LB Nagar RHS Flyover : ఇక ఉండదు ట్రా”ఫికర్”.. ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
వనస్థలిపురం నుంచి దిల్ సుఖ్ నగర్ మార్గంలో ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి.(LB Nagar RHS Flyover)

LB Nagar RHS Flyover : హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సాయంత్రం ప్రారంభించారు. వనస్థలిపురం నుంచి దిల్ సుఖ్ నగర్ మార్గంలో ఈ ఫ్లైఓవర్ ఉంది.
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సిగ్నల్ ఫ్రీ సౌకర్యం కల్పించారు. 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, రూ.32 కోట్ల వ్యయంతో మూడు లేన్ల ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ తో పాటు జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.(LB Nagar RHS Flyover)
” ఎస్ఆర్డీపీ(SRDP ) కింద ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 12 పనులను రూ.650 కోట్లతో చేపట్టాం. ఈ ఫ్లైఓవర్ 9వది. ఇప్పుడు ప్రాంభించాము. ఇంకా మూడు ప్రాజెక్టులు మిగిలి ఉన్నాయి. బైరామల్‌గూడలో సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్, రెండు లూప్‌లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తాం. ఈ పనులను పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తాం.
ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ తో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ ఫ్రీగా మూవ్ అవుతుంది. ఈ చౌరస్తాకు శ్రీకాంత్ చారి పేరు పెడుతున్నాము. ఈ ఫ్లైఓవర్ కు మాల్ మైసమ్మ అని నామకరణం చేస్తాం. ఎల్బీ నగర్ చౌరస్తా దాటాలంటే గతంలో 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ ఇబ్బంది లేదు. ఈ ఫ్లై ఓవర్లు మాత్రమే కాదు.. ప్రజా రవాణ మెరుగుపడల్సిన అవసరం ఉంది.
మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే. తప్పకుండా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను తీసుకొస్తాం. హయత్‌నగర్ కు కూడా విస్తరిస్తాం. ఎయిర్‌పోర్టు వరకు కూడా మెట్రోను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. గడ్డి అన్నారం మార్కెట్లో వెయ్యి పడకల టిమ్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే ఏడాదిన్నర కాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ నియోజవర్గంలో అన్ని సమస్యలపై పని చేస్తాం. GO 58, 59 ద్వారా భూములను క్రమబద్దీకరిస్తాము. SRDP ద్వారా ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటాము” అని కేటీఆర్ చెప్పారు.(LB Nagar RHS Flyover)