Yogi Adityanath Oath : రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం

Yogi Adityanath : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన పార్టీగా బీజేపీ అవతరించింది.

Yogi Adityanath Oath : రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం

Yogi Adityanath Takes Oath As Up Cm For Historic Second Term

Yogi Adityanath Oath : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన పార్టీగా బీజేపీ అవతరించింది. యోగి ఆధిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ రెండోసారి కూడా యూపీలో అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. ఐదేళ్ల పూర్తి పదవీకాలం పూర్తయిన తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన యూపీలో మొదటి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. శుక్రవారం (మార్చి 25)న యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 37 ఏళ్లలో రాష్ట్రంలో మరే సీఎం కూడా ఈ ఘనత సాధించలేదు. లక్నోలో అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో వేలాది మంది ప్రజల సమక్షంలో యోగి రెండోసారి యూపీ సీఎంగా ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ యోగి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ మౌర్య ఓడినప్పటికి డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.

ఇక దినేష్ శర్మ స్థానంలో బ్రజేష్ పాఠక్‌ను నియమించారు. యోగి ఆధిత్యనాథ్‌తో పాటు బ్రజేష్ పాఠక్, కేశవ ప్రసాద మౌర్య ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్ మంత్రులుగా సూర్య ప్రతాప్ షాహి, స్వతంత్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, సురేశ్ కుమార్ ఖన్నా, లక్ష్మీ నారాయణ చౌదరి, నంద గోపాల్ నంద, జైవీర్ సింగ్, ధర్మపాల్ సింగ్, భూపేంద్ర సింగ్ చౌదరి, అనిల్ రాజ్‌బర్, జితేంద్ర ప్రసాద, రాకేశ్ సచాన్, అరవింద్ కుమార్ శర్మ, యోగేంద్ర ఉపాధ్యాయ్, అశిశ్ పాటిల్, సంజయ్ నిషద్ ప్రమాణం చేశారు. యోగి మంత్రివర్గంలో స్వతంత్ర్య హోదాతో కూడిన మంత్రులుగా నితిన్ అగర్వాల్, కపిల్ దేవ్ అగర్వాల్, రవీంద్ర జైశ్వాల్, సందీప్ సింగ్, గులాబ్ దేవీ, గిరీశ్ చంద్ర యాదవ్, ధర్మవీర్ ప్రజాపతి, అసిమ్ అరుణ్, జేపీఎస్ రాథోడ్, దయాశంకర్ సింగ్, నరేంద్ర కశ్యప్, దినేశ్ ప్రతాప్ సింగ్, అరుణ్ కుమార్ సక్సేనా, దయాశంకర్ మిశ్రా దయాలు కూడా ప్రమాణం చేశారు. ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఓట్లతో విజయం సాధించింది.

రాష్ట్రంలో 403 సీట్ల అసెంబ్లీలో 202 మార్కును అధిగమించిన బీజేపీ 255 సీట్లను గెల్చుకుంది. మిత్రపక్షాలైన అప్నా దళ్ (సోనేలాల్) 12 సీట్లు, నిషాద్ పార్టీ 6 సీట్లు గెలిచాయి. విపక్ష సమాజ్‌వాదీ పార్టీ 111 సీట్లు గెలుచుకోగా, మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్ 8 సీట్లు, మిత్రపక్షం సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 6 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో గెలవగా బీఎస్పీ ఒక సీటు గెలుచుకుంది. యోగి గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దినేష్ శర్మకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని భావించింది. అయితే దినేశ్ స్థానంలో ఆయన సామాజికవర్గానికి చెందిన బ్రజేష్ పాఠక్‌ను డిప్యూటీ సీఎంగా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పాఠక్ రాజధాని లక్నోలోని కాంట్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుంచి బీజేపీలోకి పాఠక్ మారారు. పాఠక్ న్యాయ మంత్రిగా కూడా వ్యవహరించారు.

Read Also : Yogi Aditya Nath : నేడు యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్య ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