Bandi Sanjay: బండి సంజయ్ ఔట్.. ఎక్కడ తేడా కొట్టింది.. కిషన్ రెడ్డి ముందున్న సవాళ్లు ఏంటి?

వచ్చే ఎన్నికలకు వరకు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటారని భావించారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి తారుమారయింది.

Bandi Sanjay: బండి సంజయ్ ఔట్.. ఎక్కడ తేడా కొట్టింది.. కిషన్ రెడ్డి ముందున్న సవాళ్లు ఏంటి?

Eatala Rajender, Kishan Reddy, Bandy Sanjay

Bandi Sanjay- BJP Telangana: ఊహించిందే జరిగింది. గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు కమలం పార్టీ అధిష్టానం తెర దించింది. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని బీజేపీ జాతీయ నాయకత్వం మార్పులు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (Telangana)తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ బీజేపీ హైకమాండ్ (BJP High Command) నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కిషన్ రెడ్డి (Kishan Reddy), ఏపీకి దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari)ని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించింది. పంజాబ్ (Punjab), జార్ఖండ్ రాష్ట్రాల అధ్యక్షులను కూడా మార్చుతూ అధికారిక ఉత్తర్వులు వెలువరించింది.

తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించడం బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ లేనంత పార్టీగా యాక్టివ్ అయిందని అభిప్రాయపడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కొని, బీజేపీకి ఊపు తెచ్చారని అంటున్నారు. పాదయాత్రతో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారని.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నాయకులను బీజేపీ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారని అంటున్నారు. స్వయంగా ప్రధాని మోదీ కూడా బండి సంజయ్ పనితీరును పలు సందర్భాల్లో ప్రశంసించారని గుర్తు చేస్తున్నారు.

సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాలు
వచ్చే ఎన్నికలకు వరకు తెలంగాణలో ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని భావించారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి తారుమారయింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో అధికారంలోకి రావడంతో బీజేపీ హైకమాండ్ ఆలోచనలో పడింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చాలని నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఇందులో భాగంగా కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు.. ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాలు ఆధారంగా ఈ మార్పులు చేపట్టినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

Bandi Sanjay

Bandi Sanjay

అందుకే తప్పించారా?
తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ శ్రేణులు బాగా యాక్టివ్ అయ్యాయి. అయితే చాలా సీనియర్ నాయకులు ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఇబ్బంది పడ్డారు. అందరినీ కలుపుకుని పోవడంలో సంజయ్ విఫలమయినట్టు ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో సమన్వయ లోపం స్పష్టంగా కనబడింది. సామాజిక సమీకరణాలు కూడా బండికి మైనస్ గా మారినట్టు తెలుస్తోంది. సంజయ్ నాయకత్వంపై పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కమలం పార్టీ హైకమాండ్ ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. ప్రస్తుతం కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బండి సంజయ్ కు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కనుందని సమాచారం. కాగా, పదవీ కాలం ముగిసినందున అధ్యక్షుల మార్పు జరిగిందని, ఇందులో ఊహాగానాలకు ఆస్కారం లేదని బీజేపీ నాయకులు అంటున్నారు.

Kishan Reddy

Kishan Reddy

కిషన్ రెడ్డి ముందు సవాళ్లు
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన కిషన్ రెడ్డి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ నాయకులు అందరినీ ఏకంగా చేయాల్సిన అవసరం ఉంది. తమ పార్టీలో అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించడం, ఇతర పార్టీ నుంచి చేరికలు పెంచడంపై ఫోకస్ పెట్టాలి. తెలంగాణ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్దం చేయడం, అధికార బీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కొవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల వరకు పార్టీని సమర్థవంతంగా నడపాల్సి ఉంటుంది. అయితే గతంలో అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఇప్పుడు ఆయనకు పనికొస్తుందని, వివాదరహితుడిగా పేరున్న కిషన్ రెడ్డి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరి.. మొదటి మహిళా చీఫ్‌గా రికార్డ్

Raghunandan Rao Tweet

Raghunandan Rao

రఘునందన్ ట్వీట్
కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అభినందనలు తెలిపారు. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ బలపడిందని.. కిషన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి రాబోతున్నామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ట్వీట్ చేశారు. ఆయన కోరుకున్నట్టుగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందో, రాదో తెలియాలంటే ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే.