ఆదాయం తగ్గింది : ఫోర్బ్స్ లిస్టులో స్థానం కోల్పోయిన ప్రియాంక,దీపికా

  • Published By: venkaiahnaidu ,Published On : August 25, 2019 / 09:24 AM IST
ఆదాయం తగ్గింది : ఫోర్బ్స్ లిస్టులో స్థానం కోల్పోయిన ప్రియాంక,దీపికా

బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఈసారి ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకోలేకపోయారు.గత సంవత్సరం ఫోర్బ్స్‌ మేగజైన్‌ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో టాప్‌-100లో స్థానం దక్కించుకున్న ప్రియాంక చోప్రా, ఈఏడాది తన స్థానాన్ని కోల్పోయింది. 2016సంవత్సరంలో అధిక ఆదాయం ఆర్జిస్తున్న నటీమణుల్లో టాప్‌10లో చోటు దక్కించుకున్న దీపికా పడుకోన్‌ గత సంవత్సరం నుంచి ఫోర్బ్స్‌లో స్థానం కోల్పోయింది. 

ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌… 2019 ఏడాదికి గానూ ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న నటీమణుల లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో హాలీవుడ్‌ నటి స్కార్లెట్‌ జొహన్సన్‌ 56 మిలియన్‌ డాలర్లతో టాప్‌ పొజిషన్‌ను ఆక్రమించింది. 2018 ఫోర్బ్స్‌ జాబితాలోనూ అత్యధికంగా ఆర్జిస్తున్న నటిగా ఆమే ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. ఆమె ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మార్వెల్‌ స్టూడియోస్‌ తో టై అప్‌ అయి చాలా సినిమాల్లో నటించింది. అవెంజర్స్‌ మూవీతో ఆమె భారీ లాభాలు ఆర్జించినట్లు హాలీవుడ్‌ టాక్‌. అవేంజర్స్‌ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఈ జాబితాలో సోఫియా వర్గరా దాదాపు రూ.315 కోట్లు (44.1 మిలియన్‌ డాలర్లు) ఆర్జించి రెండో స్థానంలో నిలిచారు. దాదాపు రూ.250 కోట్లతో (35 మిలియన్‌ డాలర్లు) రీస్ విథర్‌స్పూన్‌టో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. నికోల్‌ కిడ్మాన్‌, జెన్సీఫర్‌ అనిస్టన్‌ రూ.245 కోట్లు (34 మిలియన్‌ డాలర్లు), రూ.200 కోట్లు (28 మిలియన్‌ డాలర్లు) ఆర్జించి వరుసగా నాలుగు, ఐదు స్థానాలు సొంతం చేసుకున్నారు.  టాప్‌ టెన్‌లో మొత్తం హాలీవుడ్‌ హీరోయిన్లే ఉండడం గమనర్హం. ఫోర్బ్స్‌-2019 జాబితాలో ఒక్క బాలీవుడ్‌ నటి కూడా చోటు దక్కించుకోలేదు.

1 జూన్‌ 2018- 1 జూన్‌ 2019 మధ్య కాలంలో ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించిన నటుల జాబితాను ఇటీవల ప్రకటించారు. ఇందులో భారత్‌ నుంచి రూ.466 కోట్లతో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.