Sejal Protest : ఢిల్లీలో మరోసారి ఆరిజన్ డైరీ సీఎఓ శేజల్ ఆందోళన.. న్యాయం చేయాలంటూ పార్లమెంట్ ఎదుట నిరసన
ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ ఆందోళన మరోసారి ఢిల్లీకి చేరింది. పార్లమెంట్ భవనం ఎదుట తనకు న్యాయం చేయాలంటూ ఆమె నిరసనకు దిగింది.

Origin Dairy CAO Shejal ( File Photo)
Origin Dairy CAO Shejal : ఆరిజన్ డైరీ సీఏవో శేజల్ (Origin Dairy CAO Shejal) ఆందోళన మరోసారి ఢిల్లీ (Delhi) కి చేరింది. పార్లమెంట్ భవనం (Parliament Building) ఎదుట తనకు న్యాయం చేయాలంటూ ఆమె నిరసనకు దిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (MLA Durgam Chinnaiah) తనను లైంగికంగా వేధించారని, మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని శేజల్ డిమాండ్ చేసింది. దుర్గం చిన్నయ్య మీద కేసు నమోదు చేసే వరకు నా పోరాటం ఆగదని స్పష్టం చేసింది.
గతంలో ఢిల్లీ వచ్చి జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ ఫిర్యాదు చేసిన విషయం విధితమే. న్యాయం జరగకపోవడంతో తెలంగాణ భవన్‌లో ఆత్మహత్యాయత్నానికిసైతం ఆమె పాల్పడింది. గతంలో కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీల దృష్టికి తన సమస్యను శేజల్ తీసుకెళ్లింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. పేరుకు మాత్రమే చట్టాలు.. ఆడపిల్లకి న్యాయం చేయలేని చట్టాలు ఎందుకని ప్రశ్నించింది. మణిపూర్‌లో మహిళలపై జరిగిన ఘటన చాలా బాధాకరమని శేజల్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు సొంత రాష్ట్రంలో మహిళపై జరిగిన విషయం మీద స్పందించే సమయం లేదు.. కానీ, పక్క రాష్ట్రాలలో జరిగిన ఘటనలమీద మాత్రం క్షణాల్లో స్పందించి రాజకీయాలు చేసుకోవడం పరిపాటిగా మారిందంటూ శేజల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
KA Paul : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలిని చంపాలని కుట్ర : కేఏ పాల్
మహిళల లైంగిక వేధింపులకు సంబంధించి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద ఎఫ్ఐఆర్ ఇవ్వమని పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఎఫ్ఐఆర్ ఇవ్వకుండనే నా మీద తిరిగి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని శేజల్ ఆరోపించింది. ఇదిలాఉంటే.. గతనెల 13న ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి శేజల్ పాలాభిషేకం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవం జరుపుతున్న సమయంలో శేజల్ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. మహిళల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మాత్రం న్యాయం చేయడం లేదని ఆ సమయంలో శేజల్ వాపోయారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె వేడుకున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగానే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. అయితే, తాజాగా మరోసారి శేజల్ ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ భవనం ఎదుట తన నిరసన తెలిపారు.