Yogi Adityanath: క్రిమినల్స్ వెన్నులో వణుకుపుట్టిస్తున్న యోగి.. మాఫియాను మట్టిలో కలిపేస్తానని ప్రతిజ్ఞ

తుపాకీకి తుపాకీతోనే సమాధానం చెప్పాలనే రీతిలో ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కార్ దూకుడుగా వెళుతోంది.

Yogi Adityanath: క్రిమినల్స్ వెన్నులో వణుకుపుట్టిస్తున్న యోగి.. మాఫియాను మట్టిలో కలిపేస్తానని ప్రతిజ్ఞ

Yogi Adityanath: మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మహా మహా పోటుగాళ్లుగా చెప్పుకున్నోళ్లు ప్రాణభిక్ష పెట్టమంటూ ప్రాధేయపడుతున్నారు. మా కుటుంబాలను వదిలేయండి మహా ప్రభో అంటూ వేడుకుంటున్నారు. తుపాకీకి తుపాకీతోనే సమాధానం చెప్పాలనే రీతిలో ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కార్ దూకుడుగా వెళుతోంది. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రాక్షసులకు పోలీస్ పవర్ ఎలాంటిదో చూపిస్తోంది. ఓ హత్యకేసులో ఐదుగురు నిందితుల్లో నలుగురు 50 రోజుల్లో ఎన్‌కౌంటర్ అయ్యారంటే యోగి సర్కార్ స్పీడ్ ఏమిటో తెలిసిపోతుంది.

ఉత్తరప్రదేశ్‌లో మాఫియా సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath). 2017లో యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి నేరస్తులు, రౌడీలకు సింహస్వప్నంలా మారారు యోగి. ఉత్తరప్రదేశ్‌ను గడగడలాడించిన డాన్ అతీక్ అహ్మద్(atiq ahmed) సామ్రాజ్యాన్ని నిట్టనిలువునూ కూల్చేస్తూ మరోసారి హెడ్‌లైన్స్‌లోకి వచ్చారు యోగి. నేరాల నుంచి వ్యాపారిగా.. ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా అవతారమెత్తి ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. ఓ సారి ఎంపీగా పనిచేసిన క్రిమినల్ పొలిటీషయన్ అతీక్ అహ్మద్‌పై తీవ్ర నిర్బంధం విధించిన యోగి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. వందకు పైగా కేసులు ఉన్నా.. చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న అతీక్‌ను జైల్లో పెట్టి ఓ కేసులో శిక్ష పడేలా చేసిన యోగి… ఇప్పుడు అతీక్ అరాచకాలకు సహకరించిన ఒక్కొక్కరి పనిబడుతూ క్రిమినల్స్ వెన్నులో వణుకుపుట్టిస్తున్నారు.

ఫిబ్రవరిలో సంచలనం సృష్టించిన న్యాయవాది ఉమేశ్‌పాల్(umesh pal) హత్యకేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన యోగి సర్కార్.. మాఫియా డాన్ అతీక్‌కు నరకం అంటే ఎలాగుంటుందో చూపిస్తోంది. అతీక్ మూడో కుమారుడు, ఉమేశ్‌పాల్ హత్య కేసు నిందితుడు అసద్ ఎన్‌కౌంటర్‌తో మాఫియా ముఠా ఆటకట్టించారు పోలీసులు. నేరాలే వృత్తిగా చేసుకుని వ్యాపారాలు, రాజకీయాలు నడిపిన అతీక్‌ ఉత్తరప్రదేశ్‌లో విర్రవీగిపోయాడు. తనకు అడ్డొచ్చిన వారిని హతమారుస్తూ సినీ విలన్ పాత్రలను ప్రయాగ్‌రాజ్‌(prayag raj)లో ప్రత్యక్షంగా చూపాడు. యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత అతీక్‌పై ఉన్న కేసులను తిరగదోడి జైల్లో పెట్టించారు. జైల్లో ఉన్నా అతీక్ అరాచకాలు ఆగేవి కావు. జైల్లో ఉంటూనే వ్యాపారులను, అధికారులను బెదిరించి నేరాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో అతడిని గుజరాత్‌లోని సబర్మతి జైలుకు తరలించింది ప్రభుత్వం.

అతీక్‌ను రాష్ట్రానికి దూరంగా పంపినా అతడి అరాచకాలకు అంతుండేది కాదు. 2005లో ఎమ్మెల్యే రాజుపాల్(Raju Pal) హత్య కేసులో సాక్షిగా ఉన్న న్యాయవాది ఉమేశ్‌పాల్‌ను కిడ్నాప్ చేసి బెదిరించాడు అతీక్. ఈ కేసు విచారణలో ఉండగానే ఫిబ్రవరిలో ఉమేశ్‌పాల్‌ను పట్టపగలు కాల్చిచంపారు అతీక్ అహ్మద్ గ్యాంగ్. ఈ గ్యాంగ్‌లో ఐదుగురు సభ్యులు ఉంటే.. అతీక్ మూడో కుమారుడు అసద్ గ్యాంగ్ లీడర్‌గా పనిచేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఉమేశ్‌పాల్‌ను కాల్చిచంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో కూడా పెద్ద చర్చ జరిగింది. సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం యోగి.. ఆ మరునాడు అసెంబ్లీలో మాఫియాను అంతం చేస్తానని ప్రకటించారు. మీరంతా చూస్తుండండి మాఫియాను మట్టిలో కలిపేంతవరకు నిద్రపోనని ప్రకటించారు యోగి.

