Vani Jairam : అయిదు దశాబ్దాల సంగీత ప్రయాణం.. ‘శంకరాభరణం’ వాణీ జయరాంకు పద్మభూషణ్..

మన తెలుగు సినిమాతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న తమిళ సీనియర్ గాయని వాణీ జయరాంకు పద్మభూషణ్ ప్రకటించారు. దీంతో ఆమెకు కూడా తెలుగు సినీ ప్రేమికులు, ప్రముఖులు, మ్యూజిక్ అభిమానులు................

Vani Jairam : అయిదు దశాబ్దాల సంగీత ప్రయాణం.. ‘శంకరాభరణం’ వాణీ జయరాంకు పద్మభూషణ్..

Senior singer Vani Jairam gets Padma Bhushan Award

Vani Jairam :  భారత ప్రభుత్వం తాజాగా పద్మ అవార్డుల్ని ప్రకటించింది. మన తెలుగు నుంచి సినీ రంగంలో MM కీరవాణికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన తెలుగు సినిమాతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న తమిళ సీనియర్ గాయని వాణీ జయరాంకు పద్మభూషణ్ ప్రకటించారు. దీంతో ఆమెకు కూడా తెలుగు సినీ ప్రేమికులు, ప్రముఖులు, మ్యూజిక్ అభిమానులు అభినందనలు తెలియచేస్తున్నారు.

1945 నవంబరు 30న తమిళనాడు వేలూరులో ఓ సంగీత కుటుంబంలో జన్మించిన వాణీ జయరాం చిన్నప్పటి నుండే సంగీతం నేర్చుకున్నారు. అయితే ఆమె కుటుంబం కేవలం శాస్త్రీయ సంగీతం మాత్రమే పాడేది. సినిమా పాటలు వద్దనేవారు. పలువురు గురువుల వద్ద సంగీతం నేర్చుకున్న వాణీ జయరాం పదేళ్ల వయసులో ఆల్‌ ఇండియా రేడియోలో మొదటిసారి పాటలు పాడే అవకాశం వచ్చింది. అప్పట్నుంచి రేడియోలో, స్కూల్లో, సంగీత ప్రదర్శనలలో పాటలు పాడింది కానీ ఎప్పుడూ సినిమా పాటలు పాడలేదు. అయినా వాణీ జయరాంకి సినిమా పాటల మీద ఆసక్తి ఏర్పడి రేడియోలో వింటూ నేర్చుకునేది.

ఎలాగైనా సినిమాల్లో పాటలు పాడాలని అనుకున్నారు వాణీ జయరాం. అంతలోనే ఆమెకి పెళ్లి జరిగింది. కానీ ఆమె భర్త జయరాం ప్రోత్సాహం ఇవ్వడంతో కర్ణాటిక్‌, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకొని కచేరీలు ఇస్తూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఓ సారి ముంబైలో తన మొదటి కచేరి ఇచ్చినప్పుడు సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్‌ ఆమె గొంతు బాగుందని చెప్పి 1970లో బాలీవుడ్ ‘గుడ్డీ’ సినిమాలో పాట పాడే అవకాశం ఇప్పించారు. ఆ సినిమాలో తను పాడిన మొదటి పాట ‘బోలే రే’ అప్పట్లో సూపర్‌ హిట్టయి అవార్డులు కూడా రావడంతో మొదటి పాటతోనే వాణీ జయరాం దశ తిరిగింది.

ఇక అక్కడ్నుంచి తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ..లాంటి దాదాపు 14 భాషల్లో సినిమాల ఆఫర్స్ రావడంతో వరుసగా పాటలు పాడారు వాణీ జయరాం. తమిళ్ లో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్‌’ సినిమా పాటలు ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చాయి. తెలుగులో శంకరాభరణం సినిమాతో ఆమె పేరు మారుమ్రోగిపోయింది. ఈ పాటలతో జాతీయ అవార్డుని కూడా అందుకున్నారు. దీంతో తెలుగులో మరోచరిత్ర, వయసు పిలిచింది, మంగమ్మ గారి మనవడు, స్వాతికిరణం, శృతి లయలు, స్వర్ణకమలం, సీతాకోక చిలుక..లాంటిఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడి ప్రేక్షకులని మెప్పించారు.

MM Keeravani : కూటి కోసం వ్యవసాయం చేసిన దగ్గర్నుంచి.. పద్మశ్రీ, గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ నామినేషన్ వరకూ.. కీరవాణి సంగీత ప్రయాణం..

14 భాషల్లో దాదాపు 8వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం నంది అవార్డులు, వివిధ స్టేట్ అవార్డులు, నేషనల్, ఫిలింఫేర్, సైమా, వివిధ దేశాల అవార్డుల్ని అందుకున్నారు. తాజాగా ఆమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేసింది. తెలుగు, తమిళ్ తో పాటు వివిధ భాషల్లోని సినీ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఆమెను సినీ పాటలవైపు ప్రోత్సహించిన ఆమె భర్త జయరాం 2018 లో కన్నుమూశారు.