వారి తల్లిదండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను.. మరణించిన అభిమానుల కుటుంబాలకు పవన్, ‘వకీల్ సాబ్’ టీమ్ ఆర్థికసాయం..

  • Published By: sekhar ,Published On : September 2, 2020 / 10:35 AM IST
వారి తల్లిదండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను.. మరణించిన అభిమానుల కుటుంబాలకు పవన్, ‘వకీల్ సాబ్’ టీమ్ ఆర్థికసాయం..

Pawan Kalyan Response about Fans Dies: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండ‌లం ఏడ‌వ‌మైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే క‌టౌట్ క‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఆ స‌మ‌యంలో విద్యుత్ వైర్లు త‌గ‌ల‌డంతో ఒక్క‌సారిగా నిప్పులు చెల‌రేగి 10 మందికి విద్యుత్‌ఘాతం త‌గిలింది. ఈ ప్రమాదంలో సోమ‌శేఖ‌ర్‌, అరుణాచ‌లం, రాజేంద్ర అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. విషయం తెలుసుకున్నపవన్ అభిమానుల మృతి ప‌ట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.



‘‘గుండెల నిండా నా పట్ల అభిమానం నింపుకొన్న కుప్పం నియోజకవర్గ జనసైనికులు శ్రీ సోమశేఖర్, శ్రీ రాజేంద్ర, శ్రీ అరుణాచలం విద్యుత్ షాక్‌తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శాంతిపురం దగ్గర కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ తగలడంతో వారు చనిపోయారనే వార్త నా మనసుని కలచివేసింది. ఇది మాటలకు అందని విషాదం. ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లిదండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మరో ముగ్గురు జన సైనికులు శ్రీ హరికృష్ణ, శ్రీ పవన్, శ్రీ సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నారు అనే సమాచారం ఉంది. వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులకు సూచించాను’’.. అని పవన్ పేర్కొన్నారు.Pawan Kalyan



విద్యుత్‌ఘాతంతో మృతి చెందిన అభిమానుల‌కు ఒక్కొక్క‌రికీ రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక‌సాయం అందించాల‌ని పార్టీ కార్యాల‌య సిబ్బందిని ఆదేశించిన‌ట్లు ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అలాగే ఈ ప్ర‌మాదంపై ప‌వ‌న్‌తో ‘వ‌కీల్‌సాబ్‌’ సినిమాను నిర్మిస్తున్న శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ సంస్థ విచారాన్ని వ్య‌క్తం చేసింది. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, మృతుల కుటుంబాల‌కు రెండేసి ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ‘వ‌కీల్‌సాబ్‌’ చిత్రాన్ని బోనీక‌పూర్‌, దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.