Hari Singh Nalwa..అప్ఘాన్ లపై అనేక యుద్ధాలు చేసి గెల్చిన సిక్కు యోధుడు గురించి తెలుసా

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు అప్ఘానిస్తాన్. అసలు అప్ఘానిస్తాన్ గురించి కొన్ని ఆశక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుంది.

Hari Singh Nalwa..అప్ఘాన్ లపై అనేక యుద్ధాలు చేసి గెల్చిన సిక్కు యోధుడు గురించి తెలుసా

Harisingh8

Hari Singh Nalwa ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు అప్ఘానిస్తాన్. అసలు అప్ఘానిస్తాన్ గురించి కొన్ని ఆశక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుంది. అప్ఘానిస్తాన్ కి “జయించబడని ప్రాంతం” మరియు “సామ్రాజ్యాల శ్మశానంగా” పేరుంది. ఇప్పటివరకు ఈ దేశాన్ని పూర్తిగా ఎవరూ కూడా నియంత్రించలేకపోయారు. అప్ఘానిస్తాన్ ని తమ నియంత్రణలో ఉంచుకోవాలని దశాబ్దాలుగా జరిపిన యుద్ధాలుతో ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో ఇటీవలి కాలంలో ప్రపంచంలోని రెండు సూపర్ పవర్స్- ఒకప్పటి USSR(సోవియట్ యూనియన్) మరియు అమెరికా తమ దళాలను అప్ఘానిస్తాన్ నుంచి బయటకు తీసుకురావాల్సి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే లెజండరీ సిక్కు కమాండర్ హరి సింగ్ నల్వా మాత్రం… అఫ్ఘానిస్తాన్‌లో ఆటలు సాగిస్తున్న విచ్ఛిన్న శక్తులను తన దారికి తెచ్చుకొని.. అక్కడి ఉగ్రవాదులకు ఆయన పేరుచెబితేనే గుండెళ్లో దడ పుట్టే సిక్కు యోధునిగా పేరు సంపాదించాడు.

అసలు ఎవరీ హరి సింగ్ నల్వా
19వ శతాబ్దంలో భారత ఉపఖండపు వాయువ్య భాగంలో అధికారాన్ని కైవసం చేసుకున్న సిక్కు సామ్రాజ్యపు స్థాపకుడు, పరిపాలకుడు అయిన రంజీత్ సింగ్ సైనిక దళంలో ముఖ్యమైన మరియు అత్యంత నమ్మకమైన కమాండర్ లలో హరి సింగ్ నల్వా ఒకరు. రంజీత్ సింగ్ పాలన హయాంలో..కశ్మీర్,హజారా,పెషావర్ గవర్నర్ గా హరి సింగ్ పనిచేశారు. అనేక అప్ఘాన్ శక్తులను ఓడించి.. అప్ఘానిస్తాన్ సరిహద్దుల వద్దనున్న చాలా ప్రాంతాలపై మంచి పట్టు సాధించాడు హరి సింగ్. ఖైబర్ పాస్ మార్గం( వందల ఏళ్ల నుంచి 19వ శతాబ్దపు ప్రారంభం వరకూ భారత్ లోకి విదేశీ చొరబాటుదారులు ప్రవేశించేందుకు ఉన్న ప్రధాన మార్గం ఇదే)గుండా అప్ఘాన్ లు పంజాబ్ లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు హరి సింగ్.

