విలన్ ఎవరు ? విచారణకు సాయి, శ్రావణి కుటుంబసభ్యులు. ఏం తేలుస్తారో..!

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 10:48 AM IST
విలన్ ఎవరు ? విచారణకు సాయి, శ్రావణి కుటుంబసభ్యులు. ఏం తేలుస్తారో..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీవీ నటి శ్రావణి సూసైడ్‌ కేసులో పోలీసులు కీలక విచారణ చేపట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి బయల్దేరిన సాయి, శ్రావణి కుటుంబసభ్యులను ఎస్సార్‌నగర్ పోలీసులు విచారించనున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ను ఇప్పటికే పోలీసులు విచారించి కీలక ఆధారాలు సేకరించారు. అయితే ఇప్పటివరకు అమాయకుడినని చెప్పుకున్న సాయి చుట్టూనే కేసు తిరుగుతుండడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. సాయి, శ్రావణి కుటుంబసభ్యుల నుంచి కీలక ఆధారాలు రాబట్టేందుకు సిద్ధమయ్యారు.



పూటకో ట్విస్ట్.. గంటకో ఆడియో
పూటకో ట్విస్ట్.. గంటకో ఆడియో, రోజుకో వీడియో లీక్స్‌తో మిస్టరీని తలపిస్తుంది నటి శ్రావణి సూసైడ్ కేసు. ఇంతకు శ్రావణి చావుకు కారకులెవరు..? దేవరాజా? లేక సాయి కృష్ణా? అసలు RX 100 నిర్మాత పేరెందుకు వచ్చింది..? ఇలాంటి ప్రశ్నలతో శ్రావణి సూసైడ్‌ కేసు క్రైమ్‌ సీరియల్‌ను తలపిస్తోంది. తొలుత దేవరాజ్‌ను నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతన్ని విచారించారు. దేవరాజ్‌ అందించిన ఆధారాలతో ఇప్పుడు.. కేసు మొత్తం సాయి మెడకు చుట్టుకుంటోంది.

సాయి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య
శ్రావణి కేసులో సాయికృష్ణారెడ్డి పాత్రపై పోలీసులు మరింతగా దృష్టి సారిస్తున్నారు. సాయి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. శ్రావణి సూసైడ్‌ మిస్టరీలో సాయి పాత్ర ఎంత ఉందన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆడియో క్లిప్పింగులు, సీసీ పుటేజీల ఆధారంగా శ్రావణిపై సాయి వేధింపులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. విచారణలో సాయి చెప్పే అంశాలు కీలకంగా మారనున్నాయి.



సాయి ఏం చెప్పబోతున్నాడు..?
పోలీస్‌ విచారణకు తన దగ్గరున్న పూర్తి ఆధారాలతో వస్తానని సాయి ఇంతకు ముందే చెప్పాడు. దీంతో సాయి దగ్గరున్న ఆధారాలేంటి..? విచారణలో సాయి ఏం చెప్పబోతున్నాడు..? సాయిని ఏ ప్రశ్నలపై పోలీసులు విచారిస్తారు.. దేవరాజ్‌, సాయిని కలిపి విచారిస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది.

సాయి పాత్ర కీలకం
శ్రావణితో ఐదేళ్ల క్రితం నుంచే సాయికి పరిచయం ఉంది. ఈ పరిచయమే ప్రేమగా మారింది. అయితే కొత్తగా పరిచయం అయిన వ్యక్తులతో శ్రావణి చాలా క్లోజ్‌గా ఉండటం సాయికి నచ్చలేదు. ఇదే విషయంలో శ్రావణి, సాయికి మధ్య వాగ్వాదం జరిగింది. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీనే శ్రావణి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న ఆధారాలు శ్రావణి కేసులో.. సాయి పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయిని విచారించి.. కేసులో అసలు నిందితున్ని గుర్తించనున్నారు పోలీసులు.



శ్రావణి, సాయి మధ్య వాగ్వాదం
ఆత్మహత్యకు ముందురోజు శ్రావణి, సాయి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డుపై శ్రావణిని సాయి బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. శ్రావణిని ఆటోలో ఎక్కించి తీసుకెళ్లేందుకు సాయి ప్రయత్నించాడు. సాయి బెదిరింపులతో ఆటో ఎక్కేందుకు శ్రావణి భయపడింది. ఆటో ఎక్కేవరకు శ్రావణిని సాయి భయాందోళనకు గురిచేశాడు. రోడ్డు మీదనే గొడవ చేయడంతో చివరికి శ్రావణి ఆటో ఎక్కింది. సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా సాయిని పోలీసులు ప్రశ్నించనున్నారు.

చావుకు సాయి కారణం
తన చావుకు సాయి కారణమని.. తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారనే విషయాన్ని శ్రావణి దేవరాజ్‌కి చెప్పిన ఆడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇక పోలీసుల విచారణలో దేవరాజ్‌ కీలక విషయాలను వెల్లడించారు. గతంలోనూ తనను రక్తం వచ్చేలా సాయి కొట్టాడని సాక్ష్యాలను బయటపెట్టాడు.



సాయి, దేవరాజ్‌కు మధ్య గొడవ
అమ్మాయిలను సాయి ట్రాప్‌ చేస్తాడని.. శ్రావణిని సైతం అలానే ట్రాప్ చేశాడని దేవరాజ్‌ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కేసులో సాయి, దేవరాజ్‌ సంభాషణ ఆడియో క్లిప్‌ కీలకంగా మారింది. శ్రావణి ఆత్మహత్యకు ముందు సాయి, దేవరాజ్‌కు మధ్య గొడవ జరిగింది. శ్రావణి కోసమే వీరిద్దరూ గొడవపడ్డారు. నీ వల్లే సమస్యలు అంటూ ఫోన్‌లో సాయితో దేవరాజ్‌ వాగ్వాదానికి దిగాడు. ప్రశాంతంగా ఉన్న అమ్మాయిని రోడ్డెక్కెలా చేశామని దేవరాజ్‌ ఆరోపించాడు.

ఎవరు విలన్ ? 
శ్రావణికి నేను కావాలి.. ఇది ఫైనల్‌ అంటూ ఫోన్‌లో సాయికి దేవరాజ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఐదేళ్లుగా ప్రేమిస్తుంటే మధ్యలో నువ్వు వచ్చావని సాయి అన్నాడు. శ్రావణిని ఫోన్‌లైన్‌లో ఉంచి ఎవరిని లవ్‌ చేస్తున్నావో చెప్పాలని దేవరాజ్‌ నిలదీశాడు. దేవరాజ్‌నే ప్రేమిస్తున్నానని శ్రావణి చెప్పింది. మధ్యలో ఉండి డ్రామాలు చేయొద్దంటూ సాయికి దేవరాజ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. మరి ఎవరు విలన్ రానున్న రోజుల్లో తేలనుంది.