Bengal Chief Secretary : మోడీ వర్సెస్ దీదీ..తారాస్థాయికి సీఎస్ వివాదం

పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్​ బంధోపాధ్యాయ్ విషయంపై కేంద్ర ప్రభుత్వం,మమత సర్కార్​ మధ్య వివాదం కొనసాగుతోంది.

Bengal Chief Secretary : మోడీ వర్సెస్ దీదీ..తారాస్థాయికి సీఎస్ వివాదం

Bengal Chief Secretary

Bengal Chief Secretary పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్​ బంధోపాధ్యాయ్ విషయంపై కేంద్ర ప్రభుత్వం,మమత సర్కార్​ మధ్య వివాదం కొనసాగుతోంది. శుక్రవారం బెంగాల్ లో యాస్ తుపాను వల్ల కలిగిన నష్టంపై చర్చించేందుకు ప్రధాని మోడీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీఎం మమతా బెనర్జీ 30 నిమిషాలు ఆలస్యంగా రావడం,ఆ తర్వాత 15మాత్రమే సమావేశంలో పాల్గొని వెళ్లిపోవడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన నేపథ్యంలో బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలపన్ బందోపాధ్యాయని కేంద్రం రీకాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31 న ఉదయం 10 గంటలకు అయన ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయం లో గల పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

అయితే బంధోపాధ్యాయ్.. ఢిల్లీలో సోమవారం రిపోర్ట్​ చేయటం లేదని బెంగాల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర డిప్యూటేషన్​కు బంధోపాధ్యాయ్​ను రిలీవ్​ చేసే అవకాశాలు లేవని పేర్కొన్నాయి. మరోవైపు, యాస్​ తుఫాను నష్టంపై మమతా బెనర్జీ సోమవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర సచివాలయం నబాన్నలో జరిగే భేటీకి సీఎస్​ ఆలాపన్​ బంధోపాధ్యాయ్​ హాజరవుతారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చర్చల ద్వారా ప్రభుత్వం ఈ విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ న్యాయ మంత్రి మలోయ్ ఘటక్ అన్నారు. అయితే, అవసరమైతే, రాష్ట్రం చట్టపరమైన సహాయం తీసుకుంటుందని అన్నారు. ప్రధాన కార్యదర్శి పదవిలో మార్పులు ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి తనకు ఎలాంటి మెసేజ్ రాలేదని ఘటక్ అన్నారు.

వాస్తవానికి, 1987 కేడర్ ఐఏఎస్ అధికారి అయిన బంధోపాధ్యాయ్ మే-31 రిటైర్డ్ అవ్వాల్సి ఉంది. అయితే కరోనాను ఎదుర్కోనే అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన సేవలను కనీసం ఆరు నెలల పాటు పెంచాలని కోరుతూ ఈ నెల 10న సీఎం మమతాబెనర్జీ.. ప్రధానికి లేఖ రాశారు. మమత విజ్ణప్తిని కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు బంధోపాధ్యాయ్ పదవీకాలాన్ని మూడు నెలలు(ఆగస్టు-30 వరకు) పొడిగిస్తూ కేంద్రం ఈ నెల 24న ఆదేశాలిచ్చింది. బెంగాల్​ సీఎస్​ ఆలాపన్​ బంధోపాధ్యాయ్​ పదవీ విరమణ రోజునే కేంద్రం మరోమారు డిప్యుటేషన్​కు ఆదేశించే అవకాశం ఉందని మాజీ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రిలీవ్​ చేసేందుకు నిరాకరించే అవకాశం ఉన్నందున దానిని అమలు చేయటం కేంద్రానికి క్లిష్టంగా మారొచ్చని పేర్కొన్నారు. ఆలాంటి బదిలీలను తిరస్కరించే ఆల్​ ఇండియా సర్వీస్​ రూల్స్​ను సూచిస్తూ కేంద్రానికి రాష్ట్రం సమాధానం ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి జవహార్​ సిర్కార్​ తెలిపారు. ఏకపక్షంగా ఐఏఎస్​, ఐపీఎస్​ను బదిలీ చేయటం కేంద్రానికి అంత సులభం కాదన్నారు.