ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ(రిటైర్మెంట్) వయస్సును పెంచేందుకు కూడా నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంచనున్నట్లు టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వగా.. ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉన్నట్లుగా వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలనే విషయంలో అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నామని, చర్చలు తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అంశం చిక్కుముడిగానే ఉండేదని, ఏది ముట్టుకున్నా పంచాయితీ, కోర్టు కేసులే ఉండేవని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అవి కొనసాగినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి, న్యాయ వివాదాలను పరిష్కరించుకొని ఇప్పుడిప్పుడే అన్ని విషయాల్లో స్పష్టతకు వచ్చినట్లు కేసిఆర్ చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిష్కరించాల‌ని కేసిఆర్ అధికారులకు చెప్పారు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలన్నారు. మార్చి నుండి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుండి శాశ్వతంగా విముక్తి పొందేలా చూడాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

అంతేకాదు.. ఇకపై ఉద్యోగి పదవీ విరమణ రోజే అన్నీ బెనిఫిట్స్‌ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అన్నీ శాఖల్లో ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులతో చర్చలకు సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.