T20 World Cup 2021 Final : చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. తొలిసారి టీ20 వరల్డ్‌కప్ కైవసం

ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ 2021 విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇదే తొలిసారి. ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

T20 World Cup 2021 Final : చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. తొలిసారి టీ20 వరల్డ్‌కప్ కైవసం

T20 World Cup 2021 Winner Australia

T20 World Cup 2021 : ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ 2021 విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్ తో ఫైనల్లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో కొత్త చాంపియన్ గా నిలిచింది.

ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్ ను 18.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 77 పరుగులు), డేవిడ్ వార్నర్(38 బంతుల్లో 53 పరుగులు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మిచెల్ మార్ష్ నాటౌట్ గా నిలిచి జట్టుని గెలిపించాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ 18 బంతుల్లో 28 పరుగులు చేశాడు. దీంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ మ్యాచ్ ని ముగించింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు. తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ లోకి వచ్చిన కివీస్.. కప్ ను మాత్రం ముద్దాడ లేకపోయింది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆసీస్ ముందు చాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. కీలకమైన తుది పోరులో కివీస్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 48 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. తొలి 10 ఓవర్లకు కేవలం 57 పరుగులు సాధించిన కివీస్‌.. ఆఖరి పది ఓవర్లలో 115 పరుగులు రాబట్టింది. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ (4 ఓవర్లలో 60) భారీగా పరుగులు ఇచ్చాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మిచెల్‌ (8 బంతుల్లో 11 పరుగులు‌) దూకుడుగా ఆడేందుకు యత్నించినా త్వరగానే ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ కేన్‌తో కలిసి మార్టిన్‌ గప్తిల్ (28) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన గప్తిల్‌ ఆసీస్‌ ఫీల్డర్‌ స్టోయినిస్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఫిలిప్స్ (18)తో కలిసి కేన్‌ విజృంభించాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన కేన్‌.. తర్వాత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 14వ అర్ధశతకం నమోదు చేశాడు. కేన్ దూకుడు చూస్తే.. టీ20ల్లో తొలి సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ సాధ్యపడలేదు. 85 పరుగుల దగ్గర హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ దగ్గర స్మిత్‌ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, జంపా ఒక వికెట్‌ తీశారు.

ఎట్టకేలకు ఆస్ట్రేలియా నిరీక్షణకు తెరపడింది. 5 సార్లు వన్డే ప్రపంచకప్‌ సొంతం చేసుకున్నప్పటికీ అందని ద్రాక్షలా ఊరించిన పొట్టి కప్పును ముద్దాడింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో కొత్త చాంపియన్ గా అవతరించింది. కివీస్‌ కు.. ఇదే తొలి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కాగా, ఆసీస్‌కి రెండో ఫైనల్‌. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన ఆసీస్‌.. ఈసారి మాత్రం ట్రోఫీని చేజారనివ్వలేదు.