బాణాసంచాపై బ్యాన్‌.. పటాకుల విక్రయం, వినియోగంపై 7 రాష్ట్రాల్లో ఆంక్షలు.. ఉల్లంఘిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా

  • Published By: naveen ,Published On : November 12, 2020 / 04:44 PM IST
బాణాసంచాపై బ్యాన్‌.. పటాకుల విక్రయం, వినియోగంపై 7 రాష్ట్రాల్లో ఆంక్షలు.. ఉల్లంఘిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా

ban on diwali crackers in seven states: దీపావళిపై కరోనా ఎఫెక్ట్ పడింది. బాణాసంచా వినియోగం, విక్రయాలపై బ్యాన్ పడింది. కరోనా బాధితుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే చాలా రాష్ట్రాలు బాణసంచాపై బ్యాన్‌ విధించాయి. ఢిల్లీ, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్నాటక ఇప్పటికే క్రాకర్స్‌పై ఆంక్షలు విధించాయి. ఇంకోవైపు ఈ అనూహ్య నిర్ణయాలతో బాణాసంచా తయారీదారులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నవంబర్‌ 7 నుంచి 30 వరకు పటాకులు కాల్చడం, అమ్మకాలపై నిషేధం.. ఉల్లంఘిస్తే లక్ష వరకు ఫైన్
కరోనా, వాయు కాలుష్యం దీపావళి పండగపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పలు రాష్ట్రాలు టపాకాయల విక్రయం, వినియోగంపై ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరగడంతో నవంబర్‌ 7 నుంచి 30 నవంబర్‌ వరకు పటాకులు కాల్చడం, అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం లక్ష రూపాయల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

కాగా, కనీసం గ్రీన్‌ క్రాకరీస్‌ అమ్మకాలకు అనుమతించాలని లేదంటే లక్షలాది రూపాయల నష్టం వస్తుందని పటాకుల వ్యాపారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే కరోనా, కాలుష్యాన్ని అదుపు చేయాలంటే బ్యాన్‌ తప్పదని కేజ్రీవాల్‌ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఢిల్లీ గ్యాస్‌ ఛాంబర్‌గా మారిపోవడంతో ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించాలని డిసైడైంది.

దీపావళి పండుగను దీపాలతోనే జరుపుకోవాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ ప్రజలు దీపావళి పండుగను దీపాలతోనే జరుపుకోవాలని, టపాసులు కాల్చవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. గాలి కలుషితమై కొవిడ్‌ రోగులు ఇబ్బంది పడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. పూజా సమయంలో ఎక్కువ మంది గుంపులుగా ఉండొద్దని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది

కర్నాటకలోనూ బాణాసంచాపై బ్యాన్:
బాణాసంచాపై క‌ర్నాట‌క ప్రభుత్వం కూడా నిషేధం విధించింది. వీటిని కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరిగి శ్వాస‌కోస, తదితర అనారోగ్య స‌మ‌స్యలు త‌లెత్తే అవ‌కాశాలు ఉన్నాయని చెబుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, రాజ‌స్థాన్, సిక్కిం రాష్ట్రాలు కూడా మందుగుండు కాల్చడంపై నిషేధం విధించాయి.

శివకాశిలోని ఫైర్‌వర్క్స్‌ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ:
దేశంలో బాణసంచా ఉపయోగంలో 90శాతం ఉత్పత్తి తమిళనాడులో జరుగుతోంది. తాజా నిషేధం శివకాశిలోని ఫైర్‌వర్క్స్‌ పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసింది. 8 లక్షల మంది కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. ఏడాదిలో 70 శాతం వ్యాపారం దీపావళి సీజన్‌లోనే జరుగుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో 30 శాతం ఉత్పత్తి నిలిచిపోవడంతో వ్యాపారులు నష్టపోయారు. ఇపుడు బాణాసంచాపై పలు రాష్ట్రాలు బ్యాన్‌ విధించడంతో స్టాక్‌ను వెనక్కి తీసుకుని డబ్బు రీఫండ్‌ చేయాలని హోల్‌ సేల్‌, రిటైల్‌ వ్యాపారులు శివకాశిలో ఫైర్‌వర్క్స్‌ పరిశ్రమలను కోరుతున్నాయి. ఈ విషయంలో తమిళనాడు సీఎం పళనిస్వామి ఒడిశా, రాజస్థాన్‌ సీఎంలకు లేఖ రాసి నిషేధం ఎత్తివేయాలని కోరారు.