అఫ్ఘాన్ జానపద కథలలో… తల్లులు తమ అల్లరి పిల్లలను కంట్రోల్ చేయడానికి హరి సింగ్ పేరు ఉపయోగిస్తుండేవారు. అప్ఘాన్ లోని తల్లులు ఏడుస్తున్న తమ పిల్లలను..ఏడుపు ఆపండి లేకుంటే హరిసింగ్ నల్వా వస్తున్నారు అని చెప్పి పిల్లల్లో భయం పుట్టించి ఏడుపు ఆపేలా చేసేవారని అమృత్‌సర్ లోని గురు నానక్ దేవ్ యూనివర్సిటీ (GNDU) మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్పీ సింగ్ గతంలో ఓ సందర్భంలో చెప్పారు. అఫ్ఘానిస్తాన్ సరిహద్దు మరియు ఖైబర్ పాస్‌లోని అనేక ప్రాంతాలపై నియంత్రణ సాధించడం ద్వారా మొట్టమొదటిసారిగా నార్త్-వెస్ట్ సరిహద్దులను ధ్వంసం చేయకుండా అఫ్ఘాన్‌లను నిరోధించిన వ్యక్తి హరి సింగ్ నల్వా.

అప్ఘాన్ లు తరుచుగా పంజాబ్ మరియు ఢిల్లీలోకి ప్రవేశిస్తున్న సమయంలో తన రాజ్యాన్ని కాపాడేందుకు మహారాజా రంజిత్ సింగ్ రెండు రకాల ఆర్మీని ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్,జర్మన్,ఇటాలియన్,రష్యన్స్,గ్రీక్ లు సహా మరికొందరితో నిర్వహించే ఒక ఆర్మీని(అధునాతమైన ఆయుధాలు కలిగిన) మరియు హరి సింగ్ నల్వా నేతృత్వంలో ఒక ఆర్మీని ఏర్పాటు చేశారు. మహారాజా రంజిత్ సింగ్ కి పెద్ద బలంగా ఉండేవారు హరి సింగ్. వేలమంది హజారాస్(అప్ఘానిస్తాన్ లోని ఒక గిరిజన తెగ)ని వారి బలం కన్నా మూడు రెట్లు తక్కువ సైన్యంతో ఓడించిన వ్యక్తి హరి సింగ్. అందుకే 2013లో భారత ప్రభుత్వం హరి సింగ్ ధైర్యం మరియు శూరత్వాన్ని గుర్తుచేసుకుంటూ నల్వా పేరుతో ఓ స్టాంప్ ని విడుదల చేసింది.

అప్ఘాన్ లు హరి సింగ్ కి భయపడటం ఎలా ప్రారంభమైంది?
అప్ఘాన్ లకు వ్యతిరేకంగా జరిగిన వివిధ యుద్ధాల్లో హరి సింగ్ పాల్గొన్నారు. దీనివల్ల అప్ఘాన్ ఆధీనంలోని చాలా భూభాగాలపై అప్ఘాన్ లు తమ పట్టు కోల్పోయారు. ఈ యుద్ధాలలో చాలా వరకు కమాండ్ హరి సింగ్ నల్వా నేతృత్వంలోనే జరిగాయి. 1807లో.. హరి సింగ్ కి 16ఏళ్ల వయస్సు అయినప్పటికీ కసూర్(ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)యుద్ధంలో ఆయన పాల్గొని..అప్ఘాన్ పాలకుడు కుతుబ్ ఉద్ దిన్ ఖాన్ ని ఓడించాడు. ఆ తర్వాత 1813లో అట్టోక్(ప్రస్తుతం పాక్ లోని ఓ సిటీ)యుద్ధంలో హరి సింగ్ మరికొందరు ఇతర కమాండర్ లతో కలిసి.. కాబూల్ రాజు షా మొహమ్మద్ తరపున పోరాడిన అజిమ్ ఖాన్ మరియు ఆయన సోదరుడు దోస్త్ మొహమ్మద్ ఖాన్ పై విజయం సాధించారు. దుర్రాని పఠాన్స్ పై సిక్కులు సాధించిన మొదటి అతిపెద్ద విజయం ఇదే. 1818లో హరి సింగ్ నేతృత్వంలో సిక్కు ఆర్మీ..పెషావర్(ప్రస్తుత పాక్ లోని ప్రాంతం ) యుద్ధంలో విజయం సాధించింది. ఈ సమయంలో అప్ఘాన్-పంజాబ్ బోర్డర్ పై ఓ కన్నేసి ఉంచేందుకు అక్కడే ఉండాలని హరి సింగ్ ఆదేశించబడ్డారు. 1837లో జామ్రుద్(ప్రస్తుత పాక్ లో ఉంది)ని తన ఆధీనంలోకి తీసుకున్నారు హరి సింగ్. జామ్రుద్ కోట..ఆ కాలంలో ఖైబర్ పాస్ గుండా అప్ఘానిస్తాన్ లోకి వెళ్లడానికి ప్రవేశ మార్గంగా ఉండేదని చరిత్రకారుడు మరియు ప్రస్తుతం హిందు కన్యా కాలేజ్ ఆఫ్ కపుర్తలా డైరక్టర్ గా ఉన్న డాక్టర్ సతీష్ కే కపూర్ తెలిపారు. ముల్తాన్,హజారా,మనేకీరా,కశ్మీర్ యుద్ధాలలో హరి సింగ్ శత్రువులను ఓడించారన్నారు. అప్ఘాన్ లను ఓడించి సిక్కు సామ్రాజ్యాన్ని హరి సింగ్ విస్తరించారని సతీష్ కపూర్ తెలిపారు. అప్గాన్ లపై సాధించిన ఈ విజయాలన్నీ..అప్ఘాన్ లలో హరి సింగ్ పేరు వింటేనే భయపడేలా చేశాయి.

