Lakhimpur Kheri : వందల మంది రైతులుండగా సాక్ష్యులు 23మందేనా

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ హింసాత్మక ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే..రైతుల ఆందోళ‌న

Lakhimpur Kheri : వందల మంది రైతులుండగా సాక్ష్యులు 23మందేనా

Sc

Lakhimpur Kheri దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ హింసాత్మక ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే..రైతుల ఆందోళ‌న సంద‌ర్భంగా చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో ఎనిమిది మంది మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌లో 68 మంది సాక్షులకుగాను 30 మంది వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు తెలిపారు.

అందులో 23 మంది తమను తాము ప్రత్యక్ష సాక్షులుగా చెప్పుకున్నారని తెలిపారు. వీళ్లు.. కారుతో పాటు, అందులో ఉన్న వ్యక్తులను చూశారని వివరించారు. ప‌లువురు సాక్షుల స్టేట్‌మెంట్ల‌ను ఇంకా న‌మోదు చేయాల్సి ఉంద‌ని కోర్టుకి తెలిపారు.

అయితే ప్రత్యక్ష సాక్షులు 23 మందే ఉండటంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వందల మంది రైతులు ఘటన జరిగిన ప్రాంతంలో ఉంటే.. 23 మంది ప్రత్యక్ష సాక్షులే ఉండటం ఏంటని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో పాటు యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది సీజేఐ ధర్మాసనం. ఎంతమంది సాక్షుల నుంచి 164 నిబంధన కింద స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారని అడిగింది. సాక్షులకు భద్రత కల్పించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది.

సాక్షుల‌కు పూర్తిస్థాయిలో భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని యూపీ ప్ర‌భుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. గాయపడిన వారెవరైనా సాక్షుల్లో ఉన్నారా అని ప్రశ్నించిన ధర్మాసనం..చనిపోయిన జర్నలిస్టు కశ్యప్‌, మరో మృతుడు శ్యామ్‌సుందర్‌ మరణంపై విచారణ పురోగతి నివేదికను అందించాలని స్పష్టం చేసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఎల‌క్ట్రానిక్ ఆధారాల‌పై నివేదిక‌ల త‌యారీ విష‌యంలో త‌మ ఆందోళ‌న‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, నిపుణుల‌కు తెల‌పాల‌ని సుప్రీం బెంచ్ యూపీ ప్ర‌భుత్వాన్ని కోరింది. ఇక,ఈ కేసులో దర్యాప్తు నత్తనడకన సాగడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ వేగవంతంగా చేస్తారా లేదా మమ్మల్ని ఉత్తర్వులు ఇమ్మంటారా అని ప్రశ్నించింది.ఈ అంశంపై త‌దుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ 8కి వాయిదా వేసింది.

కాగా,ఈ నెల ప్రారంభంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య,కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పర్యటనను వ్యతిరేకిస్తూ ల‌ఖింపూర్ ఖేరిలో ఆందోళ‌న చేప‌ట్టిన రైతుల‌పై కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన కారుతో సహా రెండు కార్లు దూసుకెళ్ల‌డంతో న‌లుగురు రైతులు మ‌ర‌ణించ‌గా అనంత‌రం జ‌రిగిన ఘర్ష‌ణ‌లో మ‌రో న‌లుగురు మ‌ర‌ణించిన విషయం తెలిసిందే.

ALSO READ Akira Nandan : ‘లిటిల్ పవర్‌‌స్టార్’ ఎంట్రీ ఫిక్స్.. అందుకే ఇవన్నీ..