ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌.. మగాళ్లను ప్రశ్నించే కథ.. రివ్యూ!

ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌.. మగాళ్లను ప్రశ్నించే కథ.. రివ్యూ!

వాస్తవాలు, సహజ దృశ్యాలు.. రోజువారీ కార్యకలాపాలు తెర మీదకు వస్తే చాలా అందంగా.. ఆకట్టుకునేలా కనిపిస్తాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.. మనలాగే, మన చుట్టూ ఉండే పాత్రల్లాగే.. ఆకట్టుకునేలా.. ఆసక్తి పెంచేలా సినిమా రూపొందిస్తే అది కచ్చితంగా విజయం సాధిస్తుంది. భారతీయ సమాజంలో అనేక విశ్వాసాలపై నేచురల్‌గా అనేక సినిమాలు మన వెండితెరపైకి వచ్చాయి. అందులో కొన్ని హిట్ అయితే.. మరికొన్ని విమర్శల పాలయ్యాయి.

అటువంటి ఆలోచనలు, చర్చలతో వెండితెరకు ఎక్కిన సినిమానే ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్’. ఈ సినిమానే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణం అవుతోంది. సమాజంలో ప్రతీ విషయంలో మార్పు కోరేవారు ఎందరో.. మార్పును అంగీకరించనివారు కూడా అందరే ఉంటారు కూడా.. ఈ సినిమా అందుకే చర్చనీయాంశం అవుతోంది. దశాబ్ధాల నుంచి పెళ్లి బంధంతో వంటింట్లో, పడకింట్లో మగ్గిపోయి స్వేచ్ఛను కోల్పోయిన మహిళ కథనంతో రూపొందింది ఈ సినిమా.

హేతుబద్ధంగా ఫక్తు సంప్రదాయాలను ప్రశ్నించలేకపోయినా.. అవి పెట్టే బాధలను వర్ణిస్తూ.. ప్రశ్నిస్తూ తెరకెక్కించింది చిత్రయూనిట్. ఫొటోగ్రఫీ, ఆర్ట్‌ డైరెక్షన్‌, సున్నితమైన సంభాషణల విషయాల్లో అధ్భుతంగా అనిపిస్తోంది. పురుషాధిక్యత స్త్రీ స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తోందనే సిద్ధాంతాన్ని నిరూపించేందుకు దర్శకుడు ఎంచుకున్న సబ్జెక్ట్ పాతదే అయినా కొత్తగా చూపించారు. జీవితంలో ఒక్కసారీ పురుషాధిక్యత ప్రదర్శించని మగవాళ్లకు కోపం తెప్పించేలా, అణిచివేతకు గురయ్యే మహిళలకు బాసట కలిగించేలా.. సంప్రదాయ విధానాల్లో పెరిగే వాళ్లకు చిరాకు పుట్టించేలా ఉంటుంది.

హీరోయిన్‌ యాక్టింగ్‌ చాలా బాగుంది. సహజంగా.. మన ఇంట్లో మనిషిని చూసినట్లుగా.. యాక్టింగ్ బాగా చేశారు. తరతరాలుగా పెద్దల రూపంలో ఉండే కనిపించని నియంతృత్వం, నెలసరి, సెక్స్‌, ఫోర్‌ప్లే, ఉమ్మడి కుటుంబం బాధ్యతలు ఎలా బానిసగా మారుస్తాయి, చుట్టాలు ఎలా చిన్నచూపుచూస్తారు వంటి అంశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. అయితే, ఉమ్మడి కుటుంబంలో అందరి చాకిరీ ఇంట్లో ఉండే భార్య ఒక్కర్తే చేయటం. పురుషులు పూర్తి బాధ్యతారాహిత్యంగా ఉండటం. దీనివల్ల కష్టాలన్నీ వాళ్లే పడుతున్నట్లుగా చూపించాడు. ఈ సినిమా గురించి ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో? అన్నే విమర్శలు కూడా వస్తున్నాయి.

జనవరి 15న ‘నీస్ట్రీమ్‌’ అనే ఓటిటి ప్లాట్‌ఫామ్‌ ద్వారా విడుదలైన ఈ మలయాళ సినిమాకి జో బేబీ దర్శకుడు. నిమిష సజయన్, సూరజ్‌ వంజర మూడు నటించారు. సినిమా అంతా ఒకే ఇంట్లో జరుగుతుంది. ఇన్‌డోర్‌లో ఎక్కువగా సీన్‌లు కనిపిస్తూ ఉంటాయి. క్లయిమాక్స్‌లో మాత్రమే ఒక్కసారి ఔట్‌డోర్‌ కనిపిస్తుంది. దర్శకుడు ఈ సినిమాలో స్త్రీలు వంట చేయడానికి పడే శ్రమను వారి అప్రమత్తతను శక్తిమంతంగా చూపిస్తాడు. వంట బాలేదని ఈసడించుకునే మగాళ్లను ఆలోచింపజేసేలా కొన్ని సన్నివేశాలు.. తిన్నాక కంచం తీసి కడగని మగాళ్లను ఎగతాళి చేసినట్లుగా.. కొన్ని కాంట్రవర్శియల్ పాయింట్లు ఉన్నప్పటికీ చర్చ జరుగాల్సిన కథనమే ఇది.