గాడ్సే వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ 

  • Published By: veegamteam ,Published On : November 29, 2019 / 09:30 AM IST
గాడ్సే వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ 

మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్‌ గాడ్సేను దేశభక్తుడు అంటూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తటంతో  బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లోక్ సభలో క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించాలని లోక్‌సభలో శుక్రవారం (నవంబర్ 29)అన్నారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారనీ..వక్రీకరించారని అన్నారు. దేశస్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన గాంధీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు.

తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన ఎంపీ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ‘ఈ సభలో ఒక సభ్యుడు నన్ను టెర్రరిస్టుగా సంబోధించారనీ..ఇది నా గౌరవంపై జరిగిన దాడి. నాపై చేసిన ఏ ఆరోపణలు కోర్టులో రుజువు కాలేదని ఆ విషయాన్ని గుర్తించాలని ఎద్దేవా చేశారు. 

‘టెర్రరిస్టు ప్రజ్ఞ.. టెర్రరిస్టు గాడ్సేను దేశభక్తుడంటున్నారు. భారత పార్లమెంటు చరిత్రలో ఇది విచారకరమైన రోజు’ అని రాహుల్ తన  ట్వీట్‌లో అన్నారు.  కాగా..బుధవారం లోక్‌సభలో ఎస్‌పీజీ సవరణ చట్టంపై చర్చలో భాగంగా..డీఎంకే ఎంపీ ఎ.రాజా గాంధీ హంతకుడు గాడ్సే ప్రస్తావన చేసారు. వెంటనే ప్రజ్ఞాసింగ్ కల్పించుకుని ‘ఒక దేశభక్తుడిని ఉదాహరణగా చెప్పడం ఏమిటి?’ అంటూ ప్రశ్నించారు.

గాడ్సేను దేశభక్తుడంటూ ప్రజ్ఞ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర నిరసన తెలిపి సభలో నుంచి వాకౌట్‌ చేశారు. సాధ్వి వ్యాఖ్యలపై చెలరేగిన వివాదంతో బీజేపీ కూడా క్రమశిక్షణా చర్యలకు దిగింది. రక్షణరంగానికి సంబంధించిన పార్లమెంటరీ ప్యానల్‌ నుంచి ఆమెను తొలగించింది. శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకూ పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు సాధ్విని తొలగించామని జేపీ నడ్డా తెలిపారు.