”Prostitution నేరమని చట్టం చెప్పలేదు.. వారికి స్వేచ్ఛ ఉంది”: Bombay HC

”Prostitution నేరమని చట్టం చెప్పలేదు.. వారికి స్వేచ్ఛ ఉంది”: Bombay HC

వ్యభిచారమనేది నేరమని ఏ చట్టంలోనూ లేదని, నచ్చిన వృత్తిని ఎంచుకునే హక్కు మహిళలకు ఉందని Bombay HC (ముంబై హైకోర్టు) వ్యాఖ్యానించింది. ముగ్గురు మహిళలకు విముక్తి కల్పించింది. ఈ మేరకు జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది వ్యభిచారం కేసులో పట్టుబడిన ముగ్గురు యువతులను వుమెన్‌ హాస్టల్‌కు తరలించమని ఆదేశించిన దిగువ కోర్టు నిర్ణయం సరికాదని పేర్కొన్నారు.

‘పీఐటీఏ-1956లో వ్యభిచారాన్ని రద్దు చేయమని ఎక్కడా చెప్పలేదు. దానిని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ ఎటువంటి ప్రొవిజన్‌ లేదు. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వాళ్లకు శిక్ష విధించాలనే నిబంధన ఏమీ లేదు’ అని జస్టిస్‌ చవాన్‌ తెలియజేశారు.



‘ఒక మనిషిని మోసం చేసి, స్వప్రయోజనాల కోసం దోపిడీకి పాల్పడితే మాత్రం కచ్చితంగా శిక్షించదగ్గ నేరమే’ అని స్పష్టం చేశారు. పిటిషనర్లు(బాధితులు) మేజర్లని, వారికి నచ్చిన చోట ఉంటారంటూ దిగువ కోర్టు ఉత్తర్వులు రద్దు చేశారు. సదరు యువతులు, వ్యభిచార వృత్తిని జీవనోపాధిగా మలచుకున్న సామాజిక వర్గానికి చెందిన వారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ముగ్గురు యువతులు వయస్సులు వరుసగా (20),(22),(23) గతేడాది మలాద్‌లోని ఓ గెస్ట్‌హౌజ్‌లో పోలీసులు నిర్వహించిన రైడ్‌లో పట్టుబడ్డారు. వారిని బాధితులుగా పేర్కొంటూ, విటుడిని అరెస్టు చేసి పీఐటీఏ కింద కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో దిందోషి సెషన్స్‌ కోర్టు కేసును విచారించి మహిళలను వసతి గృహానికి తరలించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. సదరు యువతులు అశోక్‌ సరోగీ అనే న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించి, విముక్తి కల్పించాల్సిందిగా అభ్యర్థనను తెలియజేశారు. వారిని తల్లుల దగ్గరకు వెళ్లేందుకు దిగువ కోర్టు అనుమతినివ్వలేదని, సామాజిక వర్గమంతా ఈ వృత్తితోనే జీవనోపాధి పొందుతోందని విన్నవించుకున్నారు.