PM Narendra Modi : కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ ఘాటు విమర్శలు..

PM Narendra Modi : కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ ఘాటు విమర్శలు..

Pm Modi Hyderabad Tour

PM Narendra Modi Speech:ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొన్న సందర్భంగా కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయింది అంటూ విమర్శలు కురిపించారు. ఒక కుటుంబం చేతిలో అధికారం ఉంటే ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారంటూ పరోక్షంగా కేసీఆర్ పాలనపై చురకలు వేశారు ప్రధాని మోడీ. కుటుంబ పార్టీలు కేవలం తమ స్వలాభం కోసమే పనిచేస్తాయని..తమ కుటుంబ అభివృద్ధి కోసమే పనిచేస్తాయని అటువంటివారికి ప్రజల బాధలు, కష్టాల గురించి తెలియవు అని అన్నారు. తమ కుటుంబ ఖజాలు నిండటం గురించే ఆలోచిస్తారు తప్ప ప్రజల యోగక్షేమాల గురించి ఏమాత్రం ఆలోచించరు అని విమర్శించారు. దోచుకోవటం దాచుకోవటం ఒక్కటే వారికి తెలుసు అని అన్నారు. అటువంటివారు సమాజంలో చీలికలు తేవటానికి యత్నాలు చేసి వారి అధికారాలను కాపాడుకుంటుంటారని అన్నారు.

కుటుంబ పాలకుల దృష్టి అంతా వారికి అధికారం ఎలా చేజిక్కించుకోవాలా? వచ్చిన అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలా? అని ఆలోచిస్తారు తప్ప ప్రజల బాధల గురించి ఆలోచించరు అంటూ చురకలు అంటించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నమ్మకాలకు.. సెంటిమెంట్లకు పెద్ద పీట వేసే సీఎం కేసీఆర్ ను పరోక్షంగాటార్గెట్ చేసిన ఆయన.. తాను అలాంటి మూఢనమ్మకాల్ని బ్రేక్ చేస్తానని చెబుతూ.. దానికి సంబంధించిన ఉదాహరణను ప్రస్తావించటం గమనార్హం.

మోడీ వ్యాఖ్యల్లో కుటుంబ పాలన.. కుటుంబ పార్టీలు దేశానికి చేటు. తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతిమయంగా మారింది. తెలంగాణ భవిష్యత్తు కోసం మేం పోరాటం చేస్తున్నాం అంటూ సాగింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది అని ప్రధాని ధీమాగా చెప్పారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో మార్పు తథ్యం..బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. ప్రజలు ఈ విషయంపై ఇప్పటికే స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారనీ..గతంలో జరిగిన ఎన్నికల్లోనే ప్రజలు ఈ విషయంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అమరులయ్యారు. వారందరికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని అన్నారు మోడీ. ప్రాణత్యాగాలు చేసినవారి ఆశయాలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులతో పాటు ఎవరి ఆశయాలు కూడా నెరవేరటం లేదని తెలంగాణ కుటుంబ పాలనలో ఉందని అన్నారు. కేవలం ఒక కుటుంబం కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరగలేదు. కుటుంబ పార్టీల్ని తరిమితేనే రాష్ట్రం.. దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర పరభుత్వ పథకాల్ని మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారని ప్రధాని ఆరోపించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన అవసరం ఉందని అన్న మోడీ..ఇక్కడి రాజకీయాల వల్ల పేదలకు దక్కట్లేదన్నారు.

21వ శతాబ్దంలోనూ కొందరు మూఢ నమ్మకాల్ని పాటిస్తున్నారు. అలాంటివాళ్లు తెలంగాణకు న్యాయం చేయలేరని అన్నారు. ముఢ నమ్మకాలు ఉన్న వ్యక్తులు తెలంగాణను ముందుకు తీసుకెళ్లలేరు. గుజరాత్ లోని ఒక ప్రాంతానికి వెళితే అధికారం పోతుందని ప్రచారం జరిగేది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి పదే పదే వెళ్లేవాడినని నేను విజ్ఞానాన్ని..టెక్నాలజీనే నమ్ముతాను మూఢనమ్మకాలను కాదు అని ప్రధాని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.