Karnataka: సీఎం అవుతారన్న ఊహాగానాల మధ్య.. మఠంలో స్వామీజీని దర్శించుకున్న డీకే శివకుమార్

మఠం వద్ద డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య గురించి మాట్లాడారు.

Karnataka: సీఎం అవుతారన్న ఊహాగానాల మధ్య.. మఠంలో స్వామీజీని దర్శించుకున్న డీకే శివకుమార్

DK Shivakumar

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత డీకే శివకుమార్ (DK Shivakumar) పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేస్తుందా? అన్న ఉత్కంఠ నెలకొన్న వేళ ఆయన ఇవాళ ఓ స్వామీజీని కలిశారు. తుంకూరులోని శ్రీ కడసిద్ధేశ్వర మఠానికి (Sri Kadasiddeshwara Mutt) శివకుమార్ వెళ్లారు. కరిబసవవృషభ దేశికేంద్ర స్వామీజీ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం శివకుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కరిబసవ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయం వద్ద శివకుమార్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటక సీఎం ఎవరని మీడియా ప్రశ్నించింది. దీంతో తాను పార్టీ కోసం చాలాసార్లు త్యాగాలు చేశానని డీకే శికుమార్ అనడం గమనార్హం. ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు.

“నాకు, సిద్ధరామయ్యకు మధ్య విభేదాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కోసం నేను చాలా సార్లు త్యాగాలు చేశాను.. సిద్ధరామయ్యకు మద్దతు ఇచ్చాను. ఆయనకు పూర్తిగా సహకరించాను” అని డీకే శివకుమార్ చెప్పారు.

మఠం గురించి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. “ఇది నాకు చాలా పవిత్రమైన ప్రదేశం. స్వామీజీ నాకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తున్నారు. నాపై ఆదాయపన్ను శాఖ దాడులు చేసిన సమయంలోనూ స్వామీజీ నాకు సలహాలు ఇచ్చారు. 134 సీట్లు గెలవాలని అనుకున్నాను. అంతకంటే ఎక్కువే గెలిచాం” అని డీకే శివకుమార్ చెప్పారు.

Karnataka: కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుందో చెప్పేసిన కాంగ్రెస్