అనారోగ్యానికి గురైన తల్లిని చూసేందుకు బైక్ పై 2,346 కి.మీ ప్రయాణం.. మధ్యలో ఆపేసిన పోలీసులు

అనారోగ్యానికి గురైన తల్లిని చూసేందుకు ఓ కుమారుడు బైక్ పై 2,346 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. తల్లి కోసం మండుటెండలో గుజరాత్ నుంచి తమిళనాడు వరకు ప్రయాణించినప్పటికీ అతనికి నిరాశే ఎదురైంద

అనారోగ్యానికి గురైన తల్లిని చూసేందుకు బైక్ పై 2,346 కి.మీ ప్రయాణం.. మధ్యలో ఆపేసిన పోలీసులు

అనారోగ్యానికి గురైన తల్లిని చూసేందుకు ఓ కుమారుడు బైక్ పై 2,346 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. తల్లి కోసం మండుటెండలో గుజరాత్ నుంచి తమిళనాడు వరకు ప్రయాణించినప్పటికీ అతనికి నిరాశే ఎదురైంది. తల్లి దగ్గరకు వెళ్లేందుకు తమిళనాడు పోలీసులు అతనికి అనుమతి ఇవ్వలేదు. పోలీసుల కథనం ప్రకారం తమిళనాడులోని శిర్కాజీకి చెందిన చంద్రమోహన్(43) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సివిల్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆఫీస్ లు బంద్ కావడంతో పనులు నిలిచిపోయాయి. చంద్రమోహన్ అక్కడ ఒంటరిగా ఉంటున్నాడు.

ఉదయం, రాత్రి ఎన్జీవోలు ఇచ్చే ఆహారంతో సరిపెట్టుకుంటున్నారు. అయితే చంద్రమోహన్ తల్లి, భార్యాపిల్లలు తమిళనాడులో నివాసముంటున్నారు. గ్లకోమా కారణంగా తల్లి కంటి చూపు కోల్పోయింది. ఇటీవలే ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లిని చూడాలని చంద్రమోహన్ బైక్ పై అహ్మదాబాద్ నుంచి తమిళనాడుకు బయల్దేరాడు. బైక్ పై సొంతూరుకు వెళ్లేందుకు అహ్మదాబాద్ అధికారుల నుంచి అనుమతి పత్రం కూడా తీసుకున్నాడు.

ఏప్రిల్ 22న చంద్రమోహన్ బైక్ పై బయల్దేరాడు. అతని ప్రయాణం మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా సాగింది. ప్రతి గంటకు ఐదు నిమిషాల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభించారు. రోజుకు 15 గంటలు బైక్ ను నడిపారు. 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ హెల్మెట్, సన్ గ్లాసెస్, షూ ధరించడంతో అతనికి పెద్దగా ఇబ్బంది కల్గలేదు. రాత్రి వేళల్లో పెట్రోల్ బంకుల్లో విశ్రాంతి తీసుకున్నారు. ఇక అహ్మదాబాద్ లో బయలు దేరే ముందు బ్యాగ్ నిండా బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ సమకూర్చుకున్నాడు.

ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 8.30 గంటలకు వాట్రాప్ లోని తన భార్య ఇంటికి చేరుకున్నారు. భార్య, ఇద్దరు పిల్లలను చూసి సంతోషపడ్డారు. తండ్రిని చూసి పిల్లలు కూడా ఆనందపడ్డారు. భార్యాపిల్లలను తీసుకొని తల్లి నివాసముంటున్న శిర్కాజీకి వెళ్లేందుకు బయల్దేరారు. అయితే చంద్రమోహన్..  గుజరాత్ నుంచి వచ్చారని తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ఆయనను అడ్డుకున్నారు. శిర్కాజీకి వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత శిర్కాజీకి వెళ్లాలని సూచించారు. దీంతో చంద్రమోహన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తల్లిని చూడాలన్న ఆశ ఆవిరైంది.