ముఖ్యమంత్రి అన్నట్లే ఉమేశ్‌పాల్ హత్యకేసులో నిందితులు ఒక్కొక్కరు అంతం అవుతున్నారు. యోగి అసెంబ్లీలో ప్రతినపూనిన వారం రోజుల్లోనే ఇద్దరు నిందితులు హతమవగా, గురవారం అతీక్ అహ్మద్ కుమారుడు అసద్, అతడి సహచరుడు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులకు.. నిందితులకు మధ్య 45 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఉమేశ్‌పాల్ (umesh pal) హత్య తరువాత తప్పించుకు తిరుగుతున్న అసద్.. మధ్యప్రదేశ్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అతడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కాల్పులు మొదలుపెట్టిన అసద్ చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: బెంగాల్‌లో 35 సీట్లు ఇవ్వండి చాలు.. ఈ పని జరుగుతుంది: అమిత్ షా

పోలీసు వాహనాలను అనుసరించి..
నిజానికి ఉమేశ్‌పాల్ హత్య కేసులో అతీక్, ఆయన సోదరుడు అష్రాఫ్‌లను ఎన్‌కౌంటర్ చేస్తారానే ప్రచారం జరిగింది. ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో జీవితఖైదు పడిన అతీక్ అహ్మద్ గుజరాత్ జైల్లో ఉన్నాడు. మరో కేసులో విచారణ నిమిత్తం గురువారం ప్రయాగ్‌రాజ్ కోర్టులో అతీక్‌ను హాజరుపరిచారు. సుమారు 12 వందల కిలోమీటర్ల ప్రయాణంలో మార్గ మధ్యలో అతీక్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఆ భయంతో అతీక్ బంధువులు, అనుచరులు పోలీసు వాహనాలను అనుసరించారు. ఇదే సమయంలో పోలీసులకు అసద్ ఆచూకీ లభించింది. తండ్రిని తప్పించాలనే ప్లాన్‌తో మాటువేసిన అసద్‌ను గుర్తించి పట్టుకోవాలని ప్రయత్నించారు పోలీసులు. ఈ సమయంలో చోటుచేసుకున్న ఎదురు కాల్పులతో అసద్ అంతం అయ్యాడు.

పిల్లల జోలికిరావొద్దు ప్లీజ్..
అసద్ ఎన్‌కౌంటర్‌తో అతీక్ వెన్నులో వణుకుపుట్టింది. కరుడుకట్టిన నేరస్తుడైన అతీక్ కుటుంబం అంతా జైల్లో ఉంది. అతడి భార్య, తమ్ముడి భార్య మాత్రమే పరారీలో ఉన్నారు. అతీక్‌కు ఐదుగురు కుమారులు అయితే ఇద్దరు జైల్లో ఉండగా, మైనర్లు అయిన మరో ఇద్దరు పోలీసు సంరక్షణలో చదువుతున్నారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే నన్ను చంపేయండి. పిల్లలను, ఆడవాళ్లను ఏమీ చేయొద్దు అంటూ అతీక్ పోలీసులను వేడుకున్నట్లు చెబుతున్నారు.

Also Read: బీజేపీ శైలికి వ్యతిరేకంగా యడియూరప్ప హాట్ కామెంట్స్.. వాటికి వ్యతిరేకమంటూ స్టేట్మెంట్

గుండాగిరీ అంతమే లక్ష్యం
జీరో బ్యాలెన్స్ రౌడీయిజం అనే లక్ష్యం పెట్టుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) యూపీలో గుండాగిరీని అంతం చేస్తానని చెబుతున్నారు. చెప్పడమే కాదు చేతల్లో చేసి చూపిస్తున్నారు. 2017లో అధికారంలోకి వచ్చిన యోగి రెండోసారి గెలవడానికి లా అండ్ ఆర్డర్‌పై ఆయన తీసుకున్న చర్యలే కారణమని చెబుతుంటారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు తగ్గినట్లు కనిపిస్తున్నా.. అతీక్ అహ్మద్‌ వంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేరస్తులు అప్పుడప్పుడూ చెలరేగిపోతున్నారు. ఇప్పుడు యోగి మళ్లీ గోలీమార్ అంటుండటంతో ప్రాణభిక్ష పెట్టమంటున్నారు. తన కన్నకొడుకు ఎన్‌కౌంటర్‌కు తానే కారణం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. యోగి సర్కార్(Yogi Govt) మాత్రం మాఫియాను మట్టికరిపించే వరకు వెనక్కు తగ్గేది లేదంటూ దూకుడుగా ముందుకెళుతోంది.