Hindenburg Report-ADANI Group: అదానీకి ఐదు సవాళ్లు.. అందరి ఆశలు జనవరి 30పైనే..

Hindenburg Report-ADANI Group: అదానీకి ఐదు సవాళ్లు.. అందరి ఆశలు జనవరి 30పైనే..

Hindenburg Report-ADANI Group

Hindenburg Report-ADANI Group: హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ స్రామ్యాజ్యంలో ప్రకంపనలు మొదలయ్యాయి. వరుసగా రెండు రోజులు.. 4 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. శని, ఆదివారాలు స్టాక్‌మార్కెట్లకు సెలవు కావడంతో.. అదానీ గ్రూప్ షేర్ల పతనానికి కాస్త గ్యాప్‌ వచ్చింది. మ్యాటర్‌ సెట్ చేసుకోవడానికి అదానికి కాస్త టైమ్‌ దొరికింది. అందుకే.. ఇప్పుడు అందరి దృష్టి సోమవారంపైనే ఉంది. ఈ గ్యాప్‌లో అదానీ ముందు ప్రధానంగా ఐదు సవాళ్లు ఉన్నాయి.. అందులో మొదటిది.. అదానీ గ్రూప్‌ షేర్ల ధరలు మరింత పతనం అయ్యే ప్రమాదం.. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ అవాస్తవం అని చెప్పడం తప్ప అదానీ గ్రూప్‌.. తమ కంపెనీల ఆర్థికసామర్థ్యం గురించి ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచగలిగే ప్రకటన ఏదీ ఇంతవరకూ చేయలేదు.. వరుసగా రెండు సెషన్లలో అదానీ గ్రూప్ షేర్లు నష్టపోవడం చూస్తుంటే.. సోమవారం  (జనవరి 30,2023)కూడా అలాంటి పరిస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉంది. అలా జరగకూడదంటే మదుపర్లలో అదానీ గ్రూప్‌ నమ్మకాన్ని పెంచగలగాలి. కానీ.. ఇంత తక్కువ సమయంలో అది సాధ్యమా అన్నదే ఇప్పుడు సందేహం..

ADANI ..Hindenburg Report : అదానీ గ్రూప్ కంపెనీల పునాదుల్ని షేక్ చేసిన ‘ఒక్క రిపోర్ట్’‌.. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్ చెప్పిందేంటి..?

ఇక రెండో సవాల్‌.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ FPO సబ్‌స్క్రిప్షన్‌. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌కు ముందు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓ మార్కెట్లోకి వచ్చింది. ఎఫ్‌పీవో యాంకర్‌ ఇష్యూలో ఒక్కో షేర్‌ను 3,276 రూపాయలకు కేటాయించారు. దీనికి యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. దాదాపు ఒకటిన్నర రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేశారు యాంకర్‌ ఇన్వెస్టర్లు. అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ సహా 33 సంస్థాగత పెట్టుబడుల నుంచి నిధుల సేకరణకు ఉద్దేశించిన ఎఫ్‌పిఓ.. రూ. 5, 984.9 కోట్లను సమీకరించింది. కానీ, మరుసటి రోజుకే మ్యాటర్ మారిపోయింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్ బయటకు రావడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ విలువ3276 నుంచి 2,700 రూపాయలకు పడిపోయింది. దీంతో.. సాధారణ ఇన్వెస్టర్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ FPO వైపే చూడలేదు. భారీ స్పందన వస్తుందని అదానీ గ్రూప్‌ అంచనాలు పెట్టుకుంటే.. తొలి రోజు కేవలం ఒక్కటంటే ఒక్కశాతమే సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఇప్పుడు అదానీ గ్రూప్‌ తీసుకునే చర్యలను బట్టే.. ఈ FPO సక్సెస్ అవుతుందా లేదా అన్నది తేలిపోనుంది. ఒకవేళ FPOకు సరైన స్పందన రాకపోతే మాత్రం.. అదానీ గ్రూప్‌ ఇమేజ్ మరింత డ్యామేజ్ కావడం ఖాయం.

