పుట్టబోయే శిశువుల మాయలో మైక్రోప్లాస్టిక్స్.. ఇదే ఫస్ట్ టైం అంటున్న సైంటిస్టులు

పుట్టబోయే శిశువుల మాయలో మైక్రోప్లాస్టిక్స్.. ఇదే ఫస్ట్ టైం అంటున్న సైంటిస్టులు

Microplastics reveal in placentas : పుట్టబోయే శిశువుల మావి/మాయలో మొట్టమొదటిసారిగా మైక్రోప్లాస్టిక్ కణాలు బయటపడ్డాయని సైంటిస్టులు అంటున్నారు. గర్భసంచిలోని మాయలో మైక్రోప్లాస్టిక్ కణాలు కనిపించడం ఇదే మొదటిసారిగా వెల్లడించారు. ఈ కణాలు వల్ల ఆరోగ్యంపై ఎంతవరకు ప్రభావం పడుతుందో తెలియదు గానీ, పిండాలకు మాత్రం దీర్ఘకాలిక నష్టం కలిగిస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయంగా పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో మైక్రోప్లాస్టిక్స్ కారణంగా దీర్ఘకాలిక నష్టాన్ని కలిగించే రసాయనాలను ఉత్పత్తి చేయొచ్చునని అంటున్నారు. పిండం అభివృద్ధి చెందుతున్న రోగనిరోధక శక్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపే ముప్పు ఉందని తెలిపారు. ఈ కణాలు తల్లులు తినే లేదా ఊపిరి పీల్చుకోవడం ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందంటున్నారు.

సాధారణ ప్రెగ్నెన్సీ, ప్రసవించిన నలుగురు ఆరోగ్యకరమైన మహిళల్లో మావిలో కణాలను పరిశోధకులు గుర్తించారు. గర్భసంచిలో స్రవించే మావిలో పెరిగే పిండం అభివృద్ధి చెందుతున్న పొరల్లో ఒక డజను వరకు మైక్రోప్లాస్టిక్స్ కణాలను గుర్తించారు. ప్రతి మావిలో కేవలం 4శాతం మాత్రమే విశ్లేషించినట్టు తెలిపారు. మొత్తం మైక్రోప్లాస్టిక్‌ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. అయితే విశ్లేషించిన అన్ని మైక్రో ప్లాస్టిక్ కణాలు నీలం, ఎరుపు, నారింజ లేదా గులాబీ రంగులు వేసిన ప్లాస్టిక్‌లు, మొదట ప్యాకేజింగ్, పెయింట్స్ లేదా సౌందర్య సాధనాలు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల నుండి వచ్చినవిగా సైంటిస్టులు తేల్చేశారు. మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువగా 10 మైక్రాన్ల పరిమాణంలో (0.01 మిమీ) ఉన్నాయి. రక్తప్రవాహంలో తీసుకువెళ్ళేంత చిన్నవిగా ఉంటాయి. కణాలు శిశువుల శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చునని భావిస్తున్నారు. కానీ, పరిశోధకులు దీనిపై సరైన అంచనా వేయలేకపోతున్నారు.

పిండం ఎదుగుదలో ఎంతో కీలకమైన మావి/మాయలో హానికరమైన ప్లాస్టిక్ కణాల ఉనికి ఆందోళన కలిగించే విషయంగా చెబుతున్నారు. మైక్రోప్లాస్టిక్స్ రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపించవచ్చు లేదా విషపూరిత కలుషితాల విడుదలకు దారితీయొచ్చు.. దీనిపై అంచనా వేయడానికి మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. పిండాలపై మైక్రోప్లాస్టిక్స్ ప్రభావం పడితే పిండం పెరుగుదల తగ్గుతుంది. కొంతమంది తల్లుల మావిలో మాత్రం ఈ తరహా కణాలు కనిపించలేదు. వివిధ శరీరధర్మ శాస్త్రం, ఆహారం లేదా జీవనశైలి ఫలితంగా ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. మావిలో కలుషితాన్ని నివారించడానికి ఇటాలియన్ పరిశోధకులు మహిళల ప్రసవానికి ప్లాస్టిక్ రహిత ప్రోటోకాల్‌ను పాటించారు. మహిళల ప్రసవం సమయంలో ప్రసూతి వైద్యులు, మంత్రసానిలు కాటన్ గ్లౌజులను ఉపయోగించారు.