అక్టోబర్ 31వ తేదీ వరకు స్కూళ్లు బంద్

  • Published By: vamsi ,Published On : October 4, 2020 / 06:38 PM IST
అక్టోబర్ 31వ తేదీ వరకు స్కూళ్లు బంద్

రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, అక్టోబర్ 31 వరకు అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఢిల్లీ డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఈ విషయంపై ట్వీట్ చేసి సమాచారం ఇచ్చారు. కరోనా కష్ట సమయంలో పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి రిస్క్ తీసుకోవడం మంచిది కాదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

కరోనా కారణంగా ఢిల్లీలోని అన్ని పాఠశాలలు అక్టోబర్ 31 వరకు మూసివేయబడతాయని తెలిపిన మనీష్ సిసోడియా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా తీవ్రత పెరిగిపోతూ ఉండగా.. తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకున్నారని ఆయన చెప్పారు. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం కలిగే నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదని భావించినట్లు ఆయన చెప్పారు.



తొమ్మిదవ తరగతి నుండి 12 వ తరగతి విద్యార్థులను సెప్టెంబర్ 21 నుండి స్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాలలకు హాజరు కావడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ, డిల్లీ ప్రభుత్వం పాఠశాల మూసివేత వ్యవధిని అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.



కరోనా కారణంగా, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు మరియు పాఠశాలలు మార్చి 16వ తేదీ నుంచి మూసివేయబడ్డాయి, కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే చర్యలలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మార్చి 25న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది.



తర్వాత ఒక్కొక్కటిగా.. ‘అన్‌లాక్’ చేసుకుంటూ వస్తుండగా.. విద్యాసంస్థలను తిరిగి తెరవాలనే నిర్ణయంపై నిర్ణయాన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వదిలివేసింది కేంద్రం. ఇక ఢిల్లీలో ఇప్పటివరకు 2,87,930 కరోనా కేసులు నమోదవగా.. గత 24 గంటల్లో కొత్తగా 2258 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు 5472మంది మరణించారు.