Hindenburg Report On ADANI Group: 6 గంటల్లో 1.60 లక్షల కోట్లు కోల్పోయిన గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్‌ ముందున్న మూడో సవాల్‌ .. ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ లాంటి సంస్థలు, అప్పులిచ్చిన బ్యాంకుల షేర్లు మరింత పడిపోయే ప్రమాదం ఉంది.అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడులు రెండు రోజుల్లోనే రూ.18,000 కోట్లకుపైగా తరిగి పోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎల్ఐసీ పరిస్థితేంటీ? అంతేకాదు  అదానీ గ్రూప్‌లోని అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఏపీ సెజ్‌ లిమిటెడ్‌, అదానీ పవర్‌, అదానీ విల్మర్‌ సంస్థలకు విచ్చలవిడిగా లోన్లు ఇచ్చాయి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ బయటకు రావడంతో.. ఈ బ్యాంకుల షేర్లు మూడు నుంచి ఏడు శాతం వరకూ నష్టపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బ్యాంకుల షేర్లపై ఒత్తిడి తప్పదని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి పెరిగితే బ్యాంకుల షేర్లు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అటు ఎల్‌ఐసీ కూడా శుక్రవారం ఒక్కరోజే 3.5 శాతం నష్టపోయింది. ఈ నష్టాలు కొనసాగితే.. అదానీ గ్రూప్‌కు రుణాలు ఇవ్వడానికి ఏ బ్యాంకులు ముందుకు రాకపోవచ్చు.. పెట్టుబడులు పెట్టడానికి ఏ సంస్థా సాహసం చేయకపోవచ్చు.. దీనివల్ల అదానీ గ్రూప్‌కు ఆర్థిక కష్టాలు వచ్చి పడే ప్రమాదం ఉంది.

Hindenburg Report On ADANI Group : షేర్ మార్కెట్‌ని షేక్ చేసిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్..చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో అదానీ గ్రూప్

అదానీ గ్రూపు ముందున్న నాలుగో సవాల్‌… స్టాక్‌మార్కెట్ల పతనం. ఈ మధ్య కొంతకాలంగా ఆశాజనకంగా ఉన్న భారత స్టాక్‌మార్కెట్లు.. వరుసగా రెండు రోజులు భారీ నష్టాలను మూటగట్టుకోవడానికి కారణం అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్టే. రెండు రోజుల్లోనే ఏకంగా 11 లక్షల కోట్ల రూపాయల సంపదను మదుపర్లు కోల్పోయారు. సోమవారం కూడా అదానీ గ్రూప్‌ షేర్లు నష్టపోతే దాని ప్రభావం మార్కెట్‌పైనా కచ్చితంగా పడుతుంది. ఇన్వెస్టర్లు మరిన్ని నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. దీనికంతటికీ కారణం అదానీనే అన్న మచ్చను ఆ గ్రూప్‌పై పడే ప్రమాదమూ ఉంది.

అదానీ గ్రూప్‌ ముందున్న ఐదో సవాల్‌.. సెబీ, కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని ఎదుర్కోవాల్సి రావడం. ఇప్పటికే అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్ రావడం, ఆ గ్రూప్‌ షేర్లు భారీగా పతనం కావడంతో.. ఆ గ్రూప్‌ ఆర్థిక పరిస్థితులపై సెబీ దృష్టి సారించింది. ఏడాది కాలంగా అదానీ గ్రూప్‌ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడుల వివరాలను కోరినట్లు తెలుస్తోంది. ఈ గ్రూప్‌ షేర్లు మరింత పతనం అయితే.. సెబీ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అదానీ గ్రూప్ ఆర్థిక లావాదేవీలతో పాటు.. అసలేం జరిగిందన్న దానిపై విచారణ చేసే అవకాశం కూడా ఉంది. ఆ పరిస్థితి వస్తే.. కేంద్ర ప్రభుత్వం కూడా.. దీన్ని సీరియస్‌ విషయంగా పరిగణించాల్సి రావచ్చు.. అపర కుబేరుడిగా ఇంతకాలం వెలిగిన అదానీ.. ఈ ఐదు సవాళ్లను ఎలా ఎదుర్కొంటారన్న దానిపైనే .. ఆ గ్రూప్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.