Paddy Purchases : ఏపీలో ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్ళు

వాస్తవానికి ధాన్యం కొనుగోళ్ళలో ప్రతి ఏటా ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు అధికారులు ఈ సారి కొత్త ప్రణాళికలను అమలు చేస్తున్నారు.

Paddy Purchases : ఏపీలో ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్ళు

Paddy

Paddy Purchases : ఏపిలో ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల సంస్థ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 774 రైతు భరోసా కేంద్రాల ద్వారా 97,173 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్నిసేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 664 మండలాల నుండి ధాన్యం సేకరణ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 123 మండలాల్లో సేకరణను ప్రారంభమైంది. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లోనూ ధాన్యం సేకరణ మొదలైంది. నెల్లూరులో 262, పశ్చిమ గోదావరిలో 290, తూర్పుగోదావరిలో 161, కృష్ణాజిల్లాలో 59, శ్రీకాకుళం, కడపలో ఒక్కొక్కటి చొప్పున ఆర్‌బికెలు ధాన్యాన్ని సేకరించాయి. నెల్లూరులో అత్యధికంగా 52,734, పశ్చిమగోదావరిలో 31,817మెట్రిక్‌ టన్నులు, తూర్పుగోదావరిలో 8,978 మెట్రిక్‌ టన్నులు, కృష్ణాజిల్లాలో 3,642 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ సేకరించింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంజిల్లాల్లో మార్క్‌ఫెడ్‌ ధాన్యం సేకరిస్తోంది. గురువారం ఒక్కరోజే 7,183 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. ఇప్పటి వరకు 8,173 మంది రైతుల నుండి ఆర్‌బికెలు ధాన్యాన్ని సేకరిం చాయి. వీరిలో 1,977 మందికి చెల్లింపులు పూర్తయ్యాయి. మరో 6,300 మందికి చెల్లింపులు చేయాల్సి ఉంది. 21రోజులు గడువు పూర్తయిన రైతులకు ఇప్పటి వరకు చెల్లింపులు పూర్తయ్యాయి. ఆధార్‌ ఆధారిత చెల్లింపులను పౌరసరఫరాల సంస్థ ఈ సంవత్సరం చేపట్టడంతో, ఎటువంటి ఆటంకం లేకుండా చెల్లింపులు సజావుగా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.

వాస్తవానికి ధాన్యం కొనుగోళ్ళలో ప్రతి ఏటా ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు అధికారులు ఈ సారి కొత్త ప్రణాళికలను అమలు చేస్తున్నారు. మిల్లర్ల నుండి ధాన్యం కొనుగోలు బాధ్యతలను తప్పించి రైతు భరోసా కేంద్రాలకు అప్పగించారు. ధాన్యం సేకరణ మొదలు, బిల్లుల చెల్లింపు వరకు అంతా సాంకేతిక వినియోగ పద్దతిలో చెపట్టారు. రైతులకు సకాలంలో చెల్లింపులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తి ప్రణాళికతో ఉంది. రైతులు తక్కువ రేటుకు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దని, ఆర్‌బికెల వద్ద మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలని పౌరసరఫరాల సంస్ధ ఉన్నతాధికారులు కోరుతున్నారు.

ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం విలువ రూ.189.62 కోట్లుగా ఉంది. మొత్తం దిగుబడుల్లో 75శాతం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. మిగిలిన 25 శాతం స్ధానిక అవసరాలకు , వినియోగానికి ఉపయోగిస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాల్లో ఉన్నారు. వర్షాల దృష్ట్యా ధాన్యంలోని తేమ శాతంపై మినహాయింపులకు సంబంధించి పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతు న్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారుల నుండి అధికారికంగా ప్రక టన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.