హరి సింగ్ చివరి యుద్ధంలో ఏం జరిగింది

చరిత్రకారులు తెలిపిన ప్రకారం..జామ్రుద్ యుద్ధంలో హరి సింగ్ చనిపోయాడు. దోస్త్ మొహమ్మద్ ఖాన్ తన ఐదుగురు కొడుకులతో కలిసి సిక్కు ఆర్మీ(దాదాపు 600మంది మాత్రమే సైన్యం,లిమిటెడ్ సప్లయిస్ కలిగి ఉంది)పై పోరాడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. యుద్ధం ప్రారంభం సమయంలో షెషావర్ లో ఉన్న హరి సింగ్..సిక్కు ఆర్మీని కాపాడేందుకు జామ్రుద్ వైపు వెళ్లారు. అప్పటికే జామ్రుద్ ని దోస్త్ మొహమ్మద్ దళాలు చట్టుముట్టి ఉన్నాయి. హరి సింగ్ ఆకశ్మిక పర్యటన గురించి తెలుసుకున్న అప్ఘాన్ ఆర్మీ ఆశ్చర్యపోయి హడావుడిగా యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్లడం ప్రారంభించింది. ఈ సమయంలో హరి సింగ్ తీవ్రంగా గాయపడ్డాడని ఆ తర్వాత చనిపోయాడని చెబుతారు. కానీ అతని మరణానికి ముందు, లాహోర్ నుండి బలగాలు వచ్చి సిక్కు ఆర్మీకి మద్దతు ఇచ్చే వరకు తన మరణ వార్తలను వెల్లడించవద్దని తన సైన్యానికి హరి సింగ్ చెప్పాడని చరిత్రకారులు తెలిపారు. హరి సింగ్ చుట్టుపక్కనే ఉన్నాడని శత్రువులు భయపడేలా సిక్కు ఆర్మీ..హరి సింగ్ శరీరాన్ని ఉపయోగిస్తుండేవారని చెబుతారు. జానపద కథల ప్రకారం.. లాహోర్ నుండి దళాలు జామ్రుద్ కి చేరే వరకు ఇది ఒక వారం పాటు జరిగింది.

