Betel Cultivation : తమలపాకు సాగులో చీడపీడలు, తెగుళ్ళు నివారణ

తమలపాకు తోటలపై పొగాకు లద్దె పురుగు ఆశించి ఆకులను తీవ్రంగా నష్ట పరుస్తాయి. లద్దె పురుగు ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి.

Betel Cultivation : తమలపాకు సాగులో చీడపీడలు, తెగుళ్ళు నివారణ

Betel Leaf Farming

Updated On : December 18, 2021 / 3:52 PM IST

Betel Cultivation : తమల పాకును మన దేశంలో తాంబూలంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క తేమగల వేడి ప్రదేశాలో పెరుగుతుంది. మన రాష్ట్రంలో తెల్లకు, కారపాకు అనే రెండు రకాలను రైతులు సాగుచేస్తున్నారు. తమలపాకు విత్తనాలను ఎకరాకు 16 నుండి 20కిలోల అవిశ విత్తనాలను సాలుకు సాలుకు మీటర్ దూరంలో విత్తుతారు. ఎకరాకు 20వేల తమలపాకు తల తీగలను ఆరు నుండి ఎనిమిది కణుపులు ఉండేటట్లు ఎన్నుకోవాలి. తమలపాకు సాగులో సరైన యాజమాన్యపద్దతులు పాటిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు.

ఎరువుల యాజమాన్యం: తీగలను ఎగబాకించిన తరువాత రెండు నెలలకు యూరియా, వేప పిండి కలిపి 40 కిలోల చొప్పున కలిపి తీగల వద్ద వేయాలి. ఇలా చేస్తే చాలా వరకు తెగుళ్లు తగ్గుతాయి. ఎరువులు కూడా తీగలకు బాగా అందుతాయి.

అగ్గితెగులు:ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల కాలిన మచ్చల మాదిరిగా మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగుల ఉధృతి అధికంగా ఉంటే ఆకులు కుళ్లిపోతాయి. అగ్గి పురుగు నివారణకు కార్బరిల్ 50 శాతం పొడి మందును రెండు గ్రాములు తీసుకుని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

బర్మా పురుగు: కాండం లోపల భాగాన్ని తొలిచేయడం వల్ల బలహీనపడి మొక్కలు విరిగిపోతాయి. ఈ పురుగు తీగలకు ఆశించిన వెంటనే తీగల తలలను విరిచేస్తే వీటి ప్రభావం తగ్గుతుంది.

ఎండుతెగులు, మొదలు కుళ్ళు తెగులు: ఆకులపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు ఏర్పడి నల్లగా మారతాయి. తెగులు తీగ మొదట్లో ఆశించినప్పుడు వేరు గోధుమ రంగులోకి మారి తరువాత నల్లగా మారి కుళ్లిపోతాయి. ఈ దశలో తీగపై ఆకులు లక్షణాలు ఉన్న ఆకులను, తీగలను ఎప్పటికప్పుడు తీసి వేయాలి. అప్పటి నుంచి ఫిబ్రవరి నెల వరకు నెలకోసారి 0.5 శాతం బోర్డోపేస్టు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

బ్యాక్టీరీయా ఆకుమచ్చ తెగులు: తమలపాకుల అడుగు బాగాన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా పెద్దవై నలుపు రంగుకు మారి ఆకులు కుళ్లిపోతాయి. ఇవి తీగ, కాండంకు ఆశించినప్పుడు అవి పగుళ్లు ఏర్పడడం, నలుపు మచ్చలు ఏర్పడడం వంటివి జరుగుతున్నాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల నీటిలో పిచికారీ చేయాలి.

పొగాకు లద్దె పురుగు: తమలపాకు తోటలపై పొగాకు లద్దె పురుగు ఆశించి ఆకులను తీవ్రంగా నష్ట పరుస్తాయి. లద్దె పురుగు ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి. దీంతో ఆకులు అందవిహీనంగా కనిపించడంతో పాటు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించదు. ఈ పురుగుల నివారణకు 5 మిల్లీ లీటర్ల వేపనూనెను తప్పనిసరిగా పిచికారీ చేయాలి.

కొలటోట్రైకం ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు ఆశించిన ఆకులపై భాగంలో గుండ్రని గోధుమ రంగుతో కూడిన పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపి నల్లబడి ఆకు అంతా వ్యాపిస్తాయి. ఈ తెగులు ఆశించిన ఆకులు పూర్తిగా నాణ్యత కోల్పోతాయి. దీని నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తగ్గిపోతుంది.