Kavitha Protest In Delhi: కవితకు పోటాపోటీగా.. హైదరాబాద్, ఢిల్లీలో బీజేపీ దీక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో

బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసన దీక్షలకు దిగుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రేపు ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దే ఆమె దీక్షకు దిగనున్నారు. భారత్ జాగృతి దీక్షకు పోలీసులు మౌఖికంగా అనుమతి ఇచ్చారు. అదే సమయంలో అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్ లో తామూ నిరసన దీక్షలకు దిగుతామని బీజేపీ ప్రకటించింది.

Kavitha Protest In Delhi: కవితకు పోటాపోటీగా.. హైదరాబాద్, ఢిల్లీలో బీజేపీ దీక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో

Kavitha Protest In Delhi

Kavitha Protest In Delhi: బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసన దీక్షలకు దిగుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రేపు ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దే ఆమె దీక్షకు దిగనున్నారు. భారత్ జాగృతి దీక్షకు పోలీసులు మౌఖికంగా అనుమతి ఇచ్చారు. అదే సమయంలో అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్ లో తామూ నిరసన దీక్షలకు దిగుతామని బీజేపీ ప్రకటించింది.

రేపు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ‘‘మహిళా గోస-బీజేపీ భరోసా’’ పేరిట దీక్షకు దిగుతామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రేపు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు తమ పార్టీ నాయకురాలు డీకే అరుణ సహా మహిళా మోర్చా నేతలు దీక్ష చేస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడమే తమ లక్ష్యమని అన్నారు. తెలంగాణలో మహిళా సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని చెప్పారు.

మహిళలను కేసీఆర్ కుటుంబం ఏ విధంగా మోసాలకు గురి చేస్తుందో తెలియజేయడమే ఉద్దేశమని చెప్పారు. మహిళలకు కేసీఆర్ ఫ్యామిలీ చేస్తున్న ద్రోహాన్ని దీక్ష ద్వారా యావత్ దేశానికి తెలియజేద్దామని అన్నారు. మహిళలకు కవిత క్షమాపణ చెప్పేదాకా ఉద్యమిస్తామని అన్నారు. ఈ మేరకు బీజేపీ మహిళా నేతలకు ఇవాళ బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. బీజేపీ దీక్షలో డీకే అరుణ, విజయశాంతి, బండి సంజయ్‌ సహా పలువురు నేతలు కూడా పాల్గొననున్నారు. మరోవైపు, లిక్కర్ స్కాం కు వ్యతిరేకంగా బీజేపీ ఢిల్లీలో ధర్నా చేయనుంది. బీజేపీ ఢిల్లీ శాఖ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద కాకుండా ధీన్ దయాల్ మార్గ్ లోని ఆంధ్ర స్కూల్ వద్ద ఈ ధర్నా జరగనుంది.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధం: డీకే అరుణ
బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, వారు అవినీతి కూపంలో కూరుకొని పోయారని 10టీవీతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవినీతి మరకల నుంచి తప్పించుకునే మార్గం లేక టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, ఒక ప్లాన్ ప్రకారం ఆ పార్టీ పేరు బీఆర్ఎస్ పార్టీగా మార్చారని చెప్పారు. నిజంగా జాతీయ పార్టీ అయితే నాగాలాండ్, త్రిపురలోనూ పోటీ చేయాలి కదా? అని నిలదీశారు.

ప్రతిపక్షాలపైన ఈడీ రైడ్స్ చేస్తుందంటున్నారని, ఇందులో వాస్తవం లేదని చెప్పారు. కక్ష సాధింపు చర్యలు అంటున్న కవిత ఫోన్లు ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది కాబట్టి బయటికి వచ్చిందని, అక్కడ విచారణ జరుగుతుందని చెప్పారు. విచారణలో భాగంగానే కవితకు నోటీసులు ఇచ్చారని అన్నారు. మోదీకి భారత ప్రజలే ఒక కుటుంబం అని, కేసీఆర్ కి మాత్రం ఆయన కుటుంబమే అంతా అని చెప్పారు.

తమ గుట్టు బయట పడుతుందనే కొందరు మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకో పార్టీ అధికారంలోకి రాకూడదా? తెలంగాణలో మీరేమైనా గుత్తకు తీసుకున్నారా? అని నిలదీశారు. తమ పీఠం కదులుతుందని భయపడుతున్న బీఆర్ఎస్ నేతలు దానిని కాపాడుకునేందుకే నరేంద్ర మోదీ మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. పార్లమెంటులో ఒక్క మాట కూడా మాట్లాడని కవిత మహిళలకు 33% రిజర్వేషన్లు అంటూ ఇప్పుడు దీక్ష చేస్తున్నారని విమర్శించారు. సెంటిమెంట్ ను రాజేసి, లబ్ధి పొందేందుకే బీఆర్ఎస్ నేతల తాపత్రయమని అన్నారు.

ప్రజల దృష్టిని మళ్లించడానికే నాటకాలు: కిషన్ రెడ్డి
లిక్కర్ స్కాం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే దీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సానుభూతి కోసమే కల్వకుంట్ల కుటుంబం డ్రామాలు ఆడుతోందని చెప్పారు. లిక్కర్ స్కాంను తెలంగాణ కోసం, మహిళల కోసం చేశారా ఏంటీ? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Telangana : కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలుబొమ్మ.. అవి ఈడీ సమన్లు కావు మోదీ సమన్లు : కేటీఆర్