R Narayana Murthy : ‘రైతన్న’ సినిమాపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రశంసలు..

భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. ''రైతన్న సినిమా చాలా బాగుంది. దేశంలోని రైతులు, వ్యవసాయ రంగ సమస్యలు, వాస్తవ పరిస్థితులను ఈ సినిమా చూపించింది..........

R Narayana Murthy : ‘రైతన్న’ సినిమాపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రశంసలు..

Raithanna Movie

Raithanna Movie :  డైరెక్టర్ గా, నిర్మాతగా, యాక్టర్ గా ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నారు ఆర్ నారాయణ మూర్తి. ఇప్పటికే ఎన్నో ప్రజా సమస్యలపై సినిమాలు తీసి విజయవంతం అయ్యారు. తాజాగా రైతు సమస్యలపై ‘రైతన్న’ అనే సినిమాని చిత్రీకరించారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలనే ఇతివృత్తంగా ‘రైతన్న’ అనే సినిమా తెరకెక్కించానని, రైతుకు గిట్టుబాటు ధర కచ్చితంగా రావాలని, ఇందుకోసం రైతులు చేస్తోన్న పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఆర్ నారాయణమూర్తి తెలిపారు.

‘రైతన్న’ సినిమాని నిన్న మంగళవారం రాత్రి ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ లో స్పెషల్ షో వేశారు. ఈ సినిమా చూడటానికి ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు చాలా మంది విచ్చేశారు. వైసీపీ ఎంపీలు, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్, టీఆర్ఎస్ ఎంపీలు కేశవ రావు, నామా నాగేశ్వర రావు, రంజిత్‌, మరికొంతమంది ప్రముఖులు సినిమాని వీక్షించారు. సినిమా తర్వాత వీరు మీడియాతో మాట్లాడారు.

భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ మీడియాతో మాట్లాడుతూ.. ”రైతన్న సినిమా చాలా బాగుంది. దేశంలోని రైతులు, వ్యవసాయ రంగ సమస్యలు, వాస్తవ పరిస్థితులను ఈ సినిమా చూపించింది. రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను చూపిస్తూ రైతులు సంఘటితంగా పోరాడితే సమస్యల పరిష్కారం సాధ్యం అని రైతన్న సినిమా చూపించింది. రైతన్న సినిమాని తెరకెక్కించిన నారాయణ మూర్తికి అభినందనలు. రైతులకు మేలు చేకూరేవరకు రైతుల ఉద్యమం కొనసాగుతుంది” అని తెలిపారు.

Raithanna : ఆర్.నారాయణమూర్తి ‘రైతన్న’.. ఢిల్లీలో స్పెషల్ షో.. వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి స్పెషల్ ట్వీట్..

టిఆర్ఎస్ నేత, లోక్ సభ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. ”రైతుబిడ్డగా చెపుతున్నాను ‘రైతన్న’ సినిమాను బాగా తీశారు. రైతుల కష్టాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. కలసి కట్టుగా గట్టిగా పోరాడితే సమస్యలను పరిష్కరించుకోవచ్చని చూపించారు. సినిమా తీసిన నారాయణ మూర్తికి ప్రత్యేక అభినందనలు. దేశంలో రైతులు గిట్టుబాటు ధర సహా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైతుల సమస్యలు, ఇబ్బందులను పాటలతో సహా సినిమాలో బాగా చూపించారు” అని తెలిపారు.