RS Praveen Kumar: ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ కసరత్తు మొదలు!

ఐపీఎస్ అధికారి, మాజీ తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగేట్రానికి కసరత్తులు మొదలయ్యాయి. ఆరేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్చంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న ఈ ఐపీఎస్ గురుకులాల కార్యదర్శిగా తనదైన ముద్ర వేసి... తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.

RS Praveen Kumar: ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ కసరత్తు మొదలు!

Rs Praveen Kumar

RS Praveen Kumar: ఐపీఎస్ అధికారి, మాజీ తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగేట్రానికి కసరత్తులు మొదలయ్యాయి. ఆరేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్చంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న ఈ ఐపీఎస్ గురుకులాల కార్యదర్శిగా తనదైన ముద్ర వేసి… తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. పదవికి రాజీనామా చేసిన సమయంలో ఇకపై తన అడుగులు రాజకీయాల్లోకే అని చెప్పకనే చెప్పేశారు.

అదే సమయంలో హుజురాబాద్ ఉపఎన్నిక ముంగిట్లో ఆయన రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే.. హుజురాబాద్ ఎన్నికకు.. తనకు సంబంధం లేదని.. అక్కడ నుండి పోటీచేయబోనని కూడా ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. అయితే తన రాజకీయ ప్రయాణానికి అడుగులు మాత్రం మొదలు పెట్టారు. ఇప్పటికే రాష్టవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలతో ప్రవీణ్ కుమార్ చర్చలు జరిపారు.

అయితే, బీఎస్పీ వైపు వెళ్లాలా.. సొంత పార్టీ పెట్టాలా.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఏదైనా పార్టీలో చేరాలా.. అన్న దానిపై విస్తృత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా తమ వెంట ఉంటామని ఉద్యోగ సంఘాలు హామీ ఇచ్చినట్లు తెలుస్తుండగా.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛంద పదవి విరమణ ఆమోదించింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైల్ ను కేంద్ర DoPTకి పంపించగా.. అక్కడ లైన్ క్లియర్ అయ్యాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.

దళిత హక్కుల కోసం కాన్షిరాం, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఆదేశాల ప్రకారం ప్రజలకు సేవ చేస్తానన్న ప్రవీణ్ కుమార్ ద‌ళిత్ అన్న ప‌దానికి కొత్త నిర్వ‌చ‌నం ఇవ్వ‌బోతున్నారా అనే చర్చలు రాజకీయ వర్గాలలో ముమ్మరంగా జరుగుతున్నాయి. స‌మాజంలో అణ‌చివేత‌కు గురైన ప్ర‌తీ ఒక్క‌రూ ద‌ళితుడే అన్న కొత్త నినాదంతో ప్రవీణ్ కుమార్ ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. గ‌తంలో ఇదే బాట‌లో న‌డిచిన కాన్షీరాం కూడా దేశ‌వ్యాప్తంగా విశేష ఆద‌ర‌ణ పొందగా ప్రవీణ్ కుమార్ ప్రయాణం ఆసక్తికరంగా మారింది.

బీఎస్పీలో చేరాల‌ని ప్రవీణ్ కుమార్ అనుచరులు సూచిస్తున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై విస్తృత చర్చలు జరుపుతున్నారట. గ‌తంలో వీకేసింగ్‌, జేడీ ల‌క్ష్మినారాయ‌ణ‌, దినేశ్‌రెడ్డి, విజ‌య‌రామారావులు వంటి వారు రాజ‌కీయాల‌ వైపు వ‌చ్చిన తర్వాత గ్రౌండ్ కోసం వెతుక్కుంటే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని రాజ‌కీయాల్లోకి దిగుతున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈయన ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.