ఎకానమీ గాడిలో పెట్టకుంటే…త్వరలో బీజేపీ ముక్త భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : December 24, 2019 / 11:30 AM IST
ఎకానమీ గాడిలో పెట్టకుంటే…త్వరలో బీజేపీ ముక్త భారత్

జార్ఖండ్ ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చిన సమయంలో ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అధిష్ఠానానికి గట్టి హెచ్చరిక పంపించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ దయనీయంగా ఉందని, దీనిని చక్కదిద్దేందుకు సరైన చర్యలు తీసుకోకపోతే బీజేపీ ముక్త భారత్ త్వరలో వాస్తవం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా నరేంద్ర మోడీకి సలహాలు ఇస్తున్నవారిపై స్వామి విరుచుకుపడ్డారు. మోడీని ఆయన సలహాదారులు అంధకారంలో ఉంచుతున్నారని మండిపడ్డారు. ప్రధానికి సలహాలు ఇస్తున్నవారు ఎవరో తనకు తెలియదని, అయితే వారు ఆయనకు సత్యం చెప్పడం లేదన్నారు
 
అయితే అయిదారేళ్ల క్రితం మునిగిపోతున్న దేశఆర్థికవ్యవస్థను తాము కాపాడమని,ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని,వాటిని అధిగమిస్తామని ఇటీవల మోడీ చెప్పిన విషయం తెలిసిందే. ఎకానమీని తమ ప్రభుత్వం స్థిరీకరించడమే కాక,దానికి క్రమశిక్షణ తెచ్చే ప్రయత్నాలు కూడా చేసిందని మోడీ అన్నారు. పరిశ్రమల యొక్క దశాబ్దాల నాటి పాత డిమాండ్లను నెరవేర్చడానికి కూడా తమ శ్రద్ధ చూపించిందని ప్రధాని అన్నారు. 

ప‌న్ను వ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకువ‌స్తున్నామ‌ని, పారద‌ర్శ‌క‌త‌, సామ‌ర్థ్యాన్ని, బాధ్య‌తను కూడా పెంచుతున్నామ‌న్నారు. కంపెనీస్ యాక్టులో ఉన్న కొన్ని అంశాల‌ను ఎత్తివేయాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. వ్యాపారాన్ని మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేసేందుకు ఈ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మోసాల వ‌ల్ల అన్ని వ్యాపారాలు దెబ్బ‌తిన‌వ‌ని, విఫ‌ల‌మైనంత మాత్రాన దాన్ని నేరంగా చూడ‌రాదు అని మోడీ అన్నారు. ఈ రోజు 13 బ్యాంకులు మళ్లీ లాభాలను ఆర్జించడం ప్రారంభమైందని,ఇది తమ ప్రభుత్వ ప్రయత్నాల ఫలితమని ప్రధాని అన్నారు.