Black Fungus: తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌.. రోజురోజుకు పెరుగుతున్న బాధితులు

Black Fungus: తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌.. రోజురోజుకు పెరుగుతున్న బాధితులు

Black Fungus

Black Fungus Cases: తెలుగు రాష్ట్రాలను బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. రోజురోజుకు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరిగిపోతున్నాయి. అనుమానితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల సంఖ్య 500 దాటినట్టుగా అధికారులు చెబుతుండగా.. ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్న కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి రోగులతో నిండిపోయింది.

తెలంగాణ బ్లాక్‌ఫంగస్‌కు కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో సర్కార్ చికిత్స అందిస్తోండగా.. ఇక్కడ 200 పడకల సామర్థ్యం ఉంది. బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో.. మరో 30 పడకలను అదనంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడీ బెడ్స్‌ అన్నీ నిండిపోయాయి. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో బెడ్స్‌ ఫుల్‌ కావడంతో… సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో బెడ్స్‌ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా బెడ్స్‌ అన్నీ బ్లాక్‌ ఫంగస్‌ బాధితులతో నిండిపోవడంతో.. అదనంగా మరికొన్ని పడకలు సిద్ధం చేస్తున్నారు. కరోనా తగ్గి కేవలం బ్లాక్‌ ఫంగస్‌ ఉన్న రోగులకే కోఠి ఈఎన్‌టీ, సరోజినీలో చికిత్స అందిస్తున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ ఉండి.. బ్లాక్‌ఫంగస్‌ బారిన పడిన వారిని గాంధీకి తరలిస్తున్నారు.

బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, జనగామ జిల్లాల్లో నమోదవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో బాధితులను హైదరాబాద్‌ పంపిస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌కు ప్రస్తుతం లిపోసోమాల్‌ ఆంఫొటెరిసిన్‌ -బీ, పొసకొనజోల్‌, ఇసవుకొనజోల్‌ మందులతో ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ఈ మందులను కొందరు అక్రమార్కులు బ్లాక్‌ మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.

ఏపీలోనూ బ్లాక్‌ ఫంగస్‌ హడలెత్తిస్తుంది. నిన్నటి వరకు ఏపీలో 252 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం ఇంజక్షన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతుండగా.. కోవిడ్‌ వచ్చి తగ్గినవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.