Congress Collapses In Goa: గోవాలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు
గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గోవా ముఖ్యమంత్రి సమక్షంలో బీజేపీలో చేరారు.

Congress Collapses In Goa: గోవాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీకి గోవా అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 8 మంది బీజేపీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ బలం అక్కడ 3కు చేరింది. గోవా అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 40.
BiggBoss 6 : ఇదేం టాస్క్ రా బాబు.. పిల్లల బొమ్మల్నిచ్చి పిల్లల్ని పెంచమన్న బిగ్‌బాస్
అధికారం చేపట్టేందుకు 21 సీట్లు అవసరం కాగా, బీజేపీ 20 సీట్లు, కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకున్నాయి. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మిగతా సీట్లు గెలుచుకున్నారు. అధికారం చేపట్టిన బీజేపీకి మెజారిటీ ఉన్నప్పటీకి, ఆ పార్టీ కాంగ్రెస్ నేతలను తమ పక్షంలో చేర్చుకుంది. గతంలో 2019 జూలైలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. తాజాగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరారు. అధికార పార్టీలో చేరిన వాళ్లలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేతగా ఉన్న మైకేలో లోబోతోపాటు డెలిలా లోబో, రాజేష్ ఫల్‌దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకార్, అలిక్సో సీక్వేరియా, రుడాల్ఫ్ ఫెర్నాండేజ్ ఉన్నారు.
వీళ్లంతా బీజేపీలో చేరబోతున్నట్లు గతంలోనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో దిగంబర్ కామత్, మైకేల్ లోబోను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ కోరింది. కాగా, మోదీ ఆధ్వర్యంలోని బీజేపీని బలోపేతం చేసేందుకే తాము ఆ పార్టీలో చేరినట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ అంశంపై ఆప్ స్పందించింది. పంజాబ్, ఢిల్లీల్లో చేపట్టిన ‘ఆపరేషన్ కమలం’ ఫెయిలైందని, గోవాలో మాత్రం సక్సెస్ అయిందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.