T20 World Cup 2021: రెండో వార్మప్‌లోనూ భారత్‌దే ఘన విజయం

ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్ లో.. బుధ‌వారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఇంకో వార్మ‌ప్ మ్యాచ్‌లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.

T20 World Cup 2021: రెండో వార్మప్‌లోనూ భారత్‌దే ఘన విజయం

T20 World Cup 2021 (2)

T20 World Cup 2021: ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021లో భాగంగా యూఏఈలో జ‌రిగిన రెండో వార్మ‌ప్ మ్యాచ్‌లోనూ భార‌త్ స‌త్తా చాటింది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్ లో.. బుధ‌వారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఇంకో వార్మ‌ప్ మ్యాచ్‌లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఆసీస్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 152 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ల‌లో స్టీవెన్ స్మిత్‌, మార్క్ స్టాయినిస్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌లు రాణించారు. స్మిత్ (57;  48 బంతులు ఆడిన 7 ఫోర్ల‌తో), స్టాయినిస్ (41; 25 బంతులు ఆడిన 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో) నాటౌట్‌గా నిలిచాడు. మ‌రో బ్యాట్స్‌మ‌న్ మ్యాక్స్‌వెల్ (37; 28 బంతుల్లో 5 ఫోర్ల‌తో)ఆకట్టుకున్నారు. భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్ 2 వికెట్లు తీయ‌గా, భువ‌నేశ్వ‌ర్, జ‌డేజా, చాహ‌ర్ త‌లో వికెట్ తీశారు.
అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ సునాయాసంగానే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 17.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 153 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో రోహిత్ శ‌ర్మ (60; 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో) చేసి రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 39 ప‌రుగులు చేయ‌గా, సూర్య‌కుమార్ యాద‌వ్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 38 ప‌రుగులు చేశాడు. మ‌రో బ్యాట్స్‌మ‌న్ హార్దిక్ పాండ్యా 8 బంతుల్లో 1 సిక్స‌ర్‌తో 14 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో అగ‌ర్ 1 వికెట్ తీశాడు.
అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన మొదటి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అంతకుముందు టీమిండియా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. మార్చి 2021 లో ఇంగ్లండ్‌తో జరిగిన హోమ్ సిరీస్ తర్వాత మొదటిసారి, భారత జట్టు (శ్రీలంక సిరీస్ మినహా) ఈ ఫార్మాట్‌లో మైదానంలోకి వచ్చింది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో, భారత జట్టు మంచి ఫాంలో కనిపిస్తుంది.