ఎన్నికలు రద్దు.. మూడు నెలల్లో మళ్లీ జరపండి: హైకోర్టు

  • Published By: vamsi ,Published On : January 25, 2020 / 04:50 AM IST
ఎన్నికలు రద్దు.. మూడు నెలల్లో మళ్లీ జరపండి: హైకోర్టు

చట్టప్రకారం జరుగనందువల్ల నడిగర్‌ సంఘం ఎన్నికలు చెల్లవంటూ వేసిన పిటీషన్‌పై కీలక తీర్పు ఇచ్చింది మద్రాసు హైకోర్టు. నటుడు విశాల్, నాజర్, కార్తీ వర్గానికి షాక్‌ ఇస్తూ.. గతేడాది జరిగిన ఎన్నికలు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. గత ఏడాది జూన్‌ 23వ తేదీన నడిగర్‌ సంఘం(దక్షిణ భారత నటీనటుల సంఘం)కు ఎన్నికలు జరగగా.. ఎన్నికల్లో నాజర్‌ అధ్యక్షతన పాండవర్‌ పేరుతో ఒక జట్టు, దర్శక నటుడు కే.భాగ్యరాజ్‌ అధ్యక్షతన స్వామి శంకరదాస్‌ పేరుతో ఒక జట్టు పోటీ పడ్డాయి. అయితే ఎన్నికలు జరిగినా కూడా ఓట్ల లెక్కింపు మాత్రం చేపట్టలేదు.

2019 జూన్‌ 23వ తేదీన స్థానిక మైలాపూర్‌లోని ప్రైవేటు పాఠశాలలో నడిగర్‌ సంఘం ఎన్నికలు జరగగా ఈ ఎన్నికలకు వ్యతిరేకంగా మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ క్రమంలోనే అనేక వాయిదాల అనంతరం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇంతకు ముందు జరిగిన సంఘం ఎన్నికలు చెల్లవని, సంఘ నిర్వాకం గడువు పూర్తయిన తరువాత ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్ధమని వెల్లడించారు.

సంఘానికి మూడు నెలల్లోపు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. సంఘం సభ్యుల పట్టికను కొత్తగా తయారు చేయాలని, ఎన్నికల పర్యవేక్షణకు మాజీ న్యాయమూర్తి గోకుల్‌దాస్‌ను నియమిస్తున్నట్లు వెల్లడించింది కోర్టు. అప్పటి వరకూ ఎన్నికల అధకారిణిగా గీతనే సంఘం బాధ్యతలను నిర్వహిస్తారని న్యాయస్థానం స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో నాజర్ వర్గం ఉంది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ వారు సుప్రీం కోర్టుకు వెళ్లతారా, లేక చెన్నై హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటారా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. సంఘ మాజీ కార్యదర్శి, సంఘం నుంచి సస్పెండ్‌ అయిన సీనియర్‌ నటుడు రాధారవి మాత్రం కోర్టు తీర్పును స్వాగతిస్తూ.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న తీర్పు మంచిదేనని తనను సంఘం నుంచి తొలగించడమే తప్పు అన్నారు.  విశాల్‌ వర్గం మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, సుప్రీంకోర్టుకు వెళ్లితే ఆ కేసు విచారణకు మూడేళ్లు పడుతుందని అన్నారు.