పెళ్లి పేరుతో ఆన్ లైన్ లో ఘరానా మోసం, రూ.12 లక్షలు పొగొట్టుకున్న యువతి

ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరిగాయి. కేటుగాళ్లు ఆన్ లైన్ వేదికగా ఘరానా మోసాలకు

  • Published By: naveen ,Published On : May 15, 2020 / 09:40 AM IST
పెళ్లి పేరుతో ఆన్ లైన్ లో ఘరానా మోసం, రూ.12 లక్షలు పొగొట్టుకున్న యువతి

ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరిగాయి. కేటుగాళ్లు ఆన్ లైన్ వేదికగా ఘరానా మోసాలకు

ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరిగాయి. కేటుగాళ్లు ఆన్ లైన్ వేదికగా ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. జనాల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. కొంతమంది అమాయకులు వారి ఉచ్చులో పడి అడ్డంగా మోసపోతున్నారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, అప్రమత్తంగా ఉండాలని నెత్తీ నోరు బాదుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. మన కక్కుర్తి కేటుగాళ్లకు వరంగా మారుతోంది. వరుసగా ఆన్ లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఓ ఆన్ లైన్ మోసం హైదరాబాద్ లో వెలుగుచూసింది. పెళ్లి చేసుకుందామని చెప్పి ఓ యువతి నుంచి రూ.12 లక్షలు నొక్కేశాడు కేటుగాడు.

మ్యాట్రిమోనీ సైట్ ద్వారా యువతి వివరాలు సేకరణ:
బోరబండలో నివాసం ఉండే యువతికి ఆన్ లైన్ ద్వారా హ్యారీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఓ మ్యాట్రిమోనీ సైట్ లో యువతి వివరాలు చూసి ఆమెను సంప్రదించాడు. కొన్నాళ్ల పాటు ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. అలా అలా పరిచయం పెరిగింది. ఆ తర్వాత లవ్ లో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని హ్యారీ ప్రపోజ్ చేశాడు. దానికి యువతి కూడా అంగీకరించింది.

కాస్ట్లీ గిఫ్ట్ పేరుతో మోసం:
ఓ రోజు గిఫ్ట్ పంపిస్తున్నానని యువతికి ఫోన్ చేశాడు హ్యారీ. బంగారు గొలుసు, బంగారు వాచి, నెక్లెస్ ఫొటోలను యువతికి ఫోన్ కి వాట్సాప్ చేశాడు. ఆ మరుసటి రోజు కొరియర్ ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మీకు ఖరీదైన నగలు వచ్చాయి, వాటిని పొందాలంటే కస్టమ్స్ డ్యూటీ కింద రూ.12 లక్షలు చెల్లించాలని అన్నాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేదని.. ఆన్ లైన్ లో ట్రాన్సఫర్ చేస్తే సరిపోతుందని కూడా చెప్పాడు.

ఆన్ లైన్ లో రూ.12లక్షలు పంపిన యువతి:
ఖరీదైన వస్తువులు వస్తున్నాయని నమ్మేసిన యువతి ఏమీ ఆలోచించ లేదు. వెంటనే ఆన్ లైన్ లో చెప్పిన అకౌంట్ కు దశలవారీగా రూ.12 లక్షలు ట్రాన్సఫర్ చేసింది. అంతే.. ఆ తర్వాత ఎన్ని రోజులైనా గిఫ్ట్ రాలేదు. హ్యారీ ఫోన్ కూడా స్విచ్చాఫ్ అయింది. దీంతో తను మోసపోయానని గ్రహించిన యువతి లబోదిబోమంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కాగా, గడిచిన వారం రోజుల్లో హైదరాబాద్ కు చెందిన పలువురు ఇలానే ఆన్ లైన్ మోసాలకు బలయ్యారు. కేటుగాళ్లు ఆన్ లైన్ ద్వారా రూ.30 లక్షల వరకు దోచుకున్నారు.

మద్యం అమ్మకాల పేరుతో ఆన్ లైన్ చీటింగ్:
‌లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిపివేయటంతో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు అంటూ సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూశాయి. క్యూఆర్‌ కోడ్‌, లేదా లింక్‌ పంపటం దానికి నగదు పంపిన వెంటనే మీ ఆర్డర్‌ మీ ఇంటి ముందుకే ఉంటుంది అంటూ సైబర్‌ నేరగాళ్లు ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ముందుగా, కొంత మొత్తం చెల్లిస్తే మిగిలిన సొమ్ము ఆర్డర్‌ డెలివరీ సమయంలో ఇస్తే సరిపోతుంది అంటూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో ప్రకటనలు చూసి ఆకర్షణకు గురైన వారు, ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు కాల్ చేసి మోసపోయారు.

రూ.51వేలు పొగొట్టుకున్న మందుబాబు:
హైద‌రాబాద్ లోని ఫేమ‌స్ బగ్గా వైన్స్ పేరుతో.. క్యూ ఆర్ కోడ్ పంపించి.. దానికి అమౌంట్ పంపిస్తే అర గంటలో మందు మీ ఇంటికి పంపిస్తామంటూ మెసేజ్ లు పంపారు మోసగాళ్ళు. ఈ మెసేజ్ ను న‌మ్మిన‌ గౌలిపురాకి చెందిన రాహుల్ ఆన్ లైన్ లో రూ.51 వేలు ట్రాన్సఫ‌ర్ చేశాడు. మద్యం ఇంటికి రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

రూ.30వేలు పొగొట్టుకున్న మందు ప్రియుడు:
ఏపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విజయవాడ ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో మద్యం కోసం వెతికాడు. ఆ వ్యక్తికి ఆన్‌లైన్‌లో ఓ ఫోన్‌ నెంబర్‌ లభించటంతో ఆ నెంబర్‌ కు కాల్ చేసి మద్యం కావాలన్నాడు. అవతలి వ్యక్తి ఆన్ లైన్ లో నగదు చెల్లిస్తే వెంటనే మీకు మద్యం అందుతుందని చెప్పాడు. ఆ మాటలు నమ్మి మోసగాడు చెప్పిన అకౌంట్‌ కు రూ.30వేలు ట్రాన్సఫర్ చేశాడు. అయితే ఎంతకీ తను చేసిన ఆర్డర్‌ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సో, మీ అప్రమత్తతే మీకు శ్రీరామరక్ష అని పోలీసులు చెబుతున్నారు.

Read Here>>లాక్ డౌన్ లో పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య.. నెల రోజుల్లో ప్రేమజంటకు ఏం జరిగింది