PM Modi : పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వే ప్రారంభించిన మోదీ..హైవేపై యుద్ధవిమానాలతో విన్యాసాలు

ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్​పుర్​ జిల్లాలో ఇవాళ(నవంబర్-16,2021)"పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వే"ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 22వేల 500 కోట్ల రూపాయల ఖర్చుతో

PM Modi : పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వే ప్రారంభించిన మోదీ..హైవేపై యుద్ధవిమానాలతో విన్యాసాలు

Pm (1)

ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్​పుర్​ జిల్లాలో ఇవాళ(నవంబర్-16,2021)”పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వే”ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 22వేల 500 కోట్ల రూపాయల ఖర్చుతో లక్నోను యూపీలోని తూర్పున ఉండే ప్రాంతాలను కలుపుతూ 340.8 కిలోమీటర్ల మేర నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్​ వేను ప్రారంభించేందుకు అంతకుముందు సీ-130జే యుద్ధ విమానంలో అక్కడికి వెళ్లిన మోదీ.. రహదారిపైనే ల్యాండ్​ అయ్యారు. యుద్ధవిమానంలో వెళ్లి రహదారిపైనే ల్యాండ్ అయ్యి వినూత్నంగా కార్యక్రమానికి హాజరైన ప్రధానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..”పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వే ఉత్తరప్రదేశ్ ని ఏకం చేస్తుంది. ఈరోజు నేను ఇక్కడ విమానంలో దిగాను. మూడేళ్ల ముందు పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేకు శంకుస్థాపన చేసిన రోజు.. ఇలా విమానంలో నుంచి దిగుతానని అనుకోలేదు. కానీ అది సాధ్యమైంది. ఉత్తర్​ప్రదేశ్, రాష్ట్ర ప్రజల​ శక్తిసామర్థ్యాలను సందేహించే వారు ఓసారి ఇక్కడి వచ్చి వీటిని చూడాలి. మూడేళ్ల ముందు ఇక్కడ ఏం లేవు. కానీ ఇప్పుడు అత్యాధునిక ఎక్స్​ప్రెస్​వేను అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారి పేదలు, మధ్యతరగతి, రైతులు మరియు వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. గత ప్రభుత్వాలు తమ నిర్లక్ష్యంతో రాష్ట్రాన్ని “శిక్షించాయి”. ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్న నాకు స్థానికులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. 2014లో మేం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు మా అభివృద్ధి ఎజెండాకు గత ప్రభుత్వం(అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం) ఎలా మద్దతివ్వలేదని గుర్తు చేసుకుంటే బాధగా ఉంది. గత పాలకులు ఉత్తర్​ప్రదేశ్​ అభివృద్ధిని పట్టించుకోలేదు, రాష్ట్రంలోని ఓ ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను మాఫియాకు రాసిచ్చేశారు. అయితే బీజేపీ పాలనలో రాష్ట్రాభివృద్ధిలో కొత్త శకం మొదలైంది. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి వేల కిలోమీటర్ల రోడ్లు వచ్చాయి, మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటివరకు 14 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు ప్రజలకు అందించింది” అని మోదీ అన్నారు.

పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేను ప్రారంభించిన అనంతరం అక్కడ నిర్వహించిన ఎయిర్​ షోను ప్రధాని మోదీ వీక్షించారు. ఏఎన్‌-32 విమానం, ఫైటర్‌ జెట్‌లు సుఖోయ్‌-30 ఎంకేఐ, మిరాజ్‌-2000 వంటి యుద్ధవిమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొని.. ఎక్స్​ప్రెస్ వేపై దిగాయి.

కాగా,లక్నోని యూపీలోని తూర్పున ఉండే ప్రాంతాలను కలుపుతూ 340.8 కిలోమీటర్ల మేర పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేను నిర్మించారు. లక్నో-సుల్తాన్‌పూర్‌ హైవేలోని చాంద్‌సరాయ్‌ గ్రామం నుంచి పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభమవుతుంది. బారాబంకి, అమేథీ, సుల్తాన్‌పూర్‌, ఫైజాబాద్‌, అంబేద్కర్‌ నగర్‌, ఆజంఘర్‌, మవూ ప్రాంతాలను కలుపుతూ చివరకు గాజీపుర్‌ జిల్లాలోని హల్దారియా వద్ద ముగుస్తుంది.ఈ హైవే మధ్యలో సుల్తాన్‌పూర్‌ దగ్గర యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దాదాపు మూడు కిలోమీటర్ల రన్‌వే ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్​స్ట్రిప్​పైనే మోదీ యుద్ధ విమానంలో దిగారు. ఆరు లేన్ల ఈ ఎక్స్​ప్రెస్ వే ని వాహనదారులకు ప్రయోజనం కలిగేలా, ఇంధన వాడకం తగ్గేలా నిర్మించారు. భవిష్యత్​లో దీన్ని ఎనిమిది వరుసల రహదారిగా మార్చుకోవచ్చు.

మరోవైపు,యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఆశించిన బీజేపీ అర‌కొర‌గా పూర్త‌యిన పూర్వంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభిస్తోంద‌ని మాజీ సీఎం,ఎస్పీ నేత అఖిలేష్ యాద‌వ్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు ప్రాజెక్టు నాణ్యత విష‌యంలో బీజేపీ ప్రభుత్వం రాజీప‌డింద‌ని అఖిలేష్ యాద‌వ్ ఆరోపించారు. పూర్తి నాణ్య‌త‌తో చేప‌ట్టాల్సిన ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టును బీజేపీ నాసిర‌కంగా నిర్మించింద‌ని అఖిలేష్ యాద‌వ్ దుయ్య‌బ‌ట్టారు.

ALSO READ Anantapur Robbery in Kadiri : టీచర్‌ని హత్యచేసి దోపిడీ చేసిన గ్యాంగ్ ని త్వరలోనే పట్టుకుంటాం: SP ఫకీరప్ప