అన్ లాక్ 5.0 : సినిమా థియేటర్లు ఓపెన్..తెలుగు రాష్ట్రాల్లో బొమ్మ పడదు

  • Published By: madhu ,Published On : October 15, 2020 / 07:09 AM IST
అన్ లాక్ 5.0 : సినిమా థియేటర్లు ఓపెన్..తెలుగు రాష్ట్రాల్లో బొమ్మ పడదు

Unlock 5.0: మూతపడ్డ సినిమా థియేటర్లు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. లాక్‌డౌన్‌తో దాదాపు 8 నెలలుగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు అన్నీ మూతపడ్డాయి. అయితే దశలవారీగా అన్‌లాక్‌ మార్గదర్శకాలను విడుదల చేస్తోన్న కేంద్రం ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0లో భాగంగా నేటి నుంచి థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.



కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లకు అనుమతిచ్చిన కేంద్రం.. 50 శాతం సీట్ల సామర్థ్యానికే పర్మిషన్ ఇచ్చింది. అలాగే ప్రేక్షకుల సీట్ల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. థియేటర్, మల్టీప్లెక్స్‌ ఆవరణలో సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఇప్పటికే యూపీ ప్రభుత్వం సినిమా హాళ్ల నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. థియేటర్ వెయిటింగ్ రూంలో ప్రతీ వ్యక్తి ఆరు అడుగుల దూరం పాటించాలని తెలిపింది. ప్రేక్షకులు థియేటర్లలోకి ప్రవేశించగానే ముందుగా థర్మల్ స్క్రీన్ చేయాలని, అలాగే 50 శాతం సీట్ల సామర్థ్యం వరకే అనుమతించాలనే నిబంధనలు పెట్టింది.



కొన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఓపెన్ అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ సందడి కనిపించడం లేదు. ఇప్పటికే ఏపీలో సినిమా థియేటర్లు తెరవకూడదని థియేటర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనలతో సీటింగ్ కెపాసిటీ తగ్గించి.. థియేటర్స్ రన్ చేయడం చాలా కష్టమని అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయాలంటే ఒక్కో థియేటర్‌కి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో థియేటర్లు తెరవడం లేదని చెబుతున్నారు.