Colleageum Vs Govt : కొలీజియంపై కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలేంటి? కొలీజియంలో జవాబుదారీతనం.. పారదర్శకత లోపించాయా?

న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన కొలీజియం విషయంలో సుప్రీం కోర్ట్‌ వర్సెస్‌ కేంద్రం వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది. సుప్రీం కోర్టు.. హైకోర్టుల న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం.. పారదర్శకత కరువైందని.. పాతికేళ్ల కిందట ఏర్పాటైన కొలీజియం వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిందేనని కేంద్రం వాదిస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి లేఖతో కొలీజియం వ్యవస్థపై చర్చ మొదలైంది.

Colleageum Vs Govt : కొలీజియంపై కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలేంటి? కొలీజియంలో జవాబుదారీతనం.. పారదర్శకత లోపించాయా?

Colleageum Vs Govt

Colleageum Vs Govt : న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన కొలీజియం విషయంలో సుప్రీం కోర్ట్‌ వర్సెస్‌ కేంద్రం వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని భారత ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర న్యాయ శాఖా మంత్రి రాసిన లేఖతో కొన్నేళ్లుగా కొనసాగుతున్న గొడవ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. సుప్రీం కోర్టు.. హైకోర్టుల న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం.. పారదర్శకత కరువైందని.. పాతికేళ్ల కిందట ఏర్పాటైన కొలీజియం వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిందేనని కేంద్రం వాదిస్తోంది. అయితే.. అది ఎలా జరగాలి.. ఎవరెవరు సభ్యులుగా ఉండాలనే విషయంపై కొన్నేళ్లుగా కేంద్రం వర్సెస్‌ సుప్రీంకోర్టు నడుమ ప్రచ్చన్న యుద్ధం నడుస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి లేఖతో కొలీజియం వ్యవస్థపై చర్చ మొదలైంది.

భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు రాసిన లేఖతో మరోమారు చర్చ మొదలైంది. సుప్రీం, హైకోర్టు జడ్జిలను నియమించే కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలని కోరారు న్యాయ శాఖ మంత్రి. దీని వల్ల పాతికేళ్ల కిందట ఏర్పాటైన కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం.. పారదర్శకత పెరుగుతుందని చెబుతోంది కేంద్రం. అయితే.. కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం.. పారదర్శకత పెంచేందుకు చర్యలు తీసుకోవడం తప్పేం కాదన్న సుప్రీం కోర్టు.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో తీసుకోవాల్సిన మార్పులు చేర్పులపై కొలీజియంతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని గతంలో కేంద్రానికి సూచించింది. జ్యుడీషియరీ వ్యవస్థలో ప్రభుత్వాల ప్రమేయం అంత మంచిది కాదన్న వాదనను కూడా వ్యక్తం చేసింది. తాజాగా మంత్రి లేఖతో కేంద్రం వైఖరిపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Colleageum Vs Govt : న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వాల జోక్యం అవసరమా? న్యాయశాఖా మంత్రి లేఖపై సుప్రీం కోర్టు ఎలా స్పందించనుంది?

ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. అత్యున్నత న్యాయమూర్తులను నియమించేందుకు ఏర్పాటైన కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలని కేంద్రం వాదిస్తుంటే.. జుడీషియరీలో ప్రభుత్వాల ప్రమేయం అంత మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. చివరకు న్యాయవ్యవస్థపై కూడా కేంద్ర ప్రభుత్వం కర్రపెత్తనం చేయాలనుకుంటోందన్న విమర్శలు కూడా వచ్చాయి. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం ద్వారా.. జుడీషియరీపై పట్టు సాధించేందుకు కేంద్రం కుయుక్తులను పన్నుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలంటూ కేంద్ర మంత్రి రాసిన లేఖ రాజకీయంగానూ దుమారం రేపింది.

కేంద్ర మంత్రి లేఖను కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా విపక్ష నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది న్యాయవ్యవస్థకు చాలా ప్రమాదకరమని.. జుడీషియరీకి పాయిజన్‌ పిల్‌ లాంటిదని కేజ్రీవాల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు కేంద్ర మంత్రి కిరణ రిజిజు. కోర్టులను గౌరవిస్తారని అనుకుంటున్నానని.. కొలీజియం వ్యవస్థలో న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని గతంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు కేంద్ర మంత్రి. సుప్రీం ఆదేశాల ప్రకారమే కేంద్రం.. కొన్ని ప్రతిపాదనలను తీసుకొచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి రిజిజు.

అయితే.. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది. సుప్రీం కోర్టు.. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ల వంటి కీలక పోస్టుల నియామక ప్రక్రియలో ప్రభుత్వ ప్రమేయాన్ని అత్యున్నత న్యాయస్థానం గతంలోనూ తోసిపుచ్చింది. అవసరమైతే కొలీజయం వ్యవస్థలో జవాబుదారీతనం.. పారదర్శకత పెరిగేలా.. నియామక ప్రక్రియకు మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది. ఇప్పుడు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలంటూ కేంద్ర మంత్రి తాజా ప్రతిపాదనలపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. ఎన్నో చారిత్రాత్మక కేసుల్లో స్పష్టమైన తీర్పులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా డీవై చంద్రచూడ్‌.. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు? న్యాయవ్యవస్థపై రాజ్యాంగ వ్యవస్థల జోక్యాన్ని ఎలా పరిగణిస్తారనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.