Air India-Tata Sons : టాటాల చేతికే ఎయిరిండియా..అధికారికంగా ప్రకటించిన కేంద్రం

ఎయిర్‌ ఇండియా సంస్థ టాటా సన్స్‌ పరమైంది. భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్ధ- ఎయిరిండియాను విక్రయించేందుకు గత ఏడాది డిసెంబర్‌లో బిడ్లను ఆహ్వానించింది.

Air India-Tata Sons : టాటాల చేతికే ఎయిరిండియా..అధికారికంగా ప్రకటించిన కేంద్రం

Air India (2)

Air India-Tata Sons ఎయిర్‌ ఇండియా సంస్థ టాటా సన్స్‌ పరమైంది. పెట్టుబడుల ఉపసంహారణలో భాగంగా కేంద్రప్రభుత్వం.. భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్ధ- ఎయిర్ ఇండియాను విక్రయించేందుకు గతేడాడి డిసెంబర్ లో బిడ్లను ఆహ్వానించగా… టాటా సన్స్, స్పైస్ జెట్ ముందుకు వచ్చాయి. రెండు బిడ్లను పరిశీలించిన కేంద్ర మంత్రుల బృందం చివరకు టాటా సన్స్‌కే మొగ్గు చూపింది.

ఎయిర్‌ ఇండియాను రూ. 18 వేల కోట్లకు టాటా సన్స్ దక్కించుకున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్​) కార్యదర్శి తహిన్​ కాంత పాండే శుక్రవారం ప్రకటన చేశారు. దీంతో ఇకపై ఎయిర్‌ ఇండియా విమానాల నిర్వహణ బాధ్యత మొత్తం టాటా సన్స్‌ గ్రూప్‌ చేతుల్లోకి వెళ్లనుంది. డిసెంబర్‌ నాటికి ఎయిరిండియా టాటా గ్రూప్‌ చేతికి రానుంది. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయాల్లో ఇదో చారిత్రక ఘట్టంగా మార్కెట్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. కేంద్రం ప్రకటన తర్వాత..వెల్ కమ్ బాక్ ఎయిరిండియా అంటూ టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఓ ట్వీట్ చేశారు

ఎయిర్ ఇండియా మరియు దానికే చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లో 100 శాతం వాటాను బిడ్ ద్వారా దక్కించుకోవడంతోపాటు…గ్రౌండ్-హ్యాండ్లింగ్ కంపెనీ- ఎయిర్ ఇండియా సాట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (AISATS) లో 50 శాతం వాటాను టాటా సన్స్ బిడ్ లో దక్కించుకుంది.

ఆగష్టు 31, 2021 నాటికి, ఎయిర్ ఇండియాకి మొత్తం రూ. 61,562 కోట్ల అప్పు ఉంది, అందులో రూ. 15,300 కోట్లు బిడ్డర్ తీసుకుంటారని పాండే తెలిపారు. మిగిలిన రూ. 46,262 కోట్లు ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ (AIAHL) కు బదిలీ చేయబడుతుందని ఆయన తెలిపారు. AIAHL అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్(SPV).

సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్ మాట్లాడుతూ..గెలిచిన బిడ్డర్ ఏ ఉద్యోగిని కనీసం ఒక సంవత్సరం పాటు తొలగించరని మరియు ఒక సంవత్సరం తర్వాత తొలగిస్తే.. వారికి VRS (స్వచ్ఛంద పదవీ విరమణ పథకం) అందించాల్సి ఉంటుందని చెప్పారు. గ్రాట్యుటీ మరియు పీఎఫ్ ప్రయోజనాలు ఉద్యోగులందరికీ అందించబడుతాయని ఆయన అన్నారు. ఈ రోజు నాటికి, ఎయిర్ ఇండియాలో 12,085 మంది ఉద్యోగులు ఉన్నారు, వారిలో 8,084 మంది పర్మినెంట్ మరియు 4,001 మంది కాంట్రాక్టు ఉద్యోగులు. ఇది కాకుండా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 1,434 మంది ఉద్యోగులు ఉన్నారని బన్సాల్ తెలిపారు.

అయితే.. ఎయిర్ ఇండియా అసలు పేరు టాటా ఎయిర్ లైన్స్. 1932లో టాటా ఎయిర్ లైన్స్ ను పారిశ్రామిక దిగ్గజం JRD టాటా స్ధాపించగా, స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయీకరణ చేసింది. దీని పేరును ఎయిర్ ఇండియాగా మార్చింది. 68 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటా చేతికొచ్చింది.

ALSO READ అప్ఘానిస్తాన్ లోని ఓ మసీదులో భారీ పేలుడు