Male Fertility : టీకా తీసుకుంటే.. పురుషుల్లో సంతాన సామర్థ్యం కోల్పోతారా? తేల్చేసిన సైంటిస్టులు..!

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్లు యుద్ధ ప్రాతిపాదికన అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఈ కరోనా టీకాలపై అనేక అపోహాలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ వచ్చినా తీసుకునేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.

Male Fertility : టీకా తీసుకుంటే.. పురుషుల్లో సంతాన సామర్థ్యం కోల్పోతారా? తేల్చేసిన సైంటిస్టులు..!

Covid 19 Vaccines Don’t Lower Sperm Count

Male Fertility  : ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలు ఆర్థికంగా దెబ్బితిన్నాయి. లక్షల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎప్పటికప్పుడూ మ్యుటేషన్లతో రూపాంతరం చెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్లు యుద్ధ ప్రాతిపాదికన అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఈ కరోనా టీకాలపై అనేక అపోహాలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ వచ్చినా తీసుకునేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అమెరికాలో పురుషులు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఆందోళన పడిపోతున్నారు. భయంతో టీకా వద్దునే వద్దు అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే పురుషుల్లో సంతాన సామర్థ్యం కోల్పోతారనే అపోహ ఉంది.. అందుకే చాలామంది పురుషులు వ్యాక్సిన్ తీసుకునేందుకు జంకుతున్నారు.

అసలు వ్యాక్సిన్ కు సంతాన సామర్థ్యానికి సంబంధం ఏంటి? వ్యాక్సిన్ తీసుకున్నవారిలో సంతాన సామర్థ్యం తగ్గుతుంది అనడంలో ఎంతవరకు వాస్తవం ఉందో తేల్చేపనిలో పడ్డారు సైంటిస్టులు. అదే కోణంలో లోతుగా అధ్యయనాలు చేశారు. ఈ అధ్యయనంలో సంచలన వాస్తవాలు బయటకి వచ్చాయి. పరిశోధన ఫలితాలను అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కు చెందిన జామా జర్నల్ లో ప్రచురించారు. మియామీ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు.. కొవిడ్ సోకని 18ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న 45 మంది పురుషులపై పరిశోధనలు చేశారు. 45 మందిని రెండు గ్రూపులుగా విభజించారు. వారిలో mRNA విధానంలో తయారైన టీకాలను ఇవ్వడానికి రెండు నుంచి వారం రోజుల ముందు వారి నుంచి వీర్యాన్ని సేకరించారు.

ఒక గ్రూప్ సభ్యులకు ఒక రకం వ్యాక్సిన్.. మరో గ్రూపు సభ్యులకు మరో రకం వ్యాక్సిన్ ఇచ్చారు. రెండు గ్రూపుల సభ్యుల్లో రెండో డోసు టీకా తీసుకున్న దాదాపు 70 రోజుల తర్వాత మళ్లీ వారిలో వీర్యాన్ని సేకరించారు. సేకరించిన వీర్యాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా టెస్టులు నిర్వహించారు. వ్యాక్సిన్ వల్ల ఎవరిలోనూ వీర్యకణాల సంఖ్య తగ్గినట్టుగానీ, లైగింక సామర్థ్యం తగ్గలేదని కనుగొన్నారు. కొందరిలో సీమెన్ వ్యాల్యూమ్‌ సహా స్పెర్మ్ మొబిలిటీ గణనీయంగా పెరిగినట్టు నిర్ధారించారు కూడా. అధ్యయనంలో స్పెర్మ్ కాన్‌సెంట్రేషన్ 26 మిలియన్/ml, టోటల్ మొబైల్ స్పెర్మ్ కౌంట్ 36 మిలియన్లుగా ఉందని నిర్ధారించారు. రెండో డోసు తీసుకున్న తర్వాత స్పెర్మ్ కాన్‌సెంట్రేషన్ 30 మిలియన్/mlకు పెరిగిందన్నారు.

టోటల్ మొబైల్ స్పెర్మ్ కౌంట్ 44 మిలియన్లకు పెరిగినట్టు గుర్తించారు. mRNA విధానంలో తయారైన టీకాల్లో వైరస్ బతకదని, అది వీర్యకణాల సంఖ్య, లైంగిక సామర్థ్యంపై ఎలాంటి దుష్ప్రభావం కలిగే ఛాన్స్ లేదని పరిశోధకులు తేల్చి చెప్పేశారు. పురుషుల్లో టీకా తీసుకోవడం వల్ల పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గుతుందనే ప్రచారాన్ని సైంటిస్టులు కొట్టిపారేశారు. అదంతా అపోహ మాత్రమేనని తేల్చేశారు. సంతాన సామర్థ్యంపై టీకాలు ఎలాంటి ప్రభావం చూపవని అధ్యయనంలో తేలిందని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ ఎవరైనా తీసుకోవచ్చునని, ఎలాంటి ప్రభావం ఉండదని, అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు.