Sashi Preetam : 100 ఫ్రీ షోలు.. ఆ తర్వాతే థియేటర్‌కి.. కొత్తగా ట్రై చేస్తున్న చిన్న సినిమా డైరెక్టర్..

 ఓ డైరెక్టర్ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. చిన్న సినిమాలని ఎవరూ పట్టించుకోవట్లేదని, చిన్న సినిమాకి థియేటర్లు దొరకట్లేదని ఆలోచించి...............

Sashi Preetam : 100 ఫ్రీ షోలు.. ఆ తర్వాతే థియేటర్‌కి.. కొత్తగా ట్రై చేస్తున్న చిన్న సినిమా డైరెక్టర్..

Life Of 3

Sashi Preetam :  ఓ డైరెక్టర్ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. చిన్న సినిమాలని ఎవరూ పట్టించుకోవట్లేదని, చిన్న సినిమాకి థియేటర్లు దొరకట్లేదని ఆలోచించి సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. మనం గమనిస్తే ఇటీవల కాలంలో చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం చాలా కష్టమైపోయింది. ఈ సమస్య ఎప్పట్నుంచో ఉంది. ఇక ఓటీటీలో రిలీజ్ చేయాలన్నా చిన్న సినిమాలకి అది అంత ఈజీ కాదు. ధైర్యం చేసి కొన్ని థియేటర్లలో సినిమా రిలీజ్ చేసినా జనాలు వస్తారో, రారో అనే సందేహం. ఓటీటీలో రిలీజ్ చేసినా అందులో ఉండే చాలా సినిమాల్లో మనది ఎంతవరకు రీచ్ అవుతుందని అనుమానం.

ఇలాంటివన్నీ ఆలోచించి దీనికి ఒక కొత్త పరిష్కారం ఆలోచించారు ఓ దర్శక నిర్మాత. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..’ అంటూ తన మ్యూజిక్ తో అందర్నీ మెప్పించి గులాబీ సినిమా లాంటి ఒక క్లాసిక్ ఆల్బమ్ ఇచ్చిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్ ఇటీవల దర్శకుడిగా మారారు. గతంలో పలు సినిమాలకి మ్యూజిక్ అందించిన ఆయన ఆ తర్వాత ఎన్నో యాడ్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు డైరెక్ట్ చేస్తూ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేస్తున్నారు. తాజాగా ఆయన డైరెక్టర్ గా మారి ‘Life of 3’ అనే ఓ సస్పెన్స్, హారర్ అంశాలు ఉన్న సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం కూడా ఈయనే అందించారు.

ఈ ‘Life of 3’ సినిమా కోటి రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ప్రస్తుతం చిన్న సినిమాలకి ఆదరణ అంతగా ఉండకపోవడంతో ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు శశి ప్రీతమ్. టూరింగ్ టాకీస్ కార్నివాల్ అనే పేరుతో ఈ సినిమాని ముందుగా ఏపీ, తెలంగాణలోని పలు నగరాల్లో 100 ఫ్రీ షోలు వేయాలని నిర్ణయించుకున్నారు. దీని ద్వారా దాదాపు ఓ పదివేల మందికి ఈ సినిమాని ఫ్రీగా చూపించనున్నారు. సినిమా చూసిన ప్రేక్షకుల ద్వారా సినిమా బాగుంది అనే టాక్ బయటకి వెళ్ళాక సినిమా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు కాబట్టి అప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి థియేటర్ లేదా ఓటీటీలో రిలీజ్ చేస్తామని శశి ప్రీతమ్ తెలిపారు.

అయితే ఈ సినిమాని 100 షోలు ఫ్రీగా వేసి ప్రేక్షకులకి చూపించడానికి హాల్ లేదా థియేటర్ లాంటి ఖర్చులు ఉంటాయి. అందుకని ఇందులో కార్పొరేట్ కంపెనీలని ప్రమోషన్స్ పరంగా భాగమయ్యేలా చేశారు. ఈ సినిమాని ప్రదర్శించే చోట పలు కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకునే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో సినిమాని ఫ్రీగా చూపించనున్నారు. దీంతో సినిమాని ప్రేక్షకులకి ఫ్రీగా చూపించవచ్చు, అలాగే కార్పొరేట్ కంపెనీలు డైరెక్ట్ గా ప్రేక్షకుల వద్దకే వెళ్లొచ్చు, సినిమాకి కూడా ప్రమోషన్ అవుతుంది.

sarkaru Vaari Paata : అమెరికాలో ఈ రికార్డ్ ఒక్క మహేష్ బాబుకే.. రీజనల్ సినిమాతో వరుసగా నాలుగో సారి..

ఇలాంటి ఓ కొత్త ఆలోచనతో వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్ ఈ సినిమాని ఇప్పటికే హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో, ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రేక్షకులకి ఫ్రీ షోలు వేశారు. ఈ షోలతో దాదాపు 1000 మంది వరకు సినిమా రీచ్ అయింది. ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, హారర్ అంశాలతో ఉన్న ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫ్రీ షోల వద్ద ప్రమోషన్ చేసుకోవడానికి ఆక్రో మెంటల్ హెల్త్ సర్వీసెస్,SPACE (SASHI PREETAM’S ACADEMY OF CINEMA & ENTERTAINMENT), యాస్పిరియాలిటీ, ఆనంద కిడ్స్, సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్, ఎం గార్డ్, GERAMATEN హాస్పిటల్స్, బ్లూ లైఫ్ వాటర్ ప్యూరీఫైర్స్, న్యాచురల్స్ సెలూన్, TELIO EV, పీపుల్ ఫర్ ఏనిమల్స్(PFA), LIONS CLUB 320-B, ఆరుణ్య నారాయణపేట, కళావేదిక లాంటి కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి.

Mahesh Babu : సర్కారు వారి పాట.. మ మ మాస్ సెలబ్రేషన్స్.. కర్నూలులో..

ఈ సినిమాని దాదాపు అందరూ కొత్తవారితోనే తెరకెక్కించారు. స్నేహాల్ కామత్, సంతోష్ అనంతరామన్, చిన్ని కృష్ణ మెయిన్ లీడ్స్ గా నటించగా, సీనియర్ నటులు లోహిత్ కుమార్, CVL నరసింహారావు, వైభవ్ సూర్య, వీజే రాకి లాంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాని ఐశ్వర్య కృష్ణ ప్రియ నిర్మించగా, దుశ్యంత్ రెడ్డి సహా నిర్మాతగా వ్యవహరించారు. కొత్త ఎడిటర్ అనిరుద్ ఈ సినిమాకి ఎడిటర్ గా చేసాడు. ఇప్పటికే హైదరాబద్ లో ఫ్రీ షోలు వేయగా త్వరలోనే ఏపీ, తెలంగాణలోని వివిధ నగరాల్లో ఈ సినిమాని ఫ్రీగా ప్రేక్షకులకి ప్రదర్శించనున్నారు. చిన్న సినిమాని ఇలా కొత్తగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలని, చిన్న సినిమాలని బతికించాలనేదే ఆయన లక్ష్యం అని శశి ప్రీతమ్ తెలిపారు.