అయితే జామ్రుద్ యుద్ధానికి ముందు, లాహోర్ లో మహారాజా రంజిత్ సింగ్ మనువడు నౌ నిహాల్ సింగ్ పెళ్లికి హరి సింగ్ హాజరవ్వాల్సి ఉండింది. అయితే హరి సింగ్ ఆ పెళ్లికి హరిసింగ్ వెళ్లలేదు. ఎందుకంటే ఆయన ఓ సమర్థవంతమైన అడ్మినిస్ట్రేటర్ కాబట్టే. తాను లాహోర్ లో జరిగే పెళ్లికి వెళితే..దోస్త్ మొహమ్మద్ ఖాన్ జామ్రుద్ పై దాడి చేయడానికి అదే అదునుగా భావిస్తాడని హరి సింగ్ ఊహించాడు. లాహోర్ లో జరిగే పెళ్లికి దోస్త్ మొహమ్మద్ కి కూడా ఆహ్వానం అందినప్పటికీ ఆయన వెళ్లకపోవడంతోనే..హరి సింగ్ ముందు జాగ్రత్తగా పెళ్లికి వెళ్లకుండా జామ్రుద్ లోనే ఉండిపోయారు.

ఆఫ్ఘన్‌లపై ఈ విజయాలు భారతదేశానికి ఎలాంటి తేడాను కలిగించాయి?

మహారాజా రంజిత్ సింగ్ మరియు అతని కమాండ్ హరి సింగ్ నల్వా కనుక ఒకవేళ పెషావర్ ని మరియు నార్త్ వెస్ట్ సరిహద్దుని(ప్రస్తుతం పాకిస్తాన్ లో భాగంగా ఉంది) గెల్చుకోలేకపోయి ఉండి ఉంటే..ఈ ప్రాంతమంతా అప్ఘానిస్తాన్ లో భాగంగా ఉండిపోయేదని,పంజాబ్ మరియు ఢిల్లీలోకి అప్ఘాన్ ల చొరబాట్లు ఎప్పటికీ ఆగేవి కాదని చరిత్రకారులు చెబుతుంటారు.

ఉప్పల్ కుటుంబంలో జన్మించినప్పటికీ నల్వాగానే ఎందుకు పిలువబడ్డారు
1791లో గుజ్రన్ వాలా(ప్రస్తుత పాకిస్తాన్ లో ఉంది)లోని ఉప్పల్ కుటుబంలో హరి సింగ్ జన్మించారు. చాలా చిన్న వయస్సులోనే తనపై దాడి చేయడానికి ప్రయత్నించిన ఓ పులిని హరి సింగ్ చంపేశారు. అప్పటి నుంచే ఆయన పేరు పక్కన నల్వా చేరింది. హరి సింగ్ ని భగ్ మార్(కిల్లర్ ఆఫ్ టైగర్)అని కూడా పిలిచేవారు.

హరిసింగ్ వేటకు వెళ్లిన సమయంలో సడెన్ గా మెరుపువేగంతో ఓ పులి వచ్చి మీదపడటంతో హరిసింగ్ కి కత్తితీసి దానిపై పోరాడే సమయం కూడా లేకపోవడంతో..పులి దవడలు పట్టుకని దానిని వెనక్కి తోసి అప్పుడు తన ఖడ్గం తీసి దానిని చంపేశాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మహారాజా రంజిత్ సింగ్..హరి సింగ్ ని “వా మేరే రాజా నల్ వాహ్”అని పిలిచారు. మహాభారతంలో.. నల్ అనే వ్యక్తి రాజుగా ఉండేవారు. ధైర్యసాహసాలు కలిగినవాడుగా ఆయనకు పేరు ఉండేది. అటువంటి ధైర్యసాహసాలు కలిగినందుకునే హరిసింగ్ ని నల్ అని పిలిచేవారు.

హరి సింగ్ ఏడేళ్ల వయస్సులో ఉన్నప్పుడే తండ్రి గుర్దియాల్ సింగ్ ని కోల్పోయారు. హరి సింగ్ ని ఆయన మేనమామ పెంచారు.

Read Taliban : అసలు ఎవరీ తాలిబన్లు..వీళ్ల లక్ష్యం ఏంటీ!

.