రెండో ఓవర్ ను శార్దూల్ ఠాకూర్ వేశాడు. ఈ ఓవర్ లో శుభ్ మన్ గిల్, వృద్ధిమాన్ సాహా చెరో బౌండరీ బాదారు. ఈ ఓవర్లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు పూర్తి అయ్యే సరికి గుజరాత్ 17/0

  • 09 Apr 2023 03:36 PM (IST)

    నాలుగు పరుగులు మాత్రమే

    కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్ మన్ గిల్ లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి ఓవర్ లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

  • 09 Apr 2023 03:32 PM (IST)

    క్రీజులోకి అడుగుపెట్టిన గుజరాత్ ఓపెనర్లు

    గుజరాత్ ఓపెనర్లుగా శుభ్ మన్ గిల్, వృద్ధిమాన్ సాహా క్రీజులోని అడుగుపెట్టారు. తొలి ఓవర్ ను కేకేఆర్ బౌలర్ ఉమేష్ యాదవ్ వేస్తున్నాడు.

  • 09 Apr 2023 03:16 PM (IST)

    నితీశ్‌ రాణా సేన‌

    రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), ఎన్‌.జగదీశన్, నితీశ్‌ రాణా(కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్ర‌వ‌ర్తి

  • 09 Apr 2023 03:14 PM (IST)

    ర‌షీద్ ఖాన్ సేన‌

    వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్‌), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్(కెప్టెన్‌), మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్

  • 09 Apr 2023 03:07 PM (IST)

    గుజరాత్ బ్యాటింగ్

    టాస్ గెలిచిన‌ గుజరాత్ మొద‌ట‌ బ్యాటింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా స్థానంలో స్టాండిన్ కెప్టెన్ గా రషీద